మోదీ, కేసీఆర్ అసత్యాలతో ప్రజల్ని మోసగిస్తున్నారు

Updated By ManamSun, 10/21/2018 - 04:20
rahul
  • కులం, మతం పేరుతో ప్రధాని విద్వేషాలు సృష్టిస్తున్నారు

  • షుగర్ ఫ్యాక్టరీకి లేని పైసలు... ప్రగతి భవన్‌కెట్లొచ్చినయ్

  • దేశ సమైక్యతను విచ్చిన్నం చేస్తున్న మోదీని ఓడించండి

  • అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్ సర్కార్‌నూ గద్దె దించాలి

  • టీఆర్‌ఎస్, ఎన్డీయే సర్కార్లను విమర్శించిన రాహుల్  గాంధీ

  • అధికారంలోకి వచ్చేది కాంగ్రెసే: పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్

  • ప్రజలు, దొరల మధ్య జరిగే పోరాటం ఇది: భట్ట్డి విక్రమార్క

హైదరాబాద్: అసత్యాలు పలుకుతూ ప్రధాని మోదీ, తెలంగాణ అపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రజలను మోసగిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆరోపించారు. అవినీతి, అక్రమాల్లో మోదీతో కేసీఆర్ పోటీ పడుతున్నారన్నారు.  ఈ  దేశం అందరిది..., కులం, మతం, ప్రాంతం, భాష పేర దేశాన్ని విచ్చి న్నం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని, హామీలిచ్చి వంచించిన కేసీఆర్ సర్కార్‌ను గద్దెదించాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.  శనివారం ఆయన రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేశారు. మధ్యాహ్నం  అదిలాబాద్ జిల్లా భైంసా, కామారెడ్డిల్లో జరిగిన పార్టీ ఎన్నికల బహిరంగ సభల్లో రాహుల్ మాట్లాడారు. నగరంలోని చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన దివస్ కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 
 

image

మూడు సభల్లో రాహుల్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. ప్రజాపోరాటాలను గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే, సీఎం కేసీఆర్ సర్కార్  అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అంటే కేసీఆర్ కు ఇష్టం లేదని, ఆయన పేరు ఉచ్చరించేందుకు కూడా ఇష్టపడరని ఆరోపించారు. అంబేడ్కర్ పేర ఉన్న అంబేడ్కర్ ప్రాణహిత - చెవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని రీ డిజైన్ పేర కాళేశ్వరంగా మార్చారని విమర్శించారు. రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును రూ. లక్ష కోట్లకు పెంచారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు, వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించారని, ఇంటింటికి తాగునీళ్లు ఇవ్వడంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కేసీఆర్ మాటతప్పారని మండిపడ్డారు. మీకు ఇళ్లు వచ్చాయా? దళితులకు మూడెకరాలు పంపణీ చేశారా ? ఇంటింటికి తాగునీళ్లిచ్చారా ? అని ప్రజలను ప్రశ్నించగా,. లేదు...లేదు అంటూ వారి నుంచి సమాధానం వచ్చింది. ఎస్టీ రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని గిరిజనులను దగా చేశారని, ముస్లిం రిజర్వేషన్ విషయంలో సైతం మాటతప్పారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని, కొత్తగా 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని, రైతాంగాన్ని ఆదుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికై కృషి జరుగుతుందన్నారు. పాతబస్తీకి మెట్రోరైల్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఎక్కడికి పోయినా విద్వేషాలు రగిలించడమే మోదీ పని
imageప్రధాని మోదీ దేశంలో ఎక్కడికి వెళ్లినా విద్వేషాలు రగిలిస్తున్నారని , దళితులు,ఆదివాసీలు, మైనారిటీలు,మహిళలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, మహిళలు బయటకు రావడానికి భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించారు. ఈ దేశం వారిది కాదు...అందరిదీ..., అన్నివర్గాల ప్రజలదని అన్నారు. ప్రజలను కుల,మతాలు, ప్రాంతాల పేర దేశాన్ని విభజించేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలకు కేసీఆర్,మజ్లిస్ మద్దతు ఇస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలతో పాటు రాజ్యసభ డిప్యూటి చైర్మన్ ఎన్నిక,అవిశ్వాసతీర్మానం, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు సందర్భంగా కేసీఆర్ భేషరతుగా మద్దతు ఇచ్చిందని, ఆ పార్టీకి మజ్లిస్ వంతపాడుతోందని, టీఆర్‌ఎస్,మజ్లిస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని ముస్లిం మైనారిటీలకు రాహుల్ విజ్ఞప్తిచేశారు. ఉత్తరప్రదేశ్ ,మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో మజ్లిస్ బీజేపీకి మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పేదవర్గాలు,ఆదివాసీలు, పేద ప్రజలు, చిరువ్యాపారులు, అన్ని వర్గాల అభ్యున్నతికై కృషి చేస్తుండగా, బీజేపీ కేవలం 15 మంది సంపన్నుల కోసం పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దనోట్ల సందర్భంగా చిరువ్యాపారాలు, పేదలు క్యూలో నిలబడ్డారు తప్ప,  నీరవ్ మోడీ, అనిల్ అంబానీ తదితరులు క్యూలో వెళ్లి డబ్బులు తీసుకున్నారా అని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దును పాగల్ చర్యగా అబివర్ణించారు.

జీఎస్టీని గబ్బర్ సింగ్ టాక్స్ గా ఆరోపించారు.  నల్లధనం వెలికి తీసేందుకు నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన బీజేపీ తీరా , నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకే ఆర్థిక నేరగాళ్లకు సహకరించిందని నిప్పులు చెరిగారు. మోసగాళ్లు, ఆర్థిక నేరగాళ్లకు మోదీ ప్రభుత్వం సహకరిస్తోందని, మోడీ ఆశీస్సులతోనే నీరవ్‌మోడీ, విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోయారని ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే ప్రజలకు కాపలాదారుగా ఉంటానని మోడీ చెప్పేవారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అనిల్ అంబానీకి కాపలాదారుగా మారారని విమర్శించారు. యూపీఎ హయాంలో ఫ్రాన్స్ యుద్ధవిమానాల తయారీ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ హెచ్‌ఎఎల్ కు ఇవ్వాలని నిర్ణయించగా, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబానీ కంపెనీకి రాఫెల్ విమానాల కొనుగోలు బాధ్యతలు అప్పగించిందని విరుచుకుపడ్డారు .మోడీ చర్యల మూలంగా రూ.30,000 కోట్లు అంబానీకి అనుచిత లబ్దిగా చేకూరిందని రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. యూపీఎ ప్రభుత్వం హయాంలో ఒక్కో యుద్ధవిమానాం రూ.548 కోట్లకు కొనుగోలు చెయ్యాలని నిర్ణయించగా, బీజేపీ ప్రభుత్వం రూ.16 వందల కోట్లకు కొనుగోలు చేసిందని, ఈ వ్యవహారంలో భారత ప్రధాని మోడీ బడాచోర్ అని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఆరోపించారని రాహుల్ చెప్పారు. మిగ్, సుఖోయ్, జాగ్వార్ విమానాల తయారీలో నైపుణ్యం ఉన్న హెచ్‌ఎఎల్‌ను కాదని అంబానీ కంపెనీకి అది కూడ ఒప్పందానికి 10 రోజుల ముందు రిజిస్టరైన కంపెనీకి అప్పనంగా కట్టబెట్టారని నిప్పులు చెరిగారు. హెచ్‌ఎఎల్ నైపుణ్యంలోనే గాక ఆదాయంలో కూడా ముందుండేదని, ప్రభుత్వానికే ఎదురు చెల్లించే స్థితిలో ఉన్న సంస్థను మోడీ సర్కార్ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.

సావర్కర్ వీరుడు కాదు....
సావర్కర్ ను వీరుడు అంటూ బీజేపీ పరివార్ నెత్తినపెట్టుకుంటోందని, ఆయన చిత్రపటాన్ని పార్లమెంట్ లో కూడా పెట్టారని, అసలు అలాంటి వ్యక్తుల ఫోటోలు పార్లమెంట్‌లో పెట్టవచ్చా ? ఆలోచించాలని కోరారు. స్వాతంత్య్ర సమరంలో మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్ధార్ పటేల్, అంబేడ్కర్ తో పాటు జైళ్లో ఉన్న సావర్కర్ తనను జైలు నుంచి తప్పించాలని బ్రిటీష్ ప్రభుత్వానికి లేఖ రాశారని రాహుల్ ఆరోపించారు. జైలు నుంచి విడుదల చెయ్యాలని వేడుకున్నారని, కాళ్లు పట్టుకుంటా? మీరు చెప్పినట్లు చేస్తా అని లేఖలో పేర్కొన్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి వీరుడెలా అవుతారని ప్రశ్నించారు.

English Title
Modi and KCR are deceiving people with lies
Related News