ఫ్లిప్‌కార్ట్ స్వాధీనంతో దీర్ఘకాలిక లాభాలు

Updated By ManamMon, 05/14/2018 - 22:38
walmart flipkart
  • వాల్‌మార్ట్‌కు ‘క్రెడిట్ పాజిటివ్’ ఇచ్చిన రేటింగ్ ఏజన్సీ మూడీస్

walmart flipkartహైదరాబాద్: భారతీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వచ్చే కొద్ది ఏళ్ళపాటు నష్టాలు నమోదు చేసే అవకాశమే ఉన్నప్పటికీ, దానిలో 77 శాతం వాటా కైవసం చేసుకోవడం ద్వారా అవెురికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ‘‘క్రెడిట్ పాజిటివ్’’’గానే మారుతుందని రేటింగ్ ఏజన్సీ మూడీస్  సోమవారం జారీ చేసిన రుణ దృక్పథ నివేదికలో పేర్కొంది. సుమారు 16 బిలియన్ డాలర్లు పెట్టి భారతీయ ఈ-కామర్స్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్‌లో  77 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు వాల్‌మార్ట్ ఇన్‌కార్పొరేటెడ్ మే 9న ప్రకటించింది. ఫైనాన్సింగ్ ప్రణాళికలను మాత్రం అది వెల్లడించలేదు. ఈ లావాదేవీతో మొదట్లో వాల్‌మార్ట్ రుణ యోగ్యత బలహీనపడుతుందని తాను భావిస్తున్నట్లు మూడీస్ పేర్కొంది. నిలబెట్టుకోగలుగుతున్న నగదు ప్రవాహం (ఆర్.సి.ఎఫ్) నికర రుణ నిష్పత్తి ప్రస్తుతమున్న 40 శాతం నుంచి 30 శాతానికి క్షీణించే అవకాశముందని పేర్కొంది. రుణం, ఇ.బి.ఐ.టి.డి.ఎ (వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయాలు) నిష్పత్తి ఇప్పుడున్న 1.6 రెట్ల నుంచి రెండింతలయ్యే అవకాశముందని తెలిపింది. ‘‘ఈ విధమైన క్షీణత ఉన్నప్పటికీ, స్వాధీనం క్రెడిట్ పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే, నానాటికీ వృద్ధి చెందుతున్న భారతదేశపు రిటైల్ ఈ-కామర్స్ రంగంలో (వాల్‌మార్ట్‌కి) అది తక్షణ స్థాయిని ప్రసాదిస్తోంది. పెరిగిన నగదు ప్రవాహం, రుణ తగ్గింపు సమ్మేళనం ఆర్.సి.ఎఫ్/నికర రుణ నిష్పత్తిని తిరిగి 35 శాతం ఎగువకు తీసుకెళుతుందని భావిస్తున్నాం. వచ్చే కొద్ది ఏళ్ళపాటు ఫ్లిప్‌కార్ట్ వల్ల నష్టాలే రావచ్చని మేమూ ఊహిస్తున్నాం. కానీ, కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న భారతదేశపు అంశాలను దృష్టిలో పెట్టుకుని మేం సానుకూల-రుణ దృక్పథంతో ఉన్నాం. ఇండియాలో 1.2 బిలియన్ల పౌరులున్నారు. దాని ఆర్థిక వ్యవస్థ వార్షిక జి.డి.పి వృద్ధి 7 శాతం పైగా ఉంది’’ అని మూడీస్ పేర్కొంది. ఈ సహస్రాబ్దంలో పుట్టినవారు భారతదేశంలో 40 కోట్ల మందికి పైగా ఉన్నారు. మధ్య తరగతి వృద్ధి చెందుతోంది. స్మార్ట్ ఫోన్ల వ్యాప్తి విస్ఫోటనాత్మకంగా ఉంది. షాపింగ్ ఆన్‌లైన్‌కు మారడానికి ఇవన్నీ కీలకమని ఆ రేటింగ్ ఏజన్సీ తెలిపింది. ‘‘(ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు) ప్రకటన తర్వాత, వాల్‌మార్ట్ డబుల్ ఏ2 రేటింగ్‌ని, స్టేబుల్ ఔట్‌లుక్‌ని మేం అలానే ఉంచుతున్నాం’’ అని తెలిపింది. ‘‘కనీసం వచ్చే కొద్ది ఏళ్ళపాటు ఫ్లిప్‌కార్ట్ అర్థవంతమైన నష్టాలనే జనరేట్ చేస్తుందని భావిస్తున్నందు వల్ల దీన్ని స్పష్టంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెట్టిన పెట్టుబడిగానే భావించాలి..’’ అని మూడీస్ ఉపాధ్యక్షుడు చార్లీ ఓషియా అన్నారు. 
ఆన్‌లైన్ వృద్ధిని పెంపొందించుకునేందుకు వాల్‌మార్ట్ స్వీయ విస్తరణకు బదులుగా ఎక్కువగా స్వాధీనాల వైపు మొగ్గు చూపుతోంది. అవెుజాన్ వంటి వేగంగా వృద్ధి చెందుతున్న, విస్తరిస్తూపోతున్న ఆన్‌లైన్ ప్రత్యర్థి సంస్థలు చాలా వేగంగా స్థాయిని నిర్మించుకోవడంలోని ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని అది అలా వ్యవహరిస్తోంది. వాల్‌మార్ట్ అవెురికాలోని జెట్‌కామ్‌ను 2016 ఆగస్టులో సుమారు 3.3 బిలియన్ డాలర్లకు కైవసం చేసుకుందని మూడీస్  తెలిపింది. 

English Title
Long term profits with possession of Flipkart
Related News