చైనా క్యాంపుల్లో మగ్గుతున్న మైనారిటీలు

america
  • బందీలుగా 20 లక్షల మంది 

వాషింగ్టన్:  కమ్యూనిస్టు దేశం చైనాలో మైనారిటీలను పెద్ద ఎత్తున బందీలుగా చేయడంపై అమెరికా ధ్వజమెత్తింది. సుమారు 8 లక్షల నుంచి 20 లక్షల మంది మైనారిటీలు చైనా క్యాంపుల్లో మగ్గుతున్నారని.. ఇది మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని వైట్ హౌస్ హెచ్చరించింది. జియాంక్ ప్రావిన్స్‌లో స్థానికులైన ఉయ్‌ఘర్ ముస్లింల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని..వీరిని అదుపుచేసేందుకు చైనా ప్రభుత్వం రహస్యంగా ఇంటర్న్‌మెంట్ క్యాంపులను నిర్వహిస్తోంది. ఈ వార్తలను అధికారులు ఖండిస్తున్నారు. 

ప్రత్యక్ష నరకం
2017 ఏప్రిల్ నుంచి స్థానిక కజకిస్థాన్‌కు చెందిన మైనారిటీలను అధికారులు బందిస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం అంచనా వేసింది. తొలుత ఇలాంటి క్యాంపులేవీ నిర్వహించడం లేదంటూ బుకాయించిన చైనా ఆతరువాత వీటిని ‘ఒకేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్లు’గా ఈ క్యాంపులను పేర్కొంది. అయితే ఈ క్యాంపుల్లో ఉయ్‌ఘర్ మేధావులు, రిటైర్డు ప్రొఫెసర్లు కూడా బందీలుగా జీవితం గడుపుతున్నారు. ఈ క్యాంపుల్లో కనీసం తమను ప్రార్థనలు కూడా చేయనివ్వడం లేదంటూ గతంలో అక్కడి దుర్భర జీవితం గడిపినవారు వివరిస్తున్నారు. తమను ఇస్లాం మతం వీడి చైనా కమ్యూనిస్టు పార్టీని స్వీకరించాల్సిందిగా విపరీతంగా ఒత్తిడి వస్తోందని మైనారిటీలు వాపోతున్నారు. చైనాలో ఉన్న వేలాది మసీదులను మూసేయడం లేదా కూల్చేయగా మరికొన్ని మాత్రం కమ్యూనిస్టు ప్రచార కేంద్రాలుగా రూపాంతరం చెందాయని స్కాట్ బస్బీ అనే అధికారి వెల్లడించారు. కనీసం వలసపోయేందుకు కూడా తమకు దారులు మూసుకుపోయేలా చైనా ప్రభుత్వం పక డ్బందీగా చర్యలు చేపట్టిందని..ఎవరైనా తమ దేశ పొలిమేరలు దాటితే వారిని తమ దేశం తిప్పి పంపాల్సిందిగా ఇరుగు పొరుగు దేశాలకు చైనా ఆదేశాలు జారీచేసింది. ఇలాంటి వారిని చైనా విపరీతంగా వేధించి, భయపెడుతుందని పేర్కొన్న బస్బీ, టిబెటన్లపై కూడా చైనా అణచివేత ధోరణి ప్రదర్శిస్తూ నిరంతర నిఘా పెడుతోందని వివరించారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆధ్వర్యంలో పౌర సంఘాలు, స్థానిక మైనారిటీలపై ఉక్కుపాదం మోపుతుండగా చైనాలో మతపరమైన స్వేచ్ఛ అడుగంటిందనే ఆరోపణలు తీవ్రమయ్యాయి.

Tags

సంబంధిత వార్తలు