తయారీ దిగాలు-రిటైల్ కుదేలు

Updated By ManamSun, 05/13/2018 - 01:35
walmart

image‘అశోకుడు రహదారికిరుపక్కలా చెట్లు నాటించెను, రోడ్ల వెంట వసతి సౌకర్యం కల్పించెను’ అని చిన్నప్పుడు క్లాసు పుస్తకాల్లో చదివి బాటసారులకు నీడనిచ్చి, సేద దీర్చేటందుకు తపన పడ్డ మౌర్యవంశ రాజు ఎంత మంచివాడో అని గొప్ప గా చెప్పుకునేవారం. తరువాత కాలంలో ‘వ్యాపారుల రాకపోకలు సాఫీగా సాగడం కోసమే అశోకుడీ సౌకర్యాలు కల్పించాడు’ అని విజ్ఞులు చెబితే దేశంలో వ్యాపారాభివృద్ధికి పాటుపడిన ఈ పాలకుడి దార్శనికతను మరింత మెచ్చుకున్నాం. అశోకుడి కాలంలో ఇట్లా మొదలైన దేశీయ వాణిజ్యాన్ని గుప్తులు విస్తరింపజేసి, విదేశాలతోనూ వ్యాపారాలు కొనసాగించారనీ చదువుకున్నాం. దాని కోసమే వారు నౌకాయానాన్ని ప్రోత్సహిస్తూ ఆ రంగంలో పలు ఆవిష్కరణలకు తెరతీశారనీ, సముద్రమార్గంలో గ్రీకు దేశం దాకా మన సరుకులను అమ్మడం ద్వారా భారతీయ ఔన్నత్యానికి గుర్తింపు తెచ్చారనీ తెలుసుకుని ‘అబ్బో... అందుకే వారు స్వర్ణయుగం సృష్టించగలిగారు’ అనుకున్నాం. కానీ ఈ విదేశీ వాణిజ్యం వల్లనే మన దేశ వనరులు, సంపన్నతపై కన్నుకుట్టి వారు దాడులు చేశారనీ విన్నప్పుడు ‘అయ్యో...’ అనిపించేది. అయితే కాలక్రమంలో విదేశీయుల దండయాత్రలు పెరిగి సమాజం విచ్ఛిన్నమవుతుండడంతో దీనికి విరుగుడుగానే సామాజిక సంబంధాలు పటిష్టంగా కొనసాగించి మనుషుల మధ్య ఐకమత్యాన్ని నిలిపేటందుకు భారతీయులు ‘స్వయం పోషక’ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని అన్ని వర్గాల వారూ సహోదరుల్లా కలిసిమెలిసి జీవించడం అలవరచుకున్నారని పెద్దలు చెప్పింది విని మన వారి ఆలోచనా పటిమకు, మేధో పరిణితికి సంతోషించాం. అయితే ఈ వ్యవస్థను కూడా వ్యాపారం పేరుతో వచ్చిన వివిధ దేశాల వాణిజ్య కంపెనీలు ఇక్కడి వ్యవస్థను కూలదోసి, వనరులను కొల్లగొట్టి, సంపదను పట్టుకుపోవడానికి ప్రయత్నించాయి. ఈ క్రమంలోనే ఆయా దేశాలకు చెందిన ఇవి కలహించుకున్నాయి. పరస్పరం దాడులు చేసుకున్నాయి. సాయుధ ఘర్షణలకు పాల్పడ్డాయి. వీటిలో పైచేయి సాధించిన బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ గుత్తగా భారతదేశంపై దోపిడీకి తెగబడింది. ప్రకృతి సంపదను, మానవ వనరులను కొల్లగొట్టింది. ఎన్ని రకాలుగా దోచుకోగలరో అన్ని రకాలుగానూ దోపిడీ కొనసాగించిందంటూ చదువుకుంటూంటే గుండెలు భగభగమండుతాయి. మనస్సు కుతకుతలాడుతుంది. మహాత్మాగాంధీ వంటి నేతల నేతృత్వంలో ఎంతో మంది జాతీయోద్యమం నడిపి ఈ సామ్రాజ్యవాదులను పారదోలారు అని తెలుసుకుంటే ఆవేదన తగ్గింది. అంత బలవంతుడిని ఆయుధం లేకుండా తరిమివేశామని గర్వంగానూ అనిపిస్తుంది.

వలసపాలన పోయి స్వయం పరిపాలన వచ్చింది కదా! అని ఊపిరి పీల్చుకుంటున్న దేశంపై దోపిడీదారులు ఈసారి తమ ఆర్థిక పంజాను విసిరారు. డబ్ల్యు.టి.ఓ.పేరుతో మరోసారి మన సంపదపై దాడి చేశారు. ఈ భూతం నుంచి దేశీ య వాణిజ్య వ్యవస్థను కాపాడుకోవడంలో భాగంగా విదేశీ పెట్టుబడులను, సంస్థలను కట్టడి చేయడానికి ఎన్నో నిబంధనలు పెట్టాం. ‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు ఈ బహుళజాతి కంపెనీలు మాయోపాయాలతో ఏదో ఒక రూపంలో వస్తూనే ఉన్నాయి. ఇలాంటిదే ఒక దారి ఆన్‌లైన్ వాణిజ్యం. ప్రత్యక్షంగా కాక పరోక్షంగా ఇవి దేశంపై పడుతూనే ఉన్నాయి. ఈ కోవలోదే ఇటీవల దేశీయ ఆన్‌లైన్ వ్యాపార సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ను అవెురికా బహుళజాతి రిటైల్ మార్కెట్ సంస్థ వాల్‌మార్ట్ చేజిక్కించుకోవడం కూడా. అందుకే ఈ ఆర్థిక సామ్రాజ్యవాద బహుళజాతి రక్కసి కబంధ హస్తాల్లో చిక్కకుండా భారతీయ రిటైల్ రంగం బయటపడి బతకగలుగుతుందా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తరతరాలుగా సమాజానికి ఊతమిస్తున్న మన రిటైల్ రంగం వాల్‌మార్ట్ వల్ల రూపుమాసిపోనుందని ఆందోళనలు వెలువెత్తుతున్నాయి. నాడు ఈస్టిండియా కంపెనీ రూపంలో బహుళజాతి డేగలు మన గ్రామీణ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసినట్లుగా నేడు ఈ వాల్‌మార్ట్ మన రిటైల్ రంగాన్ని మింగి దానిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కుటుంబాలను వీధులపాలు చేస్తుందన్న భయాందోళనలు నిజమే అనిపిస్తుంది. అయితే అంత ప్రమాదమేమీ లేదన్న వ్యాఖ్యానాలూ వినవస్తున్నాయి. కేంద్ర సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి భారతీయ జనతా పార్టీ మాతృసంస్థ ఆర్.ఎస్.ఎస్. అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ వెలిబుచ్చుతున్న అనుమానాలు, వ్యక్తం చేస్తున్న సందేహాలు పరీక్షిస్తే అందరి గుండెల్లోనూ గుబులు రేగుతుంది. ఈ నేపథ్యంలో ఈ వాదవివాదాల్లోని వాస్తవమెంతో తెలుసుకుందాం.

అసలు కథ
దేశీయ ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం 16 బిలియన్ డాలర్లు (లక్ష ఐదువేల కోట్లకు పైగా రూపాయలు) వెచ్చించి వాటాను అవెురికా బహుళజాతి సంస్థ వాల్‌మార్ట్ సంస్థ చేజిక్కించుకుంది. ఈ ఒప్పందం భారత్‌కు మేలు చేస్తుందని ఈ సందర్భంగా వాల్‌మార్ట్ సీఈవో డగ్‌వెుక్‌మిలన్ ప్రకటించారు. కొంత కాలంలో లక్షలాది మంది ఉద్యోగాలు వస్తాయని, స్థానికంగా సరుకులను సమీకరించడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని కూడా ఆయన చెప్పారు. వినియోగదారులకు ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ప్రస్తుత ప్రపంచీకరణ కాలంలో చిన్న చేపలను పెద్ద చేపలు మింగినట్లు చిన్న కంపెనీలను పెద్ద సంస్థలు ‘టేకోవర్’ చేయడం సాధారణమే. అయితే ఈ ఒప్పందంతో చిన్న చేపను రాక్షసబల్లి... డైనోసార్ మింగినట్లు స్వదేశీ కంపెనీని, బహుళజాతి సంస్థ కొనుగోలు చేసిందని చెబుతున్నారు. మల్టీబ్రాండ్ రిటైల్ ఎఫ్.డి.ఐ.పై ఉన్న పరిమితులను ఈ కామర్స్ దారిలో వాల్‌మార్ట్ ఉల్లంఘించిందనీ తేటతెల్లం చేస్తున్నారు. దీని వల్ల ఎన్నో నష్టాలు ఎదురవుతాయని, అవి దేశీయ వ్యాపార రంగ చిత్రానే ఛిద్రం చేసే ప్రమాదముందని వ్యాఖ్యానిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ మంగళవారం దాకా స్వదేశీ కంపెనీ. కాబట్టి ఇది ఇక్కడే వ్యాపారం కొనసాగిస్తుంది. పన్నులు చెల్లిస్తుంది. స్థానిక వనరులను మన అవసరాల మేరకు సద్వినియోగం చేస్తుంది. మనవారికే ఉద్యోగాలు కల్పిస్తుంది. దేశీయ తయారీ రంగాన్ని వృద్ధి చెందిస్తుంది. ఆర్జించిన లాభాలనూ ఇక్కడే పెట్టుబడులుగా పెడుతుంది. ఆ విధంగా ఇది దేశానికెంతో మేలు చేస్తుంది. కానీ ఇప్పుడది మల్టీనేషనల్ కంపెనీలో భాగ వైునందున అంతా ‘విదేశీయమే అవుతుంది. ప్రయోజనాలూ వారికే అందుతాయి. అందుకే స్వదేశీ జాగరణ్ మంచ్ దీనిపై వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది. వాల్‌మార్ట్ నిబంధనలను కాలరాస్తూ దొడ్డిదారిన భారత్‌లోకి ప్రవేశిస్తోందని, జాతి ప్రయోజనాలకు ఇది ప్రమాదకరమని చెప్పింది. ఈ ఒప్పందం సందర్భంగా డగ్ మెక్‌మిలన్ ప్రవర్తన, ప్రకటనలు చూస్తే ఇది నిజమే అనిపించి మనకూ భయం కలుగుతుంది. ప్రపంచంలోనే అతి పెద్దదిగా చెప్పుకుంటున్న ఈ ఒప్పందం గురించి కనీసం ‘కర్టెసీ’ కోసమైనా ఆయన ప్రధానిని గానీ, ఇతర ప్రభుత్వ పెద్దలను గానీ కలవడానికి ప్రాధాన్యతనివ్వలేదు. పైగా ఈ కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వపరమైన అనుమతులుకూడా ఈజీగానే వస్తాయని ధీమా వ్యక్తం చేశారంటే మన వ్యవస్థలను వారెంత మేరకు ఖాతరు చేస్తున్నారో అర్థమవుతూనే ఉంది. 


అంతేకాదు తమ ఈ కొనుగోలు వల్ల ఎన్ని లక్షలాది ఉద్యోగాలు వస్తాయని ప్రకటించిన ఆయనే ‘ఎన్ని ఉద్యోగాలు?’ అన్న ప్రశ్నకు ‘కచ్చితమైన గణాంకాలు చెప్పలేవు’న్నారు. ‘కొంత కాలానికి అన్న అంశంపైనా ఎంత కాలమని చెప్పలేం అన్నారు. అంటే దేశీయ కంపెనీ ద్వారా ‘బ్యాక్‌డోర్’ పద్ధతిలో భారత్‌లోకి రావడమే వారికి ముఖ్యం కానీ, దేశానికి జరిగే ప్రయోజనాలంటే వారికి ఏమాత్రం ఆసక్తి లేదన్న విషయం స్పష్టమవుతుంది. నాలుగైదేళ్లలో భారత్‌లో కొత్తగా 50 స్టోర్లను ఏర్పాటు చేస్తామన్న ఆయన ప్రకటనను ఉటంకిస్తున్న నిపుణులు ఒక్కో చోట స్టోర్ ప్రారంభిస్తూంటే ఆ ప్రాంతంలోని లక్షలాది రిటైల్ మార్కెటీర్లు తమ దుకాణాలు మూసేసి ఉపాధి లేక వీధుల పాలవుతూంటే వీరు వందల మందికి మాత్రం ఉద్యోగాలు కల్పిస్తున్నామంటూ ఊదరగొడతారు, ఇలాంటి అవాస్తవాలతో ‘చావగొట్టి చెవులు మూస్తారం’టున్నారు. దేశీయ రిటైల్ రంగాన్ని ఈ ఒప్పందం తీవ్రంగా దెబ్బతీస్తుంది. అందుకని దీన్ని విభిన్న కోణాల్లో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని భారతీయ వర్తకుల సంఘం సీఐఏటీ డిమాండ్ చేసింది. దీనిపై ప్రభుత్వాన్ని, కాంపిటీషన్ కమిషన్‌ను సంప్రదిస్తామని అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తామని ఆ సంఘం సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ వెల్లడించారు. సీపీఎం వంటి కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
 
రూపుమాయనున్న రిటైల్ రంగం
వాల్‌మార్ట్ ప్రస్తుత ప్రవేశం తొలి అడుగేననీ, భవిష్యత్తులో మరెన్నో ఆన్‌లైన్ కంపెనీలు ప్రవేశించి భారతీయ రిటైల్ మార్కెట్‌ను చేజిక్కించుకుంటాయనీ వ్యాపారవేత్తలు కొందరంటున్నారు. భారత్‌లో దాదాపు ఏడు కోట్ల మంది ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న డిజిటలైజేషన్, స్మార్ట్‌ఫోన్ వినియోగం, గ్లోబల్ కల్చర్ వల్ల మూడేళ్లుగా దేశంలో ఆన్‌లైన్ మార్కెటింగ్ క్రమంగా పెరుగుతుంది. జనాభాలో ఉన్న 30-40 కోట్ల మధ్యతరగతి ప్రజానీకం చాలామంది దీనిపట్ల మొగ్గుచూపుతుండడంతో నాలుగైదేండ్లలో ఆన్‌లైన్ వ్యాపారం రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే అవకాశాలను కల్పిస్తుందని అంచనాలు చెబుతున్నాయి. దానితో వివిధ దేశాల్లోని ఎంఎన్‌సీలు కూడా వచ్చి, పట్టణాలకు కూడా విస్తరిస్తాయి. ఇప్పుడున్న 2.6 శాతం ఆన్‌లైన్ మార్కెట్ 45 శాతానికి పెరుగొచ్చని అంచనా. దీనితో పోటీ పెరిగి ప్రథమంలో భారీ డిస్కౌంట్లు, తగ్గింపులతో వినియోగదార్లను ఇటువైపు ఆకర్షిస్తాయనీ బిజినెస్ పండిట్‌లు అంచనా వేస్తున్నారు. వీటిని తట్టుకోలేని రిటైలర్లు దుకాణాలను మూసుకోవాల్సి వస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా రిటైల్ రంగంపై ఆధారపడి బతుకుతున్న 30 కోట్ల మంది ఉపాధి కోల్పోయి వీధులపాలయ్యే ప్రమాదముంది. ఈ విషయాన్ని గ్రహించాయి కాబట్టే వ్యాపార, వర్తకుల సంఘాలే కాకుండా రాజకీయ పార్టీలు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాయి. స్వదేశీ జాగరణ్ మంచ్ కన్వీనర్ ఒకడుగు ముందుకేసి ‘మనం సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలోకి 100 శాతం ఎఫ్.డి.ఐ.లను అనుడతించాం. కానీ మల్టీబ్రాండ్‌లోకి అనుడతించలేదు.  ఈ మార్కెట్‌పై కన్నేసిన వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో వాటాను కొనడం ద్వారా ఆ మార్కెట్‌ను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంది. దీన్ని వెంటనే అడ్డుకోవాల’ని డిమాండ్ చేస్తూ ప్రధానికి లేఖ రాశారు. మన మేకిన్ ఇండియాకు కూడా ప్రమాదమే అన్నారు. ఇదే దారిలో వాణిజ్య, వృత్తి సంఘాలు, పార్టీలు ఎవరి పద్ధతిలో వారు వాల్‌మార్ట్‌కు వ్యతిరేకంగా ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఆర్థిక సామ్రాజ్యవాదాన్ని పారదోలడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఇవన్నీ ఫలిస్తాయా? మన రిటైల్ వ్యాపారాలు బతికి బట్టకట్టగలుగుతారా? అనేది ఇప్పటికైతే సందేహమే!. 

 ఎన్. మదనయ్య

Tags
English Title
Manufacturing divisions-retail offices
Related News