తమ్ముడి కోసం కిరణ్ కుమార్ రెడ్డి త్యాగం?

Updated By ManamFri, 11/09/2018 - 12:37
Nallari kiran kumar reddy
  •     కిరణ్ కుమార్,  కిషోర్ కుమార్‌లను కలిపిన పొత్తు....

  •     తమ్ముడు టీడీపీలో చేరడంతో  స్వంత  ఇంటికి కూడా వెళ్లలేకపోయిన కిరణ్ 

  •     పీలేరు సీటును తమ్ముడి కోసం త్యాగం చేయనున్న కిరణ్?....

Nallari kiran kumar reddy-kishore kumar reddy

తిరుపతి:   తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు విడిపోయిన నల్లారి కుటుంబాన్ని ఏకం చేసింది. తమ్ముడు తెలుగుదేశం,  అన్న కాంగ్రెస్ పార్టీలలో ఉండటంతో ఇబ్బంది పడ్డ  అన్నదమ్ములు పొత్తుతో మళ్లీ కలసి పోయారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి లను కాంగ్రెస్ టీడీపీల పొత్తు కలిపింది. గత రెండు సంవత్సరాలుగా ఇద్దరు అన్నదమ్ములు ఒకరికొకరు ఎదురు పడకుండా ఉండేవారు. కాగా త్వరలోనే ఇద్దరూ కలుసుకునే సందర్భం ఏర్పడనుంది.  

కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి  2014 ఎన్నికల సమయంలో కొత్త పార్టీ పెట్టారు. ఆ పార్టీ నుంచి తన స్వంత నియోజకవర్గమైన పీలేరు నుంచి తన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డిని పోటీలోకి దింపారు.  అయితే కిషోర్ కుమార్ రెడ్డి పరాజయం పొందారు.  వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి చింత ల రామచంద్రారెడ్డి 15 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.  కిరణ్ కుమార్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్లినా, ఏ పార్టీ పెట్టినా తమ నియోజకవర్గంలో తమ కంటూ కొంత మంది సహచరులు ఉన్నారు.

వీరిని  కాపాడుకోవడానికి కిషోర్ కుమార్ రెడ్డి  తెలుగుదేశం పార్టీలో చేరారు. అన్న వద్దని వారించినా, వినకుండా వెళ్లారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. 

వద్దన్నా తెలుగుదేశం పార్టీలో చేరాడని కిరణ్ కుమార్ రెడ్డి  కినుక వహించగా,  తాను తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడానికి ప్రోత్సహించ లేదని కిషోర్ కుమార్ రెడ్డి అలక వహించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ఎడమొకం పెడమొకంగా ఉంటూ  వచ్చారు. ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి పీలేరుకు వచ్చినా, ఇంటికి వెళ్లకుండా,  ఆర్ అండ్‌బి గెస్ట్ హౌస్‌లోనే మకాం వేశారు. ఇంటికి వెళ్లడం వల్ల తమ్ముడు ఎదురు పడితే ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఆయన ఇంటికి వెళ్లలేదని తెలిసింది.

తమ్ముడు కూడా అన్న ఇంటికి రాకపోవడం పట్ల పెద్దగా స్పందింలేదు.  తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో అన్నదమ్ములు కూడా ఒకటయినట్లు తెలుస్తోంది. త్వరలోనే కిరణ్ కుమార్ రెడ్డి పీలేరుకు వచ్చి, నగరిపల్లిలోని వారి ఇంటికి వెళ్లనున్నట్లు తెలిసింది.  

ఎమ్మెల్యేగా పోటీ నుంచి కిరణ్ విరమణ 

Nallari kiran kumar reddy

అన్నదమ్ముల మధ్య సఖ్యత కుదరడంతో కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ నుంచి విరమించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ గృహ నిర్మాణ సంస్థ  చైర్మెన్‌గా ఉన్న  కిషోర్ కుమార్ రెడ్డికి ఆ స్థానాన్ని అన్న త్యాగం చేయనున్నట్లు తెలిసింది. అవసరమైతే తమ్ముడు కోసం ప్రచారం చేయడానికి కూడా ఆయన సిద్దపడినట్లు తెలిసింది.  2009లోకిరణ్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు.  

అంతకు ముందు ఈ నియోజక వర్గం వాయల్పాడులో ఉండటంతో, ఆ నియోజక వర్గం నుంచి గెలుపొందుతూ వచ్చాడు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా తమ్ముడికి సీటు ఇచ్చి, అతని విజయం కోసం  కృషి చేయడానికి సిద్దపడినట్లు తెలిసింది. ఆయన జాతీయ రాజకీయాల వైపుకు వెళ్లే అవకాశం ఉందని తెలిసింది. అయితే భవిష్యత్తు ప్రణాళికను త్వరలోనే రూపొందించి ప్రకటిస్తారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు

English Title
Nallari Kiran Kumar Reddy decides not to contest polls?
Related News