నా ఈ జీవితం మీదే

Updated By ManamWed, 05/16/2018 - 14:33
My Life Is Yours Rahul Says Sidhu
  • ఇక 24 గంటలూ పార్టీ కోసమే.. యాక్సిడెంట్ కేసులో కోర్టు తీర్పు అనంతరం రాహుల్‌కు సిద్ధూ మెసేజ్

My Life Is Yours Rahul Says Sidhuచండీగఢ్: ‘‘రాహుల్ నా జీవితం మీదే. ఇక, 24 గంటలూ పార్టీ కోసమే నా సేవలు’’ అంటూ రాహుల్ గాంధీకి సందేశం పంపారు పంజాబ్ స్థానిక సంస్థల మంత్రి,  మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ. 1988లో ఓ వృద్ధుడిని ఢీకొట్టి అతడి మరణానికి కారణమైన సిద్ధూను సుప్రీం కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాకుండా ప్రియాంక గాంధీ, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌లు కూడా ఆయనకు అభినందనలు తెలిపారు. ‘‘తీర్పు వచ్చిన వెంటనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌లు మెసేజ్‌లు పంపారు. వారి నుంచి అలా మెసేజ్‌లు రావడం చాలా ఆనందం కలిగించింది. వెంటనే నేను రాహుల్‌కు కూడా మెసేజ్ పెట్టాను. నా జీవితమే ఆయనదని పంపా. పార్టీ కోసమే నిరంతరం పనిచేస్తానని చెప్పా’’ అంటూ విలేకరులకు తెలిపారు సిద్ధూ.

రాహుల్ గాంధీని కలుస్తానని చెప్పిన ఆయన.. ఇక పూర్తి స్థాయిలో పంజాబ్ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తానని రాహుల్‌కు చెబుతానని అన్నారు. తాను బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరి విజయమీ తీర్పు అని ఆయన అన్నారు. వారి ప్రార్థనలు, మొరలను ఆ భగవంతుడు ఆలకించాడన్నారు. తన కోసం ప్రార్థించిన వారందరికీ శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. ఇక, తీర్పు వచ్చే సమయంలో దానిని తాను అస్సలు పట్టించుకోలేదన్నారు. గుర్రు పెట్టి నిద్రావస్థలోకి వెళ్లినట్టు చెప్పారు. ధ్యానం చేశానని, గంటసేపు తన పెంపుడు కుక్కలతో ఆడుకున్నానని, కాబట్టి తీర్పు సమయంలో ఎలాంటి ఆందోళన లేదని అన్నారు. ఆ యాక్సిడెంట్‌లో ఓ వ్యక్తి ప్రాణం పోయిందని, ఘటన పట్ల తనతో పాటు అందరికీ విచారం ఉందని, కోర్టు ఆ ఘటనను యాక్సిడెంట్‌గానే పరిగణించిందని, కోర్టు ఏది చెబితే దానికి తాను కట్టుబడే ఉంటానని సిద్ధూ స్పష్టం చేశారు. 

English Title
My Life Is Yours Rahul Says Sidhu
Related News