మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థపకుడి కన్నుమూత

Updated By ManamTue, 10/16/2018 - 09:55
Paul Allen
  • కేన్సర్‌తో మరణించిన పాల్ అలెన్

  • బిల్‌గేట్స్‌తో చదువు మాన్పించిన వ్యక్తి

  • చిన్ననాటి స్నేహితుడే..

  • భాగస్వామి తర్వాత గేట్స్‌తో విభేదించి బయటకు

  • వాటాలు యథాతథం.. వాటితో సంపద

  • గుండె బద్దలైందని వాపోయిన బిల్‌గేట్స్

  • ప్రపంచాన్ని మార్చిన వ్యక్తి: సత్య నాదెళ్ల

Paul Allen

 

 వాషింగ్టన్ : తన స్నేహితుడైన బిల్ గేట్స్‌ను హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి చదువు మధ్యలో మాన్పించి, ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ పెట్టించిన ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు పాల్ అలెన్ (65) మరణించారు. మైక్రోసాఫ్ట్ సంస్థ కార్పొరేట్ స్థాయికి ఎదగడానికి ముందే, అంటే 1983లోనే గేట్స్‌తో వచ్చిన గొడవ కారణంగా అతడు మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలగారు.

అయితే భాగస్వామ్యంలో ఆయన వాటా కారణంగా జీవితాంతం కావల్సినంత డబ్బు వస్తూనే ఉంది. దాంతో విలాసవంతమైన పడవలు, రాక్ మ్యూజిక్, క్రీడా బృందాలను కొనడం, మెదడు మీద పరిశోధనలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో ఇన్నాళ్లూ జీవితం గడిపేశారు. నాన్ హాడ్కిన్స్ లింఫోమా అనే ఒక రకమైన కేన్సర్ కారణంగా అలెన్ మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

2009 సంవత్సరంలో కూడా ఒకసారి ఆయనకు ఈ వ్యాధి వచ్చి, తగ్గింది. అయితే ఇటీవల మరోసారి ఇది తిరగబెట్టింది. 1980లలో మైక్రోసాఫ్ట్‌లో ఉన్నప్పుడు కూడా ఒకసారి ఆయనకు ఈ వ్యాధి వచ్చింది. రెండు సార్లు బయటపడినా, మూడోసారి మాత్రం అది ఆయన ప్రాణాలను కబళించింది. స్వతహాగా సంగీత ప్రేమికుడైన అలెన్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో చాలా పెద్ద పెద్ద వాళ్లు స్నేహితులుగా ఉండేవారు. దాదాపు వంద కోట్ల డాలర్ల మేర డబ్బును దాతృత్వ ప్రాజెక్టుల మీదే ఆయన ఖర్చు చేశారు.

తనకున్న అత్యంత ప్రియాతిప్రియమైన స్నేహితుడైన అలెన్ కన్నుమూసిన విషయం తెలిసి తన గుండె బద్దలైందని బిల్‌గేట్స్ చెప్పారు. ప్రపంచాన్ని మార్చిన అలెన్ తాను మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉండేవారని మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల అన్నారు. సీటెల్‌లో మాత్రం ఆయనకు రావాల్సినంత ప్రశంసలు రాలేదని క్రాస్‌కట్ అనే వెబ్‌సైట్ వ్యవస్థాపకుడు డేవిడ్ బ్రూస్టర్ చెప్పారు.

పాల్ గార్డెనర్ అలెన్ 1953 జనవరి 21న సీటెల్‌లో పుట్టారు. ఆయన తండ్రి లైబ్రేరియన్‌గాను, తల్లి టీచర్‌గాను పనిచేసేవారు. వయసులో బిల్ గేట్స్ కంటే అలెన్ రెండు సంవత్సరాలు పెద్ద. కానీ, సీటెల్‌లోని లేక్‌సైడ్ స్కూల్లో 1968లో కంప్యూటర్ రూంలో కలిసినప్పుడు ఇద్దరికీ ఒకే రకమైన అభిరుచులు ఉన్నాయని గుర్తించారు.

తొలిసారి అలెన్‌కు కేన్సర్ వచ్చినపుడు రేడియేషన్ చికిత్సతో కొంత నయమైంది. కానీ, 2009లో నాన్‌హాడ్కిన్స్ లింఫోమా అనే బ్లడ్ కేన్సర్ వచ్చినపుడు చాలా ఇబ్బంది పడ్డారు. 2010 ఏప్రిల్ నాటికి దాన్నుంచి కోలుకున్నారు. కానీ, 2018లో మరోసారి అది వచ్చి, ఆయనను కబళించింది. 1986 సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ ప్రారంభించినపుడు ఆయనకున్న 28 శాతం షేరు ఆ తర్వాతి కాలంలో ఆయనను కోటీశ్వరుడిగా చేసింది.

1999 నాటికి ఆయనకు 3వేల కోట్ల డాలర్ల సంపద ఉండేది. కానీ 2000 సంవత్సరంలో వచ్చిన సంక్షోభంతో ఆయన సంపద ఆవిరైంది. 2018 అక్టోబరులో అలెన్ సంపద దాదాపు 21.7 బిలియన్ డాలర్లు ఉంటుందని, ఆయన ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో 44వ స్థానంలో ఉన్నారని ఫోర్బ్స్ పత్రిక అంచనా వేసింది. ఆయన పేరు మీద మొత్తం 42 పేటెంట్లు ఉన్నాయి.

English Title
Microsoft co-founder Paul Allen dies of cancer
Related News