2019 ఎన్నికలకు మోదీ మాస్టర్ ప్లాన్

Updated By ManamThu, 07/12/2018 - 16:43
Narendra modi
  • దేశవ్యాప్తంగా కిసాన్ ర్యాలీలు

  • ఫిబ్రవరిలోగా 50 వరకూ ఏర్పాటు

  • పంజాబ్ ర్యాలీతో ప్లాన్ అమలు

  • రాష్ట్రాలలో బీజేపీ ముఖ్యుల పర్యటన

Narendra modi

న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల హడావిడి ఇప్పటికే మొదలైంది.. ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. బలాబలాలు తేల్చుకోవడానికి ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహాలు రెడీ చేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలతో విపక్షాలకు మార్గం దొరికింది. కర్ణాటక రాజకీయం దానికి వత్తాసు పలికింది. దీంతో కలిసుంటే కలదు సుఖం.. అంటూ పాడుతూ ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని ఎదుర్కోవడం ఒంటరిగా సాధ్యం కాదంటూ పొత్తులకు రాయబారాలు నడుపుతున్నాయి. 

మహాఘటబంధన్(మహా కూటమి) ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఇప్పటి వరకూ దీనికో రూపం ఏర్పడలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ర్యాలీలు చేపడుతోంది. ఈ పేరుతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఈ పరిణామాలను నిశ్శబ్దంగా గమనిస్తూ వస్తున్న బీజేపీ.. కాంగ్రెస్ సహా విపక్షాలను ఖంగుతినిపించే అవకాశం కోసం చూస్తోంది. విపక్షాల కూటమి ఆచరణలోకి రాకుండా అడ్డుకునేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో ఐదు రాష్ట్రాల రైతులు ఇటీవల ప్రధాని మోదీని కలవడం ఆ పార్టీకి కలిసి వచ్చింది. 

ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాలలోని చెరకు పండించే రైతులు ప్రధానిని కలుసుకుని తమ కష్టాలను వెల్లబోసుకున్నారు. రైతుల కష్టాలను సావధానంగా విన్న ప్రధాని అనతికాలంలోనే మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో వరికి క్వింటాల్‌కు రైతన్న ఏకంగా రూ.200 అదనంగా అందుకోనున్నారు.

ఈ చర్యతో ప్రధాని మోదీ ప్రభుత్వం రైతాంగం అభిమానం సంపాదించుకుంది. కాగా, మద్దతు ధర పెంపు నిర్ణయాన్ని మిగతా రాష్ట్రాల రైతాంగానికి చేరవేసి, మైలేజీ పొందాలన్న ఆకాంక్షతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా విరామంలేకుండా పర్యటిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లోని పార్టీ బూత్ లెవల్ మేనేజర్లతో సమావేశాలు జరుపుతూ బీజేపీ విజయానికి పూలబాట వేస్తున్నారు.

దేశవ్యాప్తంగా బీజేపీ ర్యాలీలు..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా కిసాన్ ర్యాలీలు నిర్వహించాలని, వాటికి ప్రధాని మోదీ హాజరయ్యేలా చూడాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఈ ర్యాలీల పరంపరలో భాగంగా తొలి ర్యాలీ ని పంజాబ్‌లోని ముక్తసర్‌లో ఈ నెల 11న నిర్వహించిన విషయం తెలిసిందే! ఈ ర్యాలీలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని దనుమాడారు. 70 ఏళ్ల పాలనలో దేశం కోసం కాకుండా కేవలం ఒక కుటుంబానికి న్యాయం చేయడానికే కాంగ్రెస్ కట్టుబడి ఉందని విమర్శించారు.

ఇక ఈ నెల 21న ఉత్తరప్రదేశ్‌లోని షాహజన్‌పూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించాలని బీజేపీ రూట్‌మ్యాప్ సిద్ధం చేసింది. అనంతరం ఒడిసా, కర్ణాటకలలోనూ ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ర్యాలీలలో రైతాంగానికి మేలుచేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను హైలెట్ చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. 

ఉత్తరప్రదేశ్ నుంచే ప్రచారం..
ప్రపంచంలో అతిపెద్ద శామ్‌సంగ్ మొబైల్ ఫోన్ల తయారీ ప్లాంటును ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే! ఇదే వేదిక నుంచి మోదీ ఎన్నికల ప్రచారాన్నీ ప్రారంభించారు. ఈ నెల 14, 15 తేదీల్లో యూపీలోని ఆజాంఘర్, వారణాసి, మీర్జాపూర్‌లలో మోదీ పర్యటించనున్నారు. 29న లఖ్‌నవూ స్మార్ట్ సిటీ కార్యక్రమానికి కూడా మోదీ హాజరుకానున్నారు.

ఇలా వచ్చే ఫిబ్రవరిలోగా దేశవ్యాప్తంగా 50 ర్యాలీలకు మోదీ హాజరవుతారని సమాచారం. ఒక్కో ర్యాలీలో రెండు నుంచి మూడు లోక్‌సభ స్థానాలను కవర్ చేసేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్‌లలో ప్రచారం కోసం ప్రధాని ప్రత్యేకంగా పర్యటిస్తారని, పార్టీ సీనియర్ నాయకులు దేశవ్యాప్తంగా పర్యటించనున్నట్లు బీజేపీ పెద్దలు చెబుతున్నారు.

English Title
Narendra Modi Masterplan Before 2019 election Dates Are Announced
Related News