బ్యాక్‌ఫుట్‌పై మోదీ

Rahul gandhi
  • రైతులు, యువత సిక్సర్లు కొట్టాలి

  • అన్నదాత సత్తా ఏమిటో మోదీకి తెలిసింది

  • జైపూర్ సభలో ప్రధానికి రాహుల్ చురకలు

జైపూర్: ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సారి వినూత్నంగా క్రికెట్ పరిభాషలో చురకలు అంటించారు. జైపూర్‌లో జరిగిన బహిరంగసభలో రాహుల్ మాట్లాడుతూ ‘‘ప్రధాని నరేంద్ర మోదీ బ్యాక్‌ఫుట్‌లో ఆడుతున్నారు. రైతులు, యువత ముందుకొచ్చి సిక్సర్లు బాదాలి’’ అని పిలుపునిచ్చారు. మూడు రాష్ట్రాల ఎన్నికలతో ప్రధానికి రైతుల సత్తా ఏమిటో తెలిసి వచ్చిందని అన్నారు. ఒత్తిడిలో ఉన్న వ్యవసాయ రంగంలో సమస్యల పరిష్కారానికి రైతు రుణాల రద్దు చాలా చిన్న ముందడుగు అని తెలిపారు. ఈ సమస్యలు పరిష్కారమవ్వాలంటే నూతన హరిత విప్లవం రావాల్సి ఉందన్నారు.  రైతులకు వ్యవసాయ క్షేత్రం వద్దే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి వారి టమోటాలు, బంగాళాదుంపలను ఎగుమతి చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. భారత రైతులు ప్రపంచమంతటికీ ఆహారం సరఫరా చేస్తారన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాము కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగానే దేశవ్యాప్తంగా రైతు రుణాలను మాపీ చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రుణాల మాఫీ రైతులకు ఉపశమనం కలిగిస్తుందని, అయితే ఇది ఒక్కటే తుది పరిష్కారం కాదన్నారు. రఫేల్ ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని ఆయన పునురుద్ఘాటించారు. రఫేల్‌పై పార్లమెంట్‌లో చర్చ జరిగితే ప్రధాని పత్తా లేరని, రెండున్నర గంటలు మాట్లాడిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తాము అడిగిన ఏ ప్రశ్నకూ బదులివ్వలేదని ఆరోపించారు.

సంబంధిత వార్తలు