ఉబర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి!

Updated By ManamThu, 07/12/2018 - 15:33
Woman Dies, Cab Accident, Driver Completes Trip, Charges Her
  • అతివేగంతో క్యాబ్‌ను నడిపిన డ్రైవర్.. చెత్తబండిని ఢీకొట్టిన కారు..  

  • రైడ్ పూర్తికాకముందే చార్జ్ చేసిన ఉబర్ సంస్థ.. 

  • మృతిరాలి భర్త ఫిర్యాదు.. ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు

Woman Dies, Cab Accident, Driver Completes Trip, Charges Herముంబై: ఉబర్ క్యాబ్ డ్రైవర్ అతివేగానికి ముంబై మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలైపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెలరోజుల క్రితం (జూన్ 14న) జరిగిన ఈ ప్రమాద ఘటన ముబ్రా కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నెట్టింది. క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యానికి కారు రోడ్డు పక్కనే నిలిపివున్న మున్సిపల్ చెత్తబండిని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో క్యాబ్‌లో వెనుక సీటులో ప్రయాణిస్తున్న ముంబై  మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ టాంజిల్లా షేక్ (35) తీవ్ర గాయాలపాలైంది. ప్రాణపాయ స్థితిలో ఉన్న ఆమెను అక్కడే వదిలేసి క్యాబ్ డ్రైవర్ ఇంద్రజిత్ సింగ్ భట్టి పారిపోయాడు. అంతేకాక, క్యాబ్ రైడ్‌ పూర్తికాక ముందే ఉబర్ రైడ్ పూర్తయినట్టుగా (ఆమె పేటీఎం ఖాతా నుంచి రూ.568.10) చార్జ్ చేయడం పట్ల మృతురాలి భర్త ముజామ్మిల్ అసహనం వ్యక్తం చేశాడు.

మరుసటి రోజే బెయిల్‌పై డ్రైవర్..
గతంలోనే రెండుసార్లు ఉబర్ డ్రైవర్ ఇంద్రజిత్‌కు ర్యాష్ డ్రైవింగ్‌ పట్ల జరిమానా విధించారని, అయినప్పటికీ మళ్లీ అతన్ని డ్రైవింగ్‌కు ఉబర్ ఎలా అనుమతిస్తారని ముజామ్మిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మృతురాలు టాంజిల్లా షేక్‌ను పోస్టుమార్టం నిమిత్తం రాజ్‌వాడీ మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నివేదికలో.. మహిళా ఇంజినీర్ టాంజిల్లా బ్రెయిన్‌లోకి పగిలిన అద్దాలు చొచ్చుకపోయాయని, కళ్లు కూడా చిధ్రమయ్యాయని, దీనిబట్టి చూస్తే కారు డ్రైవర్ ఎంత వేగంగా క్యాబ్‌ను డ్రైవ్ చేసాడో తెలుస్తోందని వాపోయాడు. మహిళా ఇంజినీర్ మృతికి కారణమైన డ్రైవర్ ఇంద్రజిత్ మరుసటి రోజునే ముందస్తు బెయిల్‌ మీద బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరగడం చూసి షాకైనట్టు ముజామ్మిల్ షేక్ పేర్కొన్నాడు. ఉబర్‌ను సంప్రదించిన నేపథ్యంలో చార్జ్ చేసిన సొమ్మును తిరిగి రిఫండ్ చేసినట్టు తెలిపాడు. 

క్యాబ్ డ్రైవర్ వాదన మరోలా..
మరోవైపు క్యాబ్ డ్రైవర్ ఇంద్రజింత్ సింగ్ భట్టి (59) వాదన మరోలా ఉంది.. జూన్ 14న మధ్యాహ్నం 1.55 ప్రాంతంలో ఓ మహిళ క్యాబ్ బుక్ చేసుకుందని చెప్పాడు. క్యాబ్‌లో వెనుక సీటులో ఎడమవైపున కూర్చొందని తెలిపాడు. అదే సమయంలో భండూప్ ప్రాంతంలో రోడ్డు టర్నింగ్ తీసుకుంటుండగా వెనుక నుంచి ఎవరో తన తలపై గట్టిగా మోదినట్టు చెబుతున్నాడు. వెనుక తిరిగిచూస్తే.. వెనుక సీటులో కూర్చొన్న మహిళ టాంజిల్లా ఫోన్‌లో మాట్లాడుతోందని పేర్కొన్నాడు. 60 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతోనే డ్రైవ్ చేశానని, అంతలో కారు అదుపు తప్పి అక్కడే నిలిపివున్న చెత్త తీసుకెళ్లే వాహనాన్ని ఢీకొట్టినట్టు చెప్పుకొచ్చాడు.  

ఉబర్ స్పందన.. 
క్యాబ్ ప్రమాద ఘటనపై స్పందించిన ఉబ్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ..‘‘డ్రైవర్ తప్పిదానికి మేం ఎంతో చింతిస్తున్నాం. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను వెంటనే ఉబర్ పార్టనర్ సర్వీసు నుంచి తొలగించాం. ఘటనపై పోలీసుల విచారణకు సాధ్యమైనంత వరకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని పేర్కొన్నారు. 

English Title
Mumbai: Woman Dies In Cab Accident, Driver 'Completes Trip' And Charges Her
Related News