మ(మృ)గ నాన్నలు!

Updated By ManamWed, 10/31/2018 - 05:57
story

story‘‘ధరణీ...! చూశావా మన పాప ‘డాడీ’ అంటోంది.’’ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ అరిచాడు సుమన్, ఒళ్ళోని పాపను భుజాల మీదకు ఎక్కించుకుని వంటగదిలోకి వస్తూ. ‘‘సరె.. సరె.. మహానుభావా! ఎక్కడైనా చంటిపిల్లలు మొదట అత్త అనో, అమ్మ అనో అంటారు గానీ ‘డాడీ’ అనరు. మీ కల కావొచ్చు. పోన్లెండి మీ సంతోషం మీది’’ నవ్వుతూ అంది ధరణి మరిగిన టీని వడకడ్తూ. ‘‘చెబితే నమ్మవేంటి? సర్లె.. ఇదిగోరా అమ్మలు.. ‘డాడీ’ అను, ఇందాక పిలిచినట్టు. అప్పుడే మీ మమ్మీ నమ్ముతుందట’’ పాపతో ధీమాగా అన్నాడు సుమన్.

పాప సుమన్ వంక చూసి అప్పుడప్పుడే వస్తున్న రెండు చిన్ని పళ్ళు కనిపించేలా నవ్వింది కేరింతలు కొడ్తూ. ‘‘ప్లీజ్.. ప్లీజ్.. ఒక్కసారి అనరా బంగారూ.. డాడీ.. డాడీ.. అను’’ అన్నాడు మళ్ళీ పాపను బుజ్జగిస్తూ. ఆటల్లో పడిపోయింది కానీ, ‘డాడీ’ అనలేదు పాప. దాంతో డీలా పడిన సుమన్ వంక జాలిగా చూసి, ‘‘అంటుంది లెండి.. దానికి మళ్ళీ మూడొచ్చినపుడు’’ చెప్పి టీ కప్పు చేతికిచ్చి, పాపను తీసుకెళ్ళింది పాల గ్లాసు పుచ్చుకుని ధరణి. మర్నాడు హడావిడిగా ఆఫీస్‌కి బయలుదేరుతున్నాడు సుమన్. కారు స్టార్ట్ చేస్తుంటే పాపతో టాటా చెప్పిస్తూ చేయి ఊపింది ధరణి. ‘‘తా..తా.. డాడీ’’ అంది పాప. ధరణి ఆశ్చర్యంగా చూసింది. అంటే నిన్న సుమన్ చెప్పింది నిజమే అన్నమాట. సాయంత్రం సుమన్ రాగానే అదే విషయం చెప్పింది. సుమన్ పాపను ఎత్తుకుని ‘‘ఇప్పుడు నమ్మావన్నమాట. కడుపులో మోయటం తప్ప ఎప్పుడూ డాడీతోనే కదా నా బంగారు ఉండేది. డాడీ అనక మమ్మీ అని ఎలా అంటుంది’’ మురిసిపోతూ  అంటున్న సుమన్‌ని ఆనందంగా చూసింది ధరణి. నిజానికి ధరణి కడుపుతో ఉన్నపుడు అబ్బాయే కావాలని కోరుకుంది. ఆడపిల్లంటే వ్యతిరేకతతో కాదు. నెలసరిలో తనలా నరకం అనుభవించడం, కడుపులు, కానుపులు అంటూ తన బిడ్డ కూడా బాధపడకూడదని. ఇంకా.. రోజులు ఆడపిల్లల విషయంలో అస్సలు బాగాలేవన్న భయంతోనూ. కానీ, సుమన్ మాత్రం ‘‘ఆడపిల్లే కావాలోయ్ నాకు. మహలక్ష్మిలా ఇల్లంతా మువ్వలు పెట్టుకుని తిరుగుతుంటే ఆ కళే వేరు’’ అనేవాడు. డెలివరీ రోజు కూడా ఆ హాస్పిటల్‌లో తనకు ముందు నలుగురికి మగపిల్లలు పుడితే, తనకే ఆడపిల్ల పుట్టింది. ‘‘పైన తథాస్తు దేవతలుంటారని ఊరికే అనలేదు పెద్దలు. మీ మాటే నెగ్గింది లెండి’’ అంది ధరణి పుట్టిన పాప వంక అపురూపంగా చూస్తూ.

‘‘మమ్మీ.. నేను సాయంత్రం సూక్తి వాళ్ళింటికెళ్ళి నోట్స్ రాసుకొస్తా. డాడీ ఆఫీస్ నుంచి వచ్చేటపుడు నన్ను పికప్ చేస్కుని రమ్మని చెప్పు’’ ధరణితో చెప్పింది తొమ్మిదవ తరగతి చదువుతున్న నిశ్చయ. ‘‘సరే. డాడీ వచ్చి కనిపిస్తే గానీ బయటకు రాకు. అన్నట్టు సూక్తి వాళ్ళ కార్ లోనేగా వెళ్ళేది?’’ అడిగింది ధరణి. ‘‘అవును. వాళ్ళ మమ్మీకి డ్రైవింగ్ వచ్చు. ఆంటీ తీస్కెళ్తుంది’’ చెప్పింది నిశ్చయ. ఆ రాత్రి ఇంటికొచ్చిన దగ్గర్నుంచీ నిశ్చయ చాలా డల్‌గా కనిపించింది. భోజనం కూడా వద్దని చెప్పింది. ‘‘ఏమైంది నాన్నా?’’ ఫీవరేమో అని కూతురి నుదుట చేయి వేసి చూసింది ధరణి. ‘‘ఏం లేదు మమ్మీ. ఆకలి కాలేదు. నిద్రవస్తోంది అంతే’’ చెప్పేసి గదిలోకెళ్ళిపోయింది. ‘‘హోంవర్క్, చదువు ఒత్తిడిలో ఉన్నట్టుంది. ఎక్కువగా విసిగించక పాలు ఇచ్చేయి ధరణీ’’ చెప్పాడు సుమన్. ఆ రోజు మొదలు నిశ్చయ ప్రవర్తనలో చాలా తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది ధరణికి, సుమన్‌కు. తల్లితో బాగానే మాట్లాడ్తోంది కానీ, తండ్రి రాగానే చదువుకోవాలని వెళ్ళిపోతోంది. అంటీ ముట్టనట్టు మాట్లాడ్తోంది. ధరణికి ఏమీ అర్థం కాలేదు. ‘‘డాడీ మీద ఏమైనా కోపమా బంగారూ? నాకు తెలియకుండా నిన్నేమైనా కోప్పడ్డారా?’’ నిజానికి తనైనా విసుక్కుంటుంది కానీ, సుమన్ పల్లెత్తు మాటైనా అనడని తెలిసీ అడిగింది ధరణి. ‘‘అదేం లేదు మమ్మీ’’ చెప్పింది గానీ తండ్రి విషయంలో మునుపటంత ఫ్రీగా వుండలేకపోతోంది. పది రోజుల తరువాత ఒక ఆదివారం రోజున సూక్తి వాళ్ళ అమ్మతో కలిసి ఏదో యాక్టివిటీ చేయడానికి నిశ్చయ ఇంటికి వచ్చారు. సూక్తి అందంగా బుట్టబొమ్మలా వుంది. కానీ, ఏదో బెరుకు వల్ల ముఖం కళా విహీనంగా కనిపించింది ధరణికి. హాల్లో సూక్తి, నిశ్చయ వారి పనిలో వుంటే ధరణి, సూక్తి తల్లి టీవీ చూస్తూ కబుర్లలో పడ్డారు. ఏదో పనిమీద బయటకు వెళ్ళిన సుమన్ వచ్చాడు.

‘‘హాయ్ సూక్తీ.. హవ్వార్యూ? ఇందాక ఆంటీ చెప్పింది నువ్వొచ్చావని. ఇద్దరికీ చాక్లెట్స్ తెచ్చా. తీస్కోండి’’ అంటూ జేబులోంచి ఫైవ్ స్టార్స్ తీసిచ్చాడు సుమన్. బెరుగ్గా చూస్తూ మొహమాటంగా నవ్వి చాక్లెట్ అందుకుంది సూక్తి. వణుకుతున్న చేతి నుంచీ చాక్లెట్ క్రిందపడిపోతే తీసి అరచేయి పట్టుకుని అందించాడు సుమన్ వెంటనే. అంతే! సూక్తి భయంతో వణికిపోయింది. చాక్లెట్ విసిరేసింది. బిగ్గరగా ఏడవటం మొదలు పెట్టింది. ఇంటికెళ్ళిపోదామని తల్లితో గట్టిగా చెప్పేసరికి ధరణి, సుమన్.. ఇద్దరూ బిత్తరపోయారు. ‘‘అరె.. ఏమైందిప్పుడు? ఓకే ఓకే.. నేను వెళ్ళిపోతాను. ఎందుకో నన్ను చూసి భయపడ్తున్నట్టుంది పాప’’ అనేసి గదిలోకెళ్ళిపోయాడు సుమన్. కాఫీ కలపడానికి వెళ్ళిన ధరణి వెనుకే వచ్చింది సూక్తి తల్లి కూడా వంటగదిలోకి. ‘‘మీరు ఏమీ అనుకోనంటే ఒక విషయం అడగొచ్చా?’’ అంటూ మొదలుపెట్టింది ధరణి. ‘‘అడగండి. సూక్తి గురించి పెద్దగా పట్టించుకోకండి. తను చాలా సెన్సిటివ్. ఈమధ్య ఎందుకో విపరీతంగా బిహేవ్ చేస్తోందది’’ అందామె. ‘‘లేదండీ. అంత తేలిగ్గా పిల్లల మనోభావాల్ని తీసిపారేయకూడదు. ఎందుకంటే.. మీ ఇంటినుంచి వచ్చినప్పట్నుంచీ మా పాప కూడా చాలా విపరీతంగా ప్రవర్తిస్తోంది. కొంచెం అనునయంగా అడిగి చూడండి. ఈ కాలం రోజులసలే బాగా లేదు కూడా. విసుక్కుంటే ఏమీ చెప్పలేక కుమిలిపోతారు. ఆ ప్రభావం వారి భవిష్యత్తు మీద పడుతుంది’’ చెప్పింది ధరణి.

‘‘మమ్మీ.. సూక్తి వాళ్ళ మమ్మీ డాడీలు డైవోర్స్ తీస్కున్నారు’’ ముభావంగానే చెప్పింది నిశ్చయ కొన్నాళ్ళ తరువాత.
సూపర్ మార్కెట్‌లో అనుకోకుండా ఒకరోజు సూక్తి తల్లి కనిపించింది. కాఫీ షాప్‌కి తీసుకెళ్ళి ధరణి చేతులు పట్టుకుని ఏడ్చేసింది. ధరణికి ఏమీ అర్థం కాలేదు. ‘‘ఆరోజు మీరు చెప్పింది నిజమే. నిశితంగా గమనించాను. మా వారు అస్తమానూ ఇంటర్నెట్‌లోనే ఉండేవాళ్ళు. ఏమో అనుకున్నా. తండ్రి అనే పదానికే మాయని మచ్చలా వాడు ఎదుగుతున్న సూక్తి వంక కూడా అదో రకంగా చూడటం గమనించాను. ఆ చూపులకు సూక్తి అర్థం కాని జుగుప్సతో ముడుచుకుపోయేది. కన్న తండ్రి గురించి నాకే చెప్పలేక బిడ్డ తల్లడిల్లి పోయింది. అదే మనసుతో ఏ మగవాళ్ళను చూసినా చివరికి స్కూల్లో మగ టీచర్లని చూసినా వణికిపోయే స్థితికి వచ్చేసింది. ఆ ప్రవర్తన ఒకరు చెబితే పోయేది కాదు. ఆ ఆలోచన రావటమే అసలు తప్పు. అందుకే అతనిలోని మృగ తండ్రిని భరించలేక డైవోర్స్ ఇచ్చేశాను’’ చెప్పింది బాధగా. ‘‘అలాంటి వాళ్ళలో మరి మార్పు ఎలా?’’ మనసులో మాట బయటకే అంది ధరణి. ‘‘బుద్దొచ్చింది. విచక్షణ మరిచిన పశువయ్యాను. క్షమించు ప్లీజ్.. అని పశ్చాత్తాప పడినట్టు బ్రతిమాలాడు. కానీ మనిషి మలినమైనా పర్వాలేదు. మనసు మలినమైన అతన్ని నమ్మలేక విడిగానే ఉంటున్నా’’ చెప్పింది తను.

ఆ రాత్రి నిశ్చయ నిద్రపోయాక భర్తతో విషయం చెప్పింది ధరణి. ‘‘అంటే.. పాపను వాడు ఆ రోజు అలాగే చూసి వుంటాడు. స్నేహితురాలి బాధను పంచుకోవటంతో బాటు సొంత తండ్రిమీద అనుమానం కూడా పెంచుకుందన్నమాట.’’ తనూ మగవాడే అయినా మగజాతిమీదే అసహ్యం వేసింది మొదటిసారిగా సుమన్‌కి. 

‘‘ఎలా? అసలెలా ధరణీ?!.. తన చేతుల్లో కళ్ళు తెరిచిన పసి గుడ్డుని చూసి ప్రతి తండ్రీ తన తల్లి స్థానంలో కూతుర్నుంచి చూసుకుంటాడు. మురిసిపోతాడు. ఎదిగే కూతుర్ని పూలతోటకు కంచె వేసినట్టు ఏ చెడు దృష్టీ పడకూడదని తానే కంచెలా మారి కాపాడుకుంటాడు. అలాంటిది.. ఆ కళ్ళకు ఎలా వస్తుంది అలాంటి వక్ర దృష్టి?’’ బాధా, దుఃఖం కలగలిసిన గొంతుతో అన్నాడు సుమన్. ఆ రోజు నుంచీ కూతుర్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు సుమన్. తానే నిశ్చయ కళ్ళకు కనిపించకుండా గదిలోనే బందీగా ఉండిపోయేవాడు. ఎప్పుడైనా ఎదురుపడితే ‘‘సారీ తల్లీ’’ అని తప్పుకుపోయే వాడు. అలాగే ఆరు నెలలు గడిచింది. ఆరోజు ఫాదర్స్ డే. ఉదయ రేఖలు విచ్చుకుంటున్న సమయంలో ఇంకా తెలతెలవార్తుండగా తమ గది తలుపులు తడుతున్న చప్పుడుకి మెలకువ వచ్చింది సుమన్‌కి. తలుపు తీస్తూనే గుమ్మంలో నిలబడి కనిపించింది నిశ్చయ, చేతిలో కుండీలో నిన్న విరిసిన తెల్ల గులాబీ పువ్వును పట్టుకుని. ఆశ్చర్యంగా చూస్తుండగానే ‘‘హ్యాపీ ఫాదర్స్ డే డాడీ’’ అంది పువ్వున్న చేతిని ముందుకు చాపి. గద్గదమైన గొంతుతో ‘‘థాంక్యూ బంగారూ’’ అన్నాడు సుమన్.

‘‘సారీ డాడీ.. ఎవరో కొందరు అలాంటి అంకుల్స్‌ని చూసి అందర్నీ అలాగే అనుకోవటం పొరపాటని మీరు నన్ను దూరం పెట్టాకే తెలిసొచ్చింది. నన్ను క్షమిస్తారు కదూ’’ అంది బుగ్గల మీదికి కన్నీళ్ళు కారిపోతుంటే. ‘‘లేదు తల్లీ.. అలాంటి సందర్భంలో ఎవరేం చెప్పినా అర్థం కాదు. నెమ్మది మీద నీకే అర్థమౌతుందని నేను దూరంగా వున్నానంతే. నువ్వు మా అమ్మవురా. అమ్మంటే ఎవరికైనా ప్రాణమే కానీ కోపం, మరే ఆలోచనా రాదు. నువ్వెప్పటికీ నా అరచేతిలో కళ్ళు తెరిచిన పసిమొగ్గవే తల్లీ’’ కూతురి నుదుటిమీద ముద్దుపెట్టి కళ్ళు తుడుస్తూ అన్నాడు సుమన్. తండ్రి వాత్సల్యానికి కరిగిపోతూ వొళ్ళో వాలిపోయింది నిశ్చయ. తండ్రీ కూతుళ్ళ వంక హాయిగా చూస్తూ టీపాయ్ మీదున్న సెల్ ఫోన్ అందుకుంది ధరణి, ఊళ్ళో తన ఫోన్ కోసం ఆశగా ఎదురుచూసే తండ్రికి ‘ఫాదర్స్ డే’ విషెస్ చెప్పడానికి.
సెల్: 9247500819

Tags
English Title
Me and my dad!
Related News