కాళరాత్రులు....

Mla candidates tension for political parties in telangana
  • ఎడతెగని ఆందోళన, గొంతు దిగని   మెతుకు 

  • గెలుపుపై ఆందోళన...క్షణ క్షణం ఉత్కంఠ

హైదరాబాద్ : ఇష్టమైన ఆహారం. ఇష్టమైన పానియం. ఏదంటే అది చిటికెలు అందుబాటులోకి వస్తుంది. ఏది కావాలంటే అది కళ్లముందు దర్శనమిస్తుంది. అయినా వారికి మనశ్శాంతి కరువయ్యింది. చీకటి పడిందంటే నిద్రపట్టడం లేదు. ఏం జరుగుతుందో? ఏం చేస్తే విజయం సాధిస్తాం? ఎలా గండం గట్టెక్కేది? అనుకుంటూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే కాళరాత్రులతో అభ్యర్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. 

పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎమ్మెల్యే అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇన్నాళ్లు ప్రచార పర్వంలో నువ్వా నేనా అన్నట్లు ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు ఇప్పుడు అదే స్థాయిలో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఆలోచిస్తున్నారు. ప్రలోభాలకు గురిచేయడానికి ఎత్తులు వేస్తూ తమ సన్నిహితులతో గెలుపోటములపై ఎడతెరిపి లేని మంతనాలు కొనసాగిస్తున్నారు. ఈ ఎన్నికల పుణ్యామాని కావాల్సినవన్నీ తమ కళ్లెదుటే ఉంచుకుని కంటిమీద కునుకు లేకుండా క్షణం క్షణం ఏం జరుగుతుందో తెలయక అభ్యర్థులు నరాలు తెగే ఉత్కంఠకు గురవుతున్నారు.

ఇన్నాళ్లు ప్రత్యర్ధి అభ్యర్థులకు ధీటుగా ప్రచారం నిర్వహించాం.. ఓటర్లకు సైతం ఇతర పార్టీల కంటే ఎక్కువగా డబ్బులు పంచుతున్నాం.. కానీ ఓటర్లు మనకు ఓటు వేస్తారా? ఇతర పార్టీల అభ్యర్థులకు ఓటు వేస్తారా? అన్నది ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతీ అభ్యర్ధి మదిలో తొలుస్తున్న ప్రశ్న వారిని ఆందోళనకు గురిచేస్తున్నది. ఎన్నికల ప్రచారం ముగియడంతో తమ ముఖ్య అనుచరులు, సన్నిహితులు, ముఖ్య నేతలతో ఎడతెరిపి లేకుండా మంతనాలు సాగిస్తున్న అభ్యర్థులు విజయమే లక్ష్యంగా అందివచ్చే ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. దీనికి తోడు సామాజిక మాధ్యమాల్లో పూటకో సర్వే రిపోర్టు హల్‌చల్ చేస్తుండడంతో అభ్యర్థులు హైరానాకు గురవుతున్నారు. 

గ్రేటర్ ప్రజల ఓటరు నాడిని పసిగట్టలేక అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. గ్రేటర్‌లోని పలు నియోజకవర్గాల్లో త్రిముఖ, కొన్ని చోట్ల ద్విముఖ పోటీ ఉండటంతో అభ్యర్థులు గెలిచేందుకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగపరుచుకుంటున్నారు. పలు సెగ్మెంట్లలో రెబల్స్ పోటీ ఎక్కువగా ఉండడంతో ఓట్లు చీలిపోకుండా ప్రధాన పార్టీల అభ్యర్థులు జాగ్రత్తలు పడుతున్నారు. ఓటర్లకు డబ్బు పంపిణీ మొదలుకుని వారు ఓటు వేసే వరకు అప్రమత్తంగా ఉండాలని స్థానిక నాయకులకు సూచిస్తున్నారు. 

దీంతో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్, సనత్‌నగర్, కుత్బుల్లాపూర్‌తో పాటు పలు నియోజకవర్గాల్లో పలు పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం తమ అనుమాయులతో రహస్యంగా సర్వేలు చేయిస్తూ ప్రజలు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సర్వే రిపోర్టుల ప్రకారం త మ నియోజకవర్గ పరిధిలో ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నామో తెలుసుకుంటూ అక్కడి ఓటర్లకు ఏం కావాలో సమకూర్చుతూ తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

దీంతో పాటు స్థానిక ఉండే బస్తీ నాయకులు, ఇతరత్రా చిన్నపాటి నాయకులు ఎవరైనా తనకు వ్యతిరేఖంగా పనిచేస్తున్నారా అనే వివరాలు సేకరిస్తూ వారిని పిలిపించుకుని వారికి కావాల్సింది అప్పగిస్తున్నారు. పోలింగ్‌కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో నియోజవకర్గంలో ఓటింగ్ శాతం పెరిగేలా కృషి చేయడంతో పాటు ఓటర్లు అధిక సంఖ్యలో తమకే ఓటు వేసేలా అభ్యర్థులు ఎవరికి వారు క్షణం తీరిక లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు.

సంబంధిత వార్తలు