వేధింపులంటే ఇవీ..

Updated By ManamMon, 10/15/2018 - 14:18
Sexual harassment at workplace explained
  • పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు ఓ చట్టం

  • రాజస్థాన్ ఘటనతో సుప్రీం స్పందన

  • తర్వాతే విశాఖ మార్గదర్శక సూత్రాలు

  • 2013లో చట్టం చేసిన పార్లమెంటు

  • మూడేళ్ల నుంచి జీవితఖైదు వరకు శిక్ష

  • ఎన్నాళ్ల తర్వాతైనా వేధింపుల ఫిర్యాదు

  • మహిళల రక్షణకు పలు నియమాలు

sexual harassment in work place

న్యూఢిల్లీ: ‘మీ టూ’ ఉద్యమం ఊపందుకుంది. గతంలో ఎప్పుడెప్పుడో జరిగిన సంగతుల దగ్గర నుంచి ఇటీవలి కాలంలో తాము ఎదుర్కొన్న వేధింపుల వరకు అన్నింటినీ మహిళలు నిర్భయంగా బయటపెడుతున్నారు. ఒకప్పుడు సమాజం ఏమనుకుంటుందో అన్న భయంతో ఊరుకున్నవాళ్లు ఇప్పుడు తమకు లభిస్తున్న అండదండలతో అన్నీ బయటకు చెప్పేస్తున్నారు.

వీటిలో చాలావరకు పని ప్రదేశంలో జరుగుతున్న లైంగిక వేధింపులే ఉంటున్నాయి. వీటికి భారతీయ శిక్షాస్మృతి (ఐసీపీ)లో ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఉంది. దేశంలో తొలిసారి 1997లో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లో జరిగిన ఒక సామూహిక  అత్యాచారం కేసుపై రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును విశాఖ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. 

ఈ కేసు విచారణ సందర్భంగా.. పని ప్రదేశంలో జరిగే లైంగిక వేధింపులకు సంబంధించి సరైన చట్టపరమైన రక్షణ లేదని సుప్రీంకోర్టు గుర్తిచింది. అప్పుడు పని ప్రదేశంలో లైంగిక వేధింపులు అంటే ఏంటో కోర్టు నిర్వచించింది. పార్లమెంటు చట్టం చేసేవరకు చట్టపరంగా చెల్లుబాటు అయ్యేలా కొన్ని మార్గదర్శక సూత్రాలను వెల్లడించింది. సుప్రీంకోర్టు అలా చె ప్పడానికి ముందువరకు అలాంటి కేసులను ఐపీసీ సెక్షన్లు 354 (మహిళల గౌరవానికి భంగం కలిగించడం), సెక్షన్ 509 (మహిళల గౌరవానికి భంగం కలిగించే మాటలు మాట్లాడటం లేదా చర్యలు చేయడం) కింద విచారించేవారు.

ఆ కేసులో.. రాజస్థాన్ మహిళా అభివృద్ధి ప్రాజెక్టులో పనిచేసే ఓ ఉద్యోగిని.. బాల్యవివాహాన్ని అడ్డుకున్నందుకు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. జైపూర్‌కు సమీపంలో ఉండే ఓ గ్రామానికి చెందిన శక్తిమంతులైన భూస్వాములు ఈ కేసులో నిందితులు. నిమ్నకులానికి చెందిన ఓ మహిళ గుర్జర్ కుటుంబంలో జరిగే బాల్యవివాహాన్ని ఆపారని వాళ్లు ఆగ్రహించారు.

ఈ ఘటన 1992లో జరిగింది. హైకోర్టు విచారణలో నిందితులను నిర్దోషులుగా తేల్చారు. దాంతో విశాఖ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు 1997లో సుప్రీంను ఆశ్రయించారు. అప్పుడే పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు మన దేశంలో ఒక నిర్వచనం అంటూ వచ్చింది. విశాఖ మార్గదర్శక సూత్రాలను చట్టరూపంలోకి తేవడానికి మరో 16 ఏళ్లు పట్టింది. 2013 సంవత్సరంలో పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు (నిరోధం, నిషేధం, పరిష్కారం) చట్టం వచ్చింది. 

ఏవి వేధింపులు?
పనిప్రదేశంలో లైంగిక వేధింపులు అంటే అవి భౌతికంగా, భావాలపరంగా లేదా ఆర్థిక భద్రతకు సంబంధించి ఒక మహిళా ఉద్యోగిని రక్షణకు ముప్పు కలిగించే చర్యలు. చట్టపరంగా చెప్పాలంటే, లైంగిక వేధింపులు అంటే.. లైంగికపరంగా ఆమోదించలేని ప్రవర్తనలు. అవి ఇలా ఉంటాయి...

1) భౌతికంగా ముట్టుకోవడం, అతిప్రవర్తన;
2) లైంగికచర్య కావాలని కోరడం లేదా డిమాండు చేయడం;
3) బూతు అర్థం వచ్చే వ్యాఖ్యలు చేయడం;
4) బూతు వీడియోలు లేదా బొమ్మలు చూపించడం;
5) భౌతికంగా ఆమోదించలేని.. లైంగిక తరహా ప్రవర్తన

పని ప్రదేశంలో తీవ్రంగా అవమానించడం, ఆమె ఆరోగ్యానికి, భద్రతకు సమస్యలు రావడం లాంటివి ఎక్కువగా ఉన్నా కూడా ఆమె లైంగిక వేధింపులకు గురవుతున్నట్లుగా భావిస్తారు. యజమాని లేదా సహోద్యోగులు ఏవైనా మాటలు లేదా చేష్టల ద్వారా ఉద్యోగినులకు పని చేయలేని వాతావరణం కల్పించినా అది కూడా లైంగిక వేధింపు కిందకే వస్తుంది. క్విడ్ ప్రో కో ఒప్పందం ప్రకారం మహిళలను ఒప్పించినా అది కూడా లైంగిక వేధింపే అవుతుందని 2013 చట్టం చెబుతోంది. 

సాధారణంగా కొన్ని కేసులలో ఫలానా పని చేయించిపెట్టినందుకు ఆమె అంగీకారం ప్రకారమే అలా జరిగిందని నిందితులు చెప్పుకొనే అవకాశం ఉంది కాబట్టి ఈ క్లాజును ప్రత్యేకంగా చేర్చారు. నిందితులు బాధితులను శారీరకంగా ముట్టుకోవాల్సిన అవసరం లేకుండానే లైంగిక వేధింపుల పరిధిలోకి వస్తారు. మాటలతో తిట్టడం, పనికిమాలిన జోకులు, లైంగిక ప్రవర్తన, బూతు బొమ్మలను షేర్ చేయడం, పరువుకు భంగం కలిగించేలా వదంతులు వ్యాప్తి చెందించడం.. ఇవన్నీ కూడా లైంగిక వేధింపులే అవుతాయి. 

2013 చట్టంతో పాటు విశాఖ మార్గదర్శక సూత్రాల ప్రకారం లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయడానికి ఇంత కాలం అనేది ఏమీ ఉండదు. గతంలో ఎప్పుడో జరిగిన వాటి గురించి కూడా ఎప్పుడైనా ఫిర్యాదు చేయచ్చు. ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం పనిప్రదేశంలో లైంగిక వేధింపులకు పాల్పడిన వయక్తికి మూడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. అదే అత్యాచారం కూడా జరిగితే, సెక్షన్ 376 ప్రకారం గరిష్ఠంగా జీవితఖైదు వరకు కూడా శిక్ష విధిస్తారు. అదే బాధితురాలు మరణించినా, లేదా జీవచ్ఛవంలా మిగిలిపోయినా శిక్ష మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. 

English Title
MeeToo: What you should know about sexual harassment in the workplace
Related News