అవి రెండూ సినిమాలా..!?: యనమల

Updated By ManamWed, 06/13/2018 - 15:07
Minister Yanamala Ramakrishnudu Fire On YSRCP Chief Jagan Comements

Minister Yanamala Ramakrishnudu Fire On YSRCP Chief Jagan Comements

అమరావతి: వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర ముగించుకుని రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీదుగా తూర్పుగోదావరిలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. టీడీపీ సర్కార్, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరం అనే రెండు సినిమాలు చూపిస్తూ పబ్బం గడిపేస్తున్నారంటూ జగన్ మండిపడ్డ సంగతి తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ..  పోలవరం, అమరావతిని రెండు సినిమాలని జగన్ వ్యాఖ్యానించడం బాధ్యతారహితమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఈ వ్యాఖ్యల ద్వారా తన అవివేకాన్ని బయటపెట్టుకున్నారని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు విధ్వంస రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి ఎద్దేవా చేశారు.

కన్నా గురించి మాట్లాడుతూ.. కాపు రిజర్వేషన్, ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోదీని.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు కోరలేదని సూటి ప్రశ్న సంధించారు. ఉద్దేశపూర్వకంగానే కాపు రిజర్వేషన్, ప్రత్యేక హోదాను కన్నా గాలికొదిలేశారని మంత్రి యనమల వ్యాఖ్యానించారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు, కన్నా ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.

English Title
Minister Yanamala Ramakrishnudu Fire On YSRCP Chief Jagan Comements
Related News