సీబీఐ విచారణ జరిపించండి

Updated By ManamFri, 11/09/2018 - 01:40
Vijaya Prasad
  • విశాఖ భూకుంభకోణంపై డిమాండు

  • అధికారపార్టీ నేతలకు సిట్ క్లీన్‌చిట్

  • గంటా హస్తంపై అయ్యన్న ఫిర్యాదు

  • సిట్ అధికారులకు ఆధారాలు కూడా..

  • వైఎస్‌ఆర్‌సీపీ విశాఖ నేత విజయప్రసాద్

Vijaya Prasadవిశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖపట్నం భూ కుంభకోణంపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాని వైఎస్‌ఆర్‌సీపీ విశాఖపట్నం నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ భూ కుంభకోణంపై సీబీఐ విచారణ కోరితే రాష్ట్రప్రభుత్వ ఆధీనంలోని సిట్ చేత విచారణ చేపట్టారని, కానీ సిట్ నిజాలు బయట పెట్టకుండా అధికార పార్టీకి అనుకూలంగా నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. విచారణకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదికకు ప్రభుత్వం క్లీన్‌చిట్ ఇవ్వడం దారుణమన్నారు. భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార పార్టీకి చెందిన కీలక సూత్రధారులకు ‘సిట్’ క్లీన్‌చిట్ ఇచ్చేసిందన్నారు. రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన అనుచరులు, అధికార టీడీపీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్ తదితరులతో సహా ఇతర నేతల పాత్ర ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. విశాఖ భూకుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావు పాత్ర ఉందని సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడే ఆరోపించారన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా ఆయన అధికారులకు అందజేశారన్నారు. కానీ మంత్రి గంటా, ఆయన అనుచరులకు భూముల అవకతవకలు, ట్యాంపరింగ్‌తో సంబంధం లేదని సిట్ తేల్చిచెప్పడంతో వారికి క్లీన్ చిట్ లభించిందన్నారు. ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి నారా లోకేశ్ కనుసన్నల్లోనే విశాఖ భూకుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వస్తే ఆయనకు కూడా క్లీన్‌చిట్ ఇచ్చేసిందన్నారు. భూకుంభకోణంలో  లోకేశ్ పేరును తప్పించడంతో అనేక అనుమానాలు తలెత్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రజలను మోసగించకుండా ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాని విజయప్రసాద్ డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే భూకుంభకోణంపై రీ ఎంక్వైరీ వేస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే చెప్పారని గుర్తుచేశారు. 

హత్యాయత్నంపై అవహేళన
జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే సీఎంతో సహా, అధికార పార్టీకి చెందిన మంత్రులు, నాయకులు అవహేళన చేస్తూ మాట్లాడటం దారుణం అన్నారు. కోడి కత్తి.. మోదీ కత్తే అంటూ అవహేళనగా మాట్లాడటం సరికాదన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో విశాఖ నగరంలోని వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు కె.కె.రాజు, డాక్టర్ రమణమూర్తి, తిప్ప నాగిరెడ్డి, వంశీకృష్ణ శ్రీనివాస్, అక్రమాని విజయ నిర్మల, వైసీపీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

English Title
Make a CBI inquiry
Related News