నాన్నపై పడిన మచ్చను చెరిపేసేందుకే

Updated By ManamWed, 05/16/2018 - 12:56
My father Had A Black spot
  • దేవుడు నాకు ఓ అవకాశం ఇచ్చాడు.. అందుకే కాంగ్రెస్‌తో కలిశాం

  • అధికారం కోసం మమ్మల్ని చీల్చేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేసింది

  • 100 కోట్లు, మంత్రి పదవులను ఎరగా వేసింది: కుమార స్వామి

  • మేమంతా ఒక్కటే.. తేల్చి చెప్పిన రేవణ్ణ.. చీలిక కథ కంచికి

My father Had A Black spotబెంగళూరు: సమయం గడుస్తున్నా కొద్దీ కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఫలితాలు వచ్చేదాకా జేడీ(ఎస్) అధిపతి పెద్ద కుమారుడు రేవణ్ణ వర్గం అసంతృప్తిగా ఉందని, రేవణ్ణ వర్గానికి బీజేపీ బంపర్ ఆఫర్లు ఇస్తోందంటూ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ కథనాలు, పుకార్లకు చెక్ పెట్టేశారు రేవణ్ణ. తన సోదరుడు కుమారస్వామితో కలిసి మీడియా ముందుకు వచ్చారు. తామంతా ఒక్కటే అని ప్రకటించారు. దీంతో జేడీఎస్‌లో చీలిక కథనాలకు ఫుల్‌స్టాప్ పెట్టినట్టయింది. ఇక, జేడీఎస్ సీఎం అభ్యర్థి కుమారస్వామి ప్రధాని మోదీపై మండిపడ్డారు. కర్ణాటక తీర్పుతో తీవ్ర అసంతృప్తి చెందానని అన్నారు. అధికారం కోసం బీజేపీ తహతహలాడుతోందని విమర్శంచారు. మత విశ్వాసాలను రెచ్చగొట్టి మాత్రమే బీజేపీ 104 స్థానాలను గెలుచుకోగలిగిందన్నారు. బీజేపీ అన్ని స్థానాలు గెలవడంలో నరేంద్ర మోదీ గొప్పదనం ఏమీ లేదన్నారు. ఓటర్లు వర్గాల వారీగా విడిపోయారన్నారు. లౌకికవాద ఓట్లు చీలిపోయాయన్నారు. కర్ణాటకలో మోదీ హవా ఏ మాత్రం లేదన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో నైతికత గురించి బీజేపీ తమకు వేదాలు వల్లించనవసరం లేదన్నారు.

దేశంలోని ఇతర రాష్ట్రాల్లో బీజేపీ కూడా అలాగే చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తానేమీ సీఎం పీఠం వెనక పరుగులు పెట్టట్లేదన్నారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో చేతులు కలిపామని కుమారస్వామి తెలిపారు. కాంగ్రెస్‌తో కలిపితే మాకు కావాల్సిన మెజారిటీ కన్నా ఎక్కువ సీట్లే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. మాతో పోలిస్తే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. బీజేపీ తొమ్మిది సీట్ల దూరంలో నిలిచిపోయిందన్నారు. అధికారం కోసం తమ పార్టీలో చీలిక తెచ్చేందుకు ఆ పార్టీ విశ్వప్రయత్నాలు చేసిందని, చేస్తూనే ఉందని కుమార స్వామి ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లతో పాటు మంత్రి పదవులను ఎరగా వేసిందని, అదంతా నల్లడబ్బేనని ఆయన ఆరోపించారు. అవినీతి సొమ్ముతో గద్దెనెక్కాలని బీజేపీ పరితపించిపోతోందని మండిపడ్డారు.

‘‘నాకు రెండు వైపుల నుంచి ఆఫర్లు అందాయి. 2004, 2005లో నా తండ్రి బీజేపీతో కలవడం వల్ల ఓ మచ్చ పడింది. ఆ మచ్చను చెరిపేసేందుకే ఆ దేవుడు ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. అందుకే కాంగ్రెస్‌తో కలిసి ముందుకు వెళుతున్నాం’’ అని కుమార స్వామి స్పష్టం చేశారు. ఉత్తరాదిలో ప్రారంభమైన బీజేపీ అశ్వమేథ యాత్రకు కర్ణాటకలో అడ్డుకట్ట పడిందన్నారు. బీజేపీని వీడి తమతో కలిసేందుకు చాలా మంది నూతన ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వాళ్లు ఒక్కరిని లాగాలని చూస్తే.. తామూ అదే పని చేస్తామని, అంతకు రెట్టింపు ఎమ్మెల్యేలను లాగేస్తామని ఆయన హెచ్చరించారు. గవర్నర్ కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన కోరారు. 

English Title
My father Had A Black spot
Related News