'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' రివ్యూ

Updated By ManamFri, 05/04/2018 - 14:06
nps

npsచిత్రం: నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా

న‌టీన‌టులు: అల్లు అర్జున్‌, అను ఇమ్మాన్యుయేల్‌, అర్జున్‌, శ‌ర‌త్ కుమార్‌, న‌దియా, బొమ‌న్ ఇరాని, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, ప్ర‌దీప్ రావ‌త్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, సాయికుమార్‌, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, కాశీ విశ్వ‌నాథ్‌, స‌త్య కృష్ణ‌న్‌ త‌దిత‌రులు

సంగీతం: విశాల్ - శేఖ‌ర్‌

ఛాయాగ్ర‌హ‌ణం: రాజీవ్ ర‌వి

క‌ళ: రాజీవ‌న్‌

కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు

స‌మ‌ర్ప‌ణ: నాగ‌బాబు

స‌హ‌నిర్మాత: బ‌న్నీ వాస్‌

నిర్మాత: శిరీషా శ్రీ‌ధ‌ర్ ల‌గ‌డ‌పాటి

నిర్మాణ సంస్థ: రామ‌ల‌క్ష్మి సినీ క్రియేష‌న్స్‌

ర‌చ‌న - ద‌ర్శ‌కత్వం: వ‌క్కంతం వంశీ

విడుద‌ల తేది: 4 మే 2018

నిడివి: 168 నిమిషాలు

'క్యారెక్ట‌ర్ వ‌దిలేయ‌డం అంటే.. ప్రాణాలు వ‌దిలేయ‌డ‌మే.. చావు రాక‌ముందు చ‌చ్చిపోవ‌డమే' అనే విష‌యాన్ని బ‌లంగా న‌మ్మే ఓ యారోగెంట్‌ ఆర్మీ అధికారి.. స‌రిహ‌ద్దుల్లో ఉండి దేశాన్ని కాపాడాల‌నే త‌న‌ క‌లని నెర‌వేర్చుకునే ప్రాసెస్‌లో ఆ క్యారెక్ట‌ర్‌ను పోగొట్టుకుంటున్నాను అని అర్థం చేసుకున్నాక‌.. ఏం చేశాడు? అనే పాయింట్‌తో తెర‌కెక్కిన చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం ద్వారా ర‌చ‌యిత వక్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమాపై 'మనం' అందిస్తున్న స‌మీక్ష మీ కోసం..

క‌థ‌

npsసూర్య (అల్లు అర్జున్‌) ఓ ఇండియ‌న్ సోల్జ‌ర్‌. దేశం కోసం ప్రాణాలు ఇవ్వ‌డమే త‌న జీవిత ల‌క్ష్యం. అలాంటి సూర్య‌.. బోర్డ‌ర్‌కెళ్ళి దేశం కోసం యుద్ధం చేయాల్సిన రోజు కోసం ఎదురుచూస్తుంటాడు. అయితే.. సూర్యకున్న ఒకే ఒక బ‌ల‌హీన‌త కోపం. దాన్ని కంట్రోల్ చేసుకోక‌పోవ‌డం వ‌ల్ల క‌ల్న‌ల్ (బొమ‌న్ ఇరాని) అత‌నిని ఆర్మీ నుంచి బ‌య‌ట‌కు పంపేస్తాడు. బోర్డ‌ర్‌కెళ్ళి దేశం కోసం ఫైట్ చేయాల‌న్న‌దే సూర్య క‌ల అని.. శ‌త్రుదేశాలను కూడా మారమ‌ని చెప్పి ఎన్నో అవ‌కాశాలు ఇచ్చిన మ‌నం.. మ‌నోడికి ఒక అవ‌కాశం ఇవ్వ‌లేమా? అని సూర్య‌ గాడ్‌ఫాద‌ర్ (రావు ర‌మేశ్‌) క‌ల్న‌ల్‌ను క‌న్విన్స్ చేస్తాడు. ఒకే ఒక కండిష‌న్ మీద‌.. క‌ల్న‌ల్ అందుకు అనుమ‌తి ఇస్తాడు. అదేమిటంటే.. సైకాల‌జీ ప్రొఫెస‌ర్ రామ‌కృష్ణం రాజు (అర్జున్‌) నుంచి సూర్య ప్ర‌వ‌ర్త‌న స‌రిగ్గా ఉంద‌నే స‌ర్టిఫికెట్ తీసుకుర‌మ్మంటాడు క‌ల్న‌ల్‌. ఆ ప్రొఫెస‌ర్ మ‌రెవ‌రో కాదు.. సూర్య తండ్రే. చిన్న‌ప్పుడే.. ఆగ్ర‌హంతో కూడిన త‌న‌ ప్ర‌వ‌ర్త‌నని త‌ప్పుబ‌ట్టిన తండ్రితో విబేధించిన సూర్య‌.. జీవితంలో ఇంకెప్పుడూ నీ ముఖం చూడ‌న‌ని అత‌నికి, కుటుంబానికి దూర‌మ‌వుతాడు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు అదే వ్య‌క్తి నుంచి ప్ర‌వ‌ర్త‌నకు సంబంధించిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రం కోసం డెహ్ర‌డూన్ నుంచి వైజాగ్ రావాల్సి వ‌స్తుంది. కొన్ని ప‌రిణామాల త‌రువాత‌.. సూర్య స్వ‌యంగా త‌న‌ కొడుకేన‌ని.. 21 రోజుల స‌మ‌యంలో సూర్య త‌న కోపాన్ని జ‌యించ‌గ‌లిగితే స‌ర్టిఫికెట్ ఇచ్చేందుకు సిద్ధ‌మేన‌ని ఆడిటోరియంలో స‌భాముఖంగా ప్ర‌క‌టిస్తాడు రామ‌కృష్ణం రాజు. ఈ గ‌డువులో సూర్య త‌న కోపాన్ని జ‌యించ‌గ‌లిగాడా? త‌న ల‌క్ష్యం కోసం త‌న క్యారెక్ట‌ర్‌ను కోల్పోతున్నాన‌ని అర్థం చేసుకున్నాక సూర్య ఏం నిర్ణ‌యించుకున్నాడు? శ‌త్రుదేశాల్లోనే కాదు.. స్వ‌దేశంలోనూ అంత‌ర్గ‌త శ‌త్రువులు ఉన్నార‌ని తెలుసుకున్న సూర్య వారిపై ఎలాంటి పోరాటం చేశాడు? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఈ చిత్రం. ఈ క‌థ‌లో చ‌ల్లా (శ‌ర‌త్ కుమార్‌) పాత్ర ఏమిట‌నేది కూడా కీల‌క‌మైన అంశం.

విశ్లేష‌ణ‌

npsత‌న కోప‌మే త‌న శ‌త్రువు, క్యారెక్ట‌ర్ వ‌దిలేస్తే ప్రాణం వ‌దిలేసిన‌ట్టే.. ఇలా ఈ రెండు పాయింట్ల చుట్టూ న‌డిచే క‌థే 'నా పేరు సూర్య‌'. ఇదివ‌ర‌కు కూడా ఇలాంటి పాయింట్‌తో కొన్ని సినిమాలు వ‌చ్చాయి. ముఖ్యంగా.. అగ్ర క‌థానాయ‌కుల విష‌యానికి వ‌స్తే.. గ‌తంలో నాగార్జున న‌టించిన 'ర‌క్ష‌కుడు' సినిమాలోనూ ఇదే అంశం క‌నిపిస్తుంది. అందులో దేశాన్ని ఎవ‌రైనా త‌క్కువ చేసి మాట్లాడితే ఊరుకోలేని, సెల్ప్ కంట్రోల్ లేని క‌థానాయ‌కుడు.. 'ప్రేమే ముఖ్య‌మ‌నుకుంటే.. 3 నెల‌లు నా ఫ్యాక్ట‌రీలో ఓర్పుగా ప‌నిచేయ్‌.. లేదంటే నా కూతురుని వ‌దిలేయ్' అంటూ హీరోయిన్ ఫాద‌ర్ పెట్టే కండిషన్‌కు లోబ‌డి ఎలా న‌డుచుకున్నాడు అనేది మెయిన్ పాయింట్‌. ఇక సూర్య విష‌యానికి వ‌స్తే.. బోర్డ‌ర్‌కు వెళ్ళి దేశం కోసం యుద్ధం చేయాల‌ని క‌ల‌గ‌నే క‌థానాయ‌కుడు.. త‌న కోపం కార‌ణంగా ఆ అవ‌కాశాన్ని కోల్పోతాడు. అయితే.. త‌న కోపాన్ని అదుపులో ఉంచుకోగ‌లిగితే త‌న క‌ల నెర‌వేరుతుంద‌ని అర్థం చేసుకున్న‌ క‌ల్న‌ల్ మ‌రో అవ‌కాశాన్ని ఇస్తారు. ఈ ప్రాసెస్‌లో.. సైకాల‌జీ ప్రొఫెస‌ర్ అయిన తండ్రి పెట్టే ష‌రతుకి లోబ‌డి సూర్య ఏం చేశాడు? అన్న‌ది ఈ సినిమాలో చూపించారు. పాయింట్ విష‌యంలో.. పాత‌క‌థ‌నే న‌మ్ముకున్న ద‌ర్శ‌కుడు.. క‌థానాయ‌కుడి పాత్ర‌ను తీర్చిదిద్దిన విధానంలో మాత్రం మంచి మార్కులు స్కోర్ చేశారు. అలాగే హీరో వ్య‌క్తిత్వం చుట్టూ సాగే సినిమా అయిన‌ప్ప‌టికీ.. అర్జున్‌, శ‌ర‌త్ కుమార్‌, సాయికుమార్‌, రావు రమేశ్‌.. ఇలా ప్ర‌తి పాత్ర‌ని కూడా ద‌ర్శ‌కుడు బాగా డిజైన్ చేసుకున్నారు. ఇక ఫ‌స్టాఫ్‌లో ఆర్మీ వాతావ‌ర‌ణంలో డిజైన్ చేసుకున్న స‌న్నివేశాల‌న్నీ బాగున్నాయి. అలాగే తండ్రీకొడుకుల మ‌ధ్య సాగే సంఘ‌ర్ష‌ణని కూడా ప్రీ ఇంట‌ర్వెల్ స‌న్నివేశాల్లో చ‌క్క‌గా ఆవిష్క‌రించారు. లక్ష్యం కోసం త‌న‌ క్యారెక్ట‌ర్ కోల్పోతున్నానని అర్థం చేసుకున్నాక‌.. క‌థానాయ‌కుడిలో వ‌చ్చే మార్పు తాలుకూ దృశ్యాలు స‌హ‌జంగా ఉన్నాయి. అలాగే కార్గిల్‌లో యుద్ధం చేసిన ముస్త‌ఫా (సాయికుమార్‌) కుటుంబానికి సంబంధించిన స‌న్నివేశాలు బాగా కుదిరాయి. అయితే.. కొన్ని అంశాల విష‌యంలో స‌గ‌టు ప్రేక్ష‌కుడి కోసం ప‌క్క‌దారి ప‌ట్టిన ద‌ర్శ‌కుడు (ఉదాహ‌ర‌ణ‌కి.. 'ఇర‌గ ఇర‌గ' సాంగ్‌).. ప‌తాక స‌న్నివేశాల‌ను మాత్రం వారికి దూరంగా వెళ్ళి.. క‌థ‌కు త‌గ్గ‌ట్టు క్లైమాక్స్ డిజైన్ చేసుకోవ‌డం విశేషం. ఓవ‌రాల్‌గా.. సూర్య పాత్ర‌ని ద‌ర్శ‌కుడు ప్రేమించిన విధానం తెర‌పై ప్ర‌తి స‌న్నివేశంలోనూ ప్ర‌తిబింబిస్తుంటుంది. అదే ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం కూడా. అయితే.. క్యారెక్ట‌ర్‌తో పాటు స్క్రీన్‌ప్లే మీద కూడా ఫోక‌స్ చేసి ఉంటే ఫలితం మ‌రోలా ఉండేది. ఏదేమైనా.. ర‌చ‌యిత‌గా స‌క్సెస్ అయిన వంశీ.. అనుభ‌వ‌రాహిత్యం వ‌ల్ల‌ ద‌ర్శ‌కుడిగా అక్క‌డ‌క్క‌డా త‌డ‌బ‌డ్డారనే చెప్పాలి.

npsన‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమాకి ఆక్సిజ‌న్ సూర్య పాత్రే. ఆ పాత్ర‌ని ద‌ర్శ‌కుడు ఎంత చ‌క్క‌గా తీర్చిదిద్దారో.. అంతే చ‌క్క‌గా త‌న న‌ట‌న‌తో తెర‌పై ఆవిష్క‌రించారు అల్లు అర్జున్‌. పాత్ర క‌నిపిస్తున్నంత సేపు.. ఇందులో సూర్య క‌నిపిస్తాడే కానీ బ‌న్నీ క‌నిపించ‌రు. అంత చ‌క్క‌గా ఆ పాత్ర‌లో ఒదిగిపోయారాయ‌న‌. సినిమా మొద‌లైన కాసేప‌టికే.. ఆ పాత్ర‌తో ప్రేక్ష‌కులు ట్రావెల్ చేయ‌డం మొద‌లుపెడ‌తారు. దేశ‌భ‌క్తి, ప్రేమ‌, కోపం, న‌డ‌క‌, న‌డ‌త‌, భావోద్వేగాలు.. వీట‌న్నింటిని కూడా వంక పెట్ట‌ని విధంగా ఆవిష్క‌రించారు బ‌న్నీ. త‌న కెరీర్ బెస్ట్ పెర్‌ఫార్మెన్స్‌లో సూర్య కూడా ఒక‌టిగా నిలుస్తుంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఇక 'ల‌వ‌ర్ ఆల్సో' పాట కోసం క్యాప్ ట్రిక్స్ కోసం త‌ను ప‌డిన క‌ష్టం తెర‌పై క‌నిపిస్తుంది. ఒక్క‌ముక్క‌లో చెప్పాలంటే.. అర్జున్ చేసిన పాత్ర‌ల‌న్నీ ఒక ఎత్తు అయితే.. ఈ పాత్ర ఒక‌టే మ‌రో ఎత్తు. అంత‌లా సూర్య పాత్ర కోసం మేకోవ‌ర్ అయ్యారు. ఇక మిగిలిన పాత్ర‌ల విష‌యానికి వ‌స్తే.. సూర్య ప్రియురాలు వ‌ర్ష‌గా అనుది ప‌రిమిత స‌న్నివేశాల‌కే లోబ‌డి ఉన్న‌ప్ప‌టికీ.. ఉన్నంతలోనూ త‌న గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంది. అర్జున్‌, శ‌ర‌త్ కుమార్‌, సాయి కుమార్‌, రావు ర‌మేశ్, న‌దియా.. ఇలా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ పాత్ర‌ల మేర‌కు చ‌క్క‌గా న‌టించారు.

సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే.. విశాల్ శేఖ‌ర్ పాట‌ల్లో 'సైనిక‌', 'బ్యూటీఫుల్ ల‌వ్‌', 'ల‌వ‌ర్ ఆల్సో ఫైట‌ర్ ఆల్సో' విన‌డానికి, చూడ‌డానికి బావున్నాయి. ఇక నేప‌థ్య సంగీతం విష‌యానికి వ‌స్తే.. సినిమా మూడ్‌ను ఎలివేట్ చేసేలా ఉంది. రాజీవ్ ర‌వి ఛాయాగ్ర‌హ‌ణం కూడా సినిమాకి వ‌న్నె తెచ్చింది. ఆర్మీ వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబించే స‌న్నివేశాల్లోనూ, ప్రీ క్లైమాక్స్‌లో వ‌చ్చే పోరాట దృశ్యాల్లోనూ కెమెరా ప‌నిత‌నం ప్ర‌శంస‌నీయంగా ఉంది. కోట‌గిరి ఎడిటింగ్ బాగున్న‌ప్ప‌టికీ.. ద్వితీయార్థంపై మ‌రికాస్త శ్ర‌ద్ధ పెట్టి ఉంటే బాగుండేదేమో. ఆర్ట్ వ‌ర్క్ కూడా మెచ్చుకోద‌గ్గ విధంగా ఉంది. ఇక మాట‌ల్లో 'ఒక మ‌నిషి స‌మాజంలో బ‌త‌కాలంటే.. ఫ్యామిలీ, కెరీర్‌, ఫ్రెండ్స్‌, ల‌వ్ ఇవ‌న్నీ క‌నీసం ఉండాలి', 'కోపం వ‌స్తే.. కొల‌త‌లేసుకుని కొట్ట‌డం తెలియ‌దు', 'నా శ‌త్రువు నేనే.. నా యుద్ధం నాతోనే', 'క‌ల గ‌న్న రోజు ఎలా ఉన్నామో.. సాధించిన రోజు కూడా అలాగే ఉండాలి', 'నాతో నేను లేన‌ప్పుడు నాతో ఎవ‌డు ఉంటే ఏమిటి?', 'నువ్వు క‌త్తి ప‌ట్టుకునే ఫ్రీడ‌మ్ కూడా ఆయ‌న సంపాదించిందే.. అలాంటి ఆయ‌న్ని చంపేస్తావా?', 'సిట్యుయేష‌న్స్ మారుతుంటాయి.. క్యారెక్ట‌ర్ మార‌కూడ‌దు', 'బోర్డ‌ర్ కెళ్ళి చేయాల్సింది ఇక్క‌డే చేశాడు' వంటి డైలాగులు బాగున్నాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్‌

సూర్య పాత్ర‌

అల్లు అర్జున్ న‌ట‌న‌

భావోద్వేగాలు

స్టోరీ లైన్‌

ప్ర‌థ‌మార్ధం

సంభాష‌ణ‌లు

నేప‌థ్య సంగీతం

ఛాయాగ్ర‌హ‌ణం

నిర్మాణ విలువ‌లు

మైన‌స్ పాయింట్స్‌

స్లో నేరేష‌న్‌

స‌గ‌టు ప్రేక్ష‌కుడు కోరుకునే కామెడీ, క్లైమాక్స్ లేక‌పోవ‌డం

చివ‌ర‌గా.. అల్లు అర్జున్ వ‌న్ మాన్ షో

రేటింగ్‌: 3.25/5                                                       -మ‌ల్లిక్ పైడి

English Title
'naa peru surya naa illu india' review
Related News