నో షేవింగ్ నవంబర్

Updated By ManamTue, 10/30/2018 - 06:00
movement

imageనవంబరు నెలలో 30 రోజుల పాటు పురుషులు గ్రూమింగ్‌కు దూరంగా ఉండే ఉద్యమాన్నే ‘మువంబరు’గా పిలుస్తున్నారు.  అంటే నవంబరు నెల్లో మూమెంట్ అని అర్థం. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు మువంబరుతో మమేకమై కేన్సర్‌పై అవగాహన పెంచే ఉద్యమంలో భాగ మవుతున్నారు. 

 

నో షేవ్
‘బియర్డ్ సీజన్’గా, ‘నో షేవ్ మంత్’గా కూడా మువంబరును వ్యవహరిస్తున్నారు.  నవంబరులో మీసం, గడ్డం, క్రాపు పెంచుకుంటూ నెల రోజులపాటు ఏమాత్రం ట్రిమ్ చేసుకునే అవకాశం లేకుండా ఉండాలి. నెలంతా షేవింగ్, గ్రూమింగ్ మానేయాలి.

image


ఒక నెలలో సెలూన్‌కు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేన్సర్‌పై పోరాటం చేస్తున్న ఎన్జీఓకు విరాళంగా ఇవ్వడం ఇందులో ఆంతర్యం.  అదేంటి..హెయిర్ కటింగ్, షేవింగ్ చేయించుకునేందుకు వేలల్లో డబ్బు ఖర్చవుతుందా అని అనుమానించకండి. ఎందుకంటే ‘టోనీ అండ్ గై’, ‘జావేద్ హబీబ్’ వంటి ప్రముఖ సెలూన్లలో హెయిర్ కటింగ్‌కు వేల రూపాయలు ఖర్చవుతుంది.

ఇక ఇక్కడికి వచ్చాక ఫేషియల్స్, హెయిర్ కలర్, హెయిర్ స్టైలింగ్ వంటివన్నీ మామూలే.  వెరసి వీటన్నింటికీ పెద్ద మొత్తమే ఖర్చవుతుంది కనుక గ్రూమింగ్ ఖర్చు మొత్తాన్ని డొనేట్ చేస్తే చాలా పెద్ద మొత్తమే పోగవుతుంది. అందుకే గత కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా ఈ ఉద్యమం సరికొత్త పుంతలు తొక్కుతూ క్యాన్సర్‌పై అన్ని ప్రముఖ వేదికలపై పోరాటాన్ని చేసే వీలు కల్పిస్తోంది.

జుట్టెందుకు?
imageసాధారణంగా క్యాన్సర్ బారిన పడ్డవారికి ట్రీట్‌మెంట్‌లో భాగంగా శరీరంలోని జుట్టంతా రాలిపోతుంది. దీనికి సూచనగా నవంబర్‌లో గ్రూమింగ్‌కు దూరంగా ఉండాలని ‘నో షేవ్ డాట్ ఓఆర్‌జీ’ పిలుపునివ్వడంతో ప్రముఖులు ఈ ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు. హాలీవుడ్, బాలీవుడ్ హీరోలు దీనిపై పోరాటానికి చొరవ చూపుతున్నారు. రణవీర్ సింగ్ వంటి బాలీవుడ్ హీరోలు వేసిన తొలి అడుగులతో ఇప్పుడీ ఉద్యమం నెటిజన్లలో చర్చనీయాంశంగా మారి..మరింత అవగాహన కల్పిస్తోంది. షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, హతిక్ రోషన్, షాహిద్ కపూర్, జాన్ అబ్రహం వంటి ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు నో షేవ్ నవంబరులో చురుగ్గా పాల్గొంటూ ఎప్పటికప్పుడు ఫొటోలను అప్‌లోడ్ చేస్తూ ఈ ఉద్యమానికి మనదేశంలో మంచి పాప్యులారిటీ తెస్తున్నారు.

యాక్సెసరీస్
imageనో షేవ్ నవంబర్‌లో భాగంగా షర్టులు, బ్రాస్లెట్స్ వంటి ఇతర యాక్సెసరీస్ కూడా మార్కెట్లో లిమిటెడ్ ఎడిషన్ పేరుతో సందడి చేస్తున్నాయి.  వీటి విక్రయాలపై వచ్చే లాభాలను ఎన్జీఓకు ముట్టజెబుతారు. ఇది వెబ్-బేస్డ్ ఎన్జీఓ కావడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సామాన్యులు, ప్రముఖులు ఇందులో పాల్గొంటున్న తీరును అందరూ గమనించవచ్చు. ఔత్సాహికులు వ్యక్తిగతంగా లేదా ఓ సమూహంగా మారి ఈ ఉద్యమంపై తమ ఫీడ్‌బ్యాక్‌ను వెబ్‌సైట్లో పేర్కొనవచ్చు. గ్రూమింగ్ లేకుండా ఉన్న ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేయడంతో నెటిజన్లు క్యాన్సర్‌పై చర్చించడం మొదలుపెడతారు.

 ఇందుకు నోషేవ్‌డాట్ ఓఆర్‌జీ పేరుతో నెటిజన్లు లాగిన్ అయి రిజిస్టర్ చేసుకుని సభ్యత్వం పొందవచ్చు. సోషల్ నెట్‌వర్క్ సైట్లలో లైకులు, ట్వీట్లు, రీట్వీట్లు వంటివి చేస్తూ నెటిజన్లలో అవగాహన పెంచేలా ఈ ఉద్యమం ఏటా మరింత బలోపేతమవుతోంది. ఫండ్ రైజింగ్‌కు ఇది చక్కని మార్గం కావడంతో ప్రపంచం నలుమూలల నుంచి మంచి స్పందన వస్తోంది. క్యాన్సర్ రోగులకు వైద్యంతో సహా ఇతరత్రా సహాయ సహకారాలు అందించేందుకు ఈ మొత్తాన్ని వినియోగిస్తున్నారు. క్యాన్సర్ ప్రివెన్షన్, ఎడ్యుకేషన్, రీసెర్చ్‌పై అంతర్జాతీయ స్థాయిలో పనిచేసేలా నవంబరు ఉద్యమం సహకరిస్తోంది.

image


 

English Title
Muvember Movement
Related News