ఉద్వేగాల వేడుక ఉత్తరం

Updated By ManamSat, 06/09/2018 - 00:08
image

image‘ఒక కాగితమ్ముక్క దేశదేశాలు తిరిగి, రకరకాల వ్యక్తుల చేతుల మీదుగా, మంచి మాటల్ని, మనసుల్ని మోసుకొస్తుంది. ఆ కాగితమ్ముక్కలో ఏదో పవిత్రత దాగి ఉందని నాకు అనిపిస్తుంది’ అంటూ ‘ఉత్తరాన్ని’ తలుచుకుంటారు అమెరికన్ రచయిత రాబర్ట్ మైఖేల్ పైలె. ఒక కాగితం లేదా కవరు లేదా కార్డుముక్క... కాసిని అక్షరాల మల్లెల్ని గుప్పెళ్ళతో తెచ్చి, మన కళ్ళ వాకిళ్ళ ముందు అనుభూతుల ముగ్గులు పెడుతుంది. ‘పోస్ట్’ అనే కేక కోసం కళ్ళింతలు, చెవులింతలు చేసుకుని ఎదురు చూపులు చూసే రోజులు నిజంగా ఎంత మధురమైనవో?! ఇప్పుడు ఇ-మెయిళ్ళు, జీమెయిళ్ళు మైళ్ళ దూరాన్ని ఒక్క క్లిక్‌కు తగ్గించేసి, గ్లోబల్ విలేజ్‌ని ఎంత దగ్గరకి తెచ్చినా, పోస్ట్‌మ్యాన్ తెచ్చే ఉత్తరంలోని జీవలక్షణం వాటికి ఇసుమంతైనా ఉండదు. ఉత్తరమంటే ఉద్వేగాల సంరంభం. మనసు పాళీకి ప్రాణాల సిరాను పోసి, ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా చెక్కి, మన కోసం మన ఆత్మీయులు స్వదస్తూరీతో పంపే అమూల్యమైన కానుక. కొత్త ఊళ్ళో, కొత్త ఇంట్లో అడుగు మోపిన కొత్త కోడలికి అమ్మ రాసిన మొదటి ఉత్తరం పెళ్ళినాటి పట్టు చీర కన్నా ఎంతో విలువైంది. అందుకే అది పట్టుచీరల మడతల్లో కలకాలం ఆత్మీయమైన అగరు సుగంధాల్ని విరజిల్లుతుంటుంది. ఉద్యోగం కోసం ఊరెళ్ళిన కొడుకు రాసే ఉత్తరం అమ్మకి, నాన్నకి ‘గారాల పట్టి’ అవుతుంది. కొండొకచో చేదు వార్తల్ని మోసుకొచ్చి గుండెను బరువెక్కించినా, ‘శుభవార్తల’ కోసం ప్రాణాల్ని ఉగ్గబట్టుకుని వేచి చూసే ఓపికవుతుంది. ఇప్పటికిప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో ‘తపాలా’ మూలన పడిన ముసలమ్మలా కనిపించినప్పటికీ, అది కాలానికి అతీతంగా ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అన్న సామెతకు  సజీవసాక్ష్యమై నిలిచింది. ఇదిగో అలాంటి అమూల్యమైన కొన్ని ‘తపాలా’ కబుర్లతో ఇవాల్టి ‘మైత్రి’ మీ ముందుకొచ్చింది. 
- మీ ‘మైత్రి’

ప్రేమికుల రాయబారి ఓక్ చెట్టు
‘ఏడ తానున్నాడో బావ..., జాడ తెలిసిన పోయి రావా...’ అంటూ ఆకాశంలో మేఘాలకు మొరపెట్టుకున్న మల్లీశ్వరి గుర్తుంది కదా,image ప్రేమికులంటే అంతే, మబ్బులు, పావురాలు, సీతాకోక చిలుకలు, చిరుగాలులు... ఒక్కటేమిటి ప్రకృతి ప్రకృతంతా వీళ్ళకి ‘తపాలా బంట్రోతు’లాగే కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఈ ధోరణి మనకే కాదండోయ్, పాశ్చాత్యులకూ మహఘఠ్ఠిగా ఉన్నట్టుంది. అందుకే వీళ్ళు తమ ప్రేమ రాయబారానికి ఒక ‘ఓక్ చెట్టు’ను ఎన్నుకున్నారు! అది ఏళ్ళూపూళ్ళూగా ‘ప్రేమసేవలు’ చేస్తూ తరించి పోతోందట పాపం! ఆ చిత్రమేమిటో తెలుసుకుందాం రండి!

జర్మనీలోని యూనిత్ నగర పొలిమేరల్లో ఒక చిన్న అడవి ఉంది. ఆ అడవిలో 500 ఏళ్ళనాటి ఒక ఓక్ చెట్టు ఉంది. ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన పోస్టల్ చిరునామా కలిగిన చెట్టు ప్రపంచంలో ఇదొక్కటే! ఈ చెట్టు పుణ్యమాని ఇప్పటికి 200 జంటలు ఒకింటి వాళ్ళయ్యారట. ఈ చెట్టు తొర్రకు మూడు మీటర్ల పొడవైన కొయ్యనిచ్చెన అమర్చి ఉంటుంది. తొర్ర దగ్గర ఉన్న పోస్ట్‌బాక్స్‌లో ఉత్తరాల్ని జారవిడిచే వాళ్ళకి ఉపయోగపడినట్టే, వాటిని తీసుకువెళ్ళడానికి పోస్ట్‌మ్యాన్‌కు కూడా ఈ నిచ్చెన ఉపయోగపడుతుంది. ఈ చెట్టుకు ‘డెర్ బ్రాటిగామ్‌సీషె’ అని జర్మన్ పేరు ఉంది. అంటే ‘వరుల ఓక్ చెట్టు’ అని అర్థం.

ఇరవయ్యేళ్ళుగా ఈ చెట్టు పోస్టాఫీసుకు ఒకే ఒక వ్యక్తి పోస్ట్‌మ్యాన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతని పేరు కార్ల్ హీన్జ్ మార్టెన్స్. వేసవి కాలంలో ప్రియులు ప్రేయసి కోసం, ప్రియురాళ్ళు ప్రియుల కోసం వేచి చూస్తారట, అందుకే వేసవిలోనే ఈ ఓక్‌చెట్టు పోస్ట్‌బాక్స్ ప్రేమలేఖలతో నిండిపోతుందట. ఈ చెట్టు రోజుకు వెయ్యి ప్రేమలేఖల్ని స్వీకరిస్తుంది. ఈ ఓక్‌చెట్టు ఇలా ప్రేమవృక్షంగా మారిపోవడం వెనుక ఒక చిన్నపాటి జానపద కథే ఉంది, అది అచ్చం మన సగటు తెలుగు ప్రేమ సినిమా కథలాగా ఉంటుంది. అదేమిటంటే, దాదాపు 128 సంవత్సరాల క్రితం అంటే, 1890ల్లో మిన్నా అనే ఒక పల్లెపడుచు, చాక్లెట్లు తయారు చేసే విల్‌హెమ్ అనే కుర్రాణ్ణి గాఢంగా ప్రేమించింది. కానీ ప్రేమకథలో ఎప్పట్లాగే అమ్మాయి తండ్రి విలన్‌గా మారిపోయి ఆ ప్రేమికుల్ని కలవకుండా అడ్డుపడ్డాడు. దాంతో వాళ్ళు తమ విరహవేదనల్ని ఉత్తరాల రూపంలో రహస్యంగా ఈ ఓక్‌చెట్టు తొర్రలో దాచి పరస్పరం తెలియజేసుకునే వారట. ఇలా ఓక్‌చెట్టు ద్వారా సాగిన వారి ప్రేమాయణం ఏడాది కల్లా సంతోషకరమైన మలుపు తిరిగి, ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ సంగతి ఆనోటా ఈ నోటా జర్మనీ అంతటా పాకిపోయింది. ఇంకేముందీ, తోడు కోసం వెదుకుతున్న ఒంటరి పక్షులన్నీ ఈ చెట్టు చుట్టూ వాలడం మొదలెట్టాయి. అందరూ ఈ చెట్టు తొర్రలో ప్రేమలేఖల్ని జారవిడవడం అలవాటై పోయింది. ఈ ఉత్తరాల ప్రవాహం పెరిగి, పెరిగి... అధికారుల దృష్టికి వెళ్ళింది. దాంతో 1927లో జర్మన్ పోస్టల్ విభాగం ‘డచ్ పోస్ట్’ ఈ ఓక్ చెట్టుకు ఒక ప్రత్యేక పోస్టల్ కోడ్‌ని, పోస్ట్‌మ్యాన్‌ని కేటాయించాల్సి వచ్చింది. ఎవరైనా నిచ్చెనను ఎక్కి, పోస్ట్‌బాక్స్‌లోని ఉత్తరాల్ని చదవవచ్చు. ఇష్టమైతే జవాబు రాయవచ్చు, లేదా ఆ ఉత్తరాన్ని యధాతథంగా పోస్ట్‌బాక్స్‌లో తిరిగీ పడేయవచ్చు. ఇంతకీ విశేషమేమిటంటే, ఇక్కడ పోస్ట్‌మ్యాన్‌గా నియమితుడైన మార్టెన్స్ ప్రేమ కూడా ఈ చెట్టు నీడనే ఫలించింది. అతని భార్య రనాటె 1989లో నేరుగా మార్టెన్స్‌కు ప్రేమలేఖ రాసి, ఈ చెట్టు పోస్ట్‌బాక్స్‌లో పడేసింది. తనను కలవాలంటూ ఆమె లేఖలో మార్టెన్స్‌ను కోరింది. తరువాత ఐదేళ్ళపాటు ప్రేమించేసుకుని, ఆ తరువాత వాళ్ళిద్దరూ పెళ్ళాడేశారు. వాళ్ళిద్దరూ 24 ఏళ్ళుగా అన్యోన్యంగా జీవిస్తున్నారు. జర్మనీలో ప్రేమికులంతా ఈ ఓక్‌చెట్టును అపర మన్మథావతారంగా భావిస్తారట!

అభినందనలే అన్నప్ప చిరునామా
imageవిజేతల స్వీయగాథల్ని వినడం, చదవడం, స్ఫూర్తి పొందడం మనకందరికీ చాలా ఇష్టం. జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలంటే విజేతల్నే ఆదర్శంగా తీసుకుంటాం. చూశారా, ఇతరుల విజయాన్ని మెచ్చుకోవాలంటే కూడా మనకంటూ ఒక ప్రయోజనం ఉండాలన్న స్వార్థం కదూ! కానీ ఈపాటి స్వార్థం కూడా లేకుండా ఒక పెద్దాయన విజేతల్ని తనకు చేతనైనంతగా ప్రోత్సహిస్తుంటాడు. ఈయన నుంచి ఇలాంటి ప్రోత్సాహాన్ని అందుకున్న వారిలో జాతీయ రాజకీయ పక్షాల నాయకులు సోనియాగాంధీ, ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. ఇంతకీ ఆయన వీళ్ళకి అందించే ‘ప్రోత్సాహం’ ఏమిటంటారా.., ‘అభినందనలు’! విజేతలకు పోస్ట్‌కార్డుల మీద ‘అభినందనల్ని’ రాసి పంపడం అన్నప్ప చౌగులేకి చాలా ఇష్టమైన పని. ‘మనుషులు చనిపోయిన తరువాత వారిని పొగడ్తలతో ముంచెత్తడంలో ప్రయోజనం ఏముందో చెప్పండి, వారి ఫోటోకి పూలదండ వేయడం తప్ప!’ అని అంటారు అన్నప్ప. 

మహారాష్ట్రలో కొల్హాపూర్ జిల్లాలోని కబ్నూర్ పట్టణానికి చెందిన 66 ఏళ్ళ అన్నప్ప చౌగులే ఒకానొక చక్కెర కర్మాగారంలో కూలీగా పనిచేసే వారు. ఆ పని మానేసి ఇప్పుడు వాచ్‌మ్యాన్‌గా పని చేస్తున్నారు. స్థానికంగా కానీ, జాతీయస్థాయిలో కానీ ఎవరైనా ఏదైనా విజయాన్ని సాధించినట్టు తెలియగానే అన్నప్ప పోస్ట్‌కార్డు మీద వారికి ‘అభినందనల్ని’ రాసి పంపుతారు. ఇది తన వంతుగా వారికి ఇస్తున్న ప్రోత్సాహమని ఆయన భావిస్తారు. పెళ్ళిళ్ళు, జన్మదినోత్సవాల వంటి సందర్భాల్లో ఆయన ఇలాంటి కార్డుల్ని పంపుతుంటారు. ఏడేళ్ళలో ఇప్పటిదాకా ఆయన 900 అభినందన కార్డుల్ని పంపారు. ‘సంగీతం, విద్య, సామాజిక సేవ, కళలు వంటి అనేక రంగాల్లో విజయాన్ని సాధించిన వ్యక్తులకు నేను ఇలా ఉత్తరాల్ని రాస్తాను. ఉదయాన్నే స్థానిక మరాఠీ వార్తాపత్రికల్ని చదివి విజేతల గురించిన సమాచారాన్ని తెలుసుకుంటాను. ఇందుకోసం నేను మూడు మరాఠీ పత్రికలకు చందా కట్టాను’ అని ఆయన తెలిపారు. మహాసత్తా, లోక్‌నేత, లోక్‌మత్ అనే వార్తాపత్రికల నుంచి అన్నప్ప తనకు కావసిన సమాచారాన్ని సేకరిస్తారు. విజేతల వివరాల్ని నోటుపుస్తకంలో రాసుకుని, వారి స్నేహితులు, బంధువుల నుంచి ఆయా విజేతల చిరునామాల్ని తెలుసుకుంటారు. అన్నప్ప కబ్నూర్ పరిసరప్రాంతాలైన కుంభోజ్, సజని, రూయ్, చందూర్, షిర్దోన్, ఇచల్ కరంజీ వంటి గ్రామాల్లో స్నేహితులకు, బంధువులకు అభినందనల సందేశాల్ని పంపుతుంటారు.

ఎవరైనా పెళ్ళికి పిలిస్తే వారి పెళ్ళయిన రోజును డైరీలో రాసిపెట్టుకుని, తరువాత వారికి పెళ్ళి రోజు అభినందనల్ని క్రమం తప్పకుండా తెలియజేస్తారు. ఆరు కిలోమీటర్ల దూరంలోపు గ్రామమైతే తానే స్వయంగా ఆ వ్యక్తికి అభినందన కార్డును అందించి, వారితో ఫోటో దిగుతారు. ‘చేతివ్రాతతో అందించిన అభినందనలో ఆప్యాయత ఉంటుంది’ అని ఆయన చెబుతారు. ‘ఇచల్‌కరంజీ పట్టణంలోని తృప్తి మానె అనే అమ్మాయి వెయిట్ లిఫ్టింగ్‌లో జాతీయ రికార్డు నెలకొల్పినపుడు, ఆ విషయాన్ని వార్తాపత్రికలో చదివి, నేను ఇచల్‌కరంజీకి సైకిల్ మీద వెళ్ళి ఆమెను కలిసి, అభినందన కార్డును అందించాను’ అని ఆయన గుర్తు చేసుకున్నారు. విజేతల వివరాలతో కూడిన దాదాపు 40 డైరీలు అన్నప్ప దగ్గర ఉన్నాయి. వీటిని పుట్టిన రోజు, పెళ్ళిరోజు, జాతీయ లక్ష్యాల్ని సాధించిన రోజు అంటూ విడివిడిగా వర్గీకరించారు. ‘మొదట్లో ప్రజలు నేను డబ్బు కోసం ఇదంతా చేస్తున్నానని భావించే వారు. కానీ ఇది డబ్బు కోసం చేస్తున్న పని కాదు, నా అభిరుచి కోసం చేస్తున్న పని ఇప్పుడు వారికి అర్థమైంది.’ అని అంటారాయన. 

పేద కుటుంబంలో పుట్టిన అన్నప్ప చిన్నప్పుడే కుటుంబపోషణ కోసం కూలి పనిలో చేరారు. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ వాచ్‌మ్యాన్‌గా పని చేస్తున్నారు. ఆయన జీతం నెలకు ఐదువేల రూపాయలు మాత్రమే. ఆ డబ్బులోనే ఆయన తన డైరీల కోసం, కార్డుల కోసం, పత్రికల కోసం ఖర్చు చేస్తుంటారు. కుటుంబంలో ఎవరికీ అన్నప్ప చేస్తున్న పని నచ్చదు. అభినందన కార్డుల్ని పంపడాన్ని ఆపేయాలని వారు ఆయనను ఒత్తిడి చేసినా, తన తుదిశ్వాస వరకు ఆ పనిని ఆపే ప్రసక్తే లేదని అన్నప్ప స్పష్టంగా చెప్పేశారు. మొట్టమొదటిసారి 2011లో షిర్దోన్ గ్రామానికి చెందిన విజయ్‌పాటిల్ అనే బడిపంతులుకి అన్నప్ప అభినందన కార్డును అందజేశారు. ఉపాధ్యాయవృత్తి పట్ల విజయ్‌పాటిల్ అంకితభావాన్ని ఆయన తన కార్డులో అభినందించారు. అభినందన లేఖ పంపేటపుడు ఆయన ఆ వ్యక్తి చేసిన పని గురించి, సాధించిన విజయం గురించి సానుకూలంగా ప్రస్తావిస్తూ అభినందిస్తారు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికైనపుడు, సోనియా గాంధీకి జన్మదినోత్సవ సమయంలో, 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినందుకు నరేంద్ర మోడీకి ఆయన అభినందన కార్డుల్ని పంపారు. చాలా సందర్భాల్లో ఆయన పంపే కార్డులకి ప్రతిస్పందన, జవాబు ఉండదు, అయినప్పటికీ అన్నప్ప తన పనిలో ఎలాంటి నిరుత్సాహానికి గురికారు. ‘తుదిశ్వాస వరకు ఇలాగే విజేతలందరికీ అభినందన కార్డుల్ని పంపుతూనే ఉండాలన్నది నా ఆశయం’ అని ఆయన అంటారు.

అంటార్కిటికా పోస్టాఫీస్
మంచుఖండానికి సంబంధించిన మొట్టమొదటి భారతీయ శాస్త్రీయ విజ్ఞాన కేంద్రం దక్షిణ గంగోత్రిలో ఉంది. దీనికి తాలూకుimage పోస్టాఫీసును 24, ఫిబ్రవరి 1984న ప్రారంభించారు. శ్వేతఖండానికి భారతదేశం జరిపిన మూడవ యాత్ర సందర్భంగా ఈ తపాలా కార్యాలయాన్ని స్థాపించారు. ఈ తపాలా కార్యాలయాన్ని 26, జనవరి 1988లో గోవాలోని తపాలా విభాగం పరిధిలోకి తెచ్చారు. దీనికి మొట్టమొదటి గౌరవ పోస్ట్‌మాస్టర్‌గా ప్రముఖ శాస్త్రవేత్త జి.సుధాకర్ రావు వ్యవహరించారు. ఈయన 1987లో అంటార్కిటికాకు ఏడవసారి యాత్ర జరిపిన శాస్త్రవేత్తల బృందంలో సభ్యుడు. ప్రారంభించిన తొలి ఏడాదే ఆ పోస్టాఫీసు పదివేల ఉత్తరాల్ని బట్వాడా చేసింది. సగానికి సగం మంచులో కూరుకుపోవడంతో దక్షిణగంగోత్రి పోస్టాఫీసును 1990లో మూసివేశారు. తరువాత మైత్రి’ అనే ప్రదేశంలో శాశ్వత భవనాల్ని నిర్మించి, ఈ పోస్టాఫీసును అక్కడికి తరలించారు. 

‘కొండ కొమ్మన మిఠాయి పొట్లం’ హిక్కిమ్ పోస్టాఫీసు
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన తపాలా వ్యవస్థ మనదే! భారతీయ తంతి తపాలా విభాగం (డిఒపి) కేంద్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది. ఉత్తరాల బట్వాడాతో పాటు, చిన్నమొత్తాల పొదుపు పథకాలు, జీవిత బీమా పథకాలు, గ్రామీణ జీవిత imageబీమా పథకాలు, కొన్ని బాండ్ల అమ్మకాలు, తదితర సేవల్ని ఈ విభాగం ప్రజలకు అందిస్తోంది. దేశవ్యాప్తంగా డిఒపి 155,015 పోస్టల్ కార్యాలయాలతో ప్రపంచంలోనే అతి పెద్ద తపాలా వ్యవస్థగా గుర్తింపు పొందింది. మరో విశేషం ఏమిటంటే, హిమాచల్‌ప్రదేశ్‌లోని ‘హిక్కిమ్’ అనే గ్రామం సముద్రమట్టానికి 15,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి పోస్టాఫీస్ ప్రపంచంలోనే ఎత్తైన చోట ఉన్న తపాలా కార్యాలయంగా గుర్తింపు పొందింది. హిక్కిమ్ గ్రామం హిమాచల్‌ప్రదేశ్‌లోని లహాల్ పిటి జిల్లాలో ఉంది. ఈ గ్రామంలోని పోస్టాఫీస్‌ను 5, నవంబర్ 1983న ప్రారంభించారు. ఈ తపాలా కార్యాలయాన్ని ‘రించెన్ చెరింగ్’ అనే బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ నిర్వహిస్తున్నారు. ఉద్యోగంలో చేరేటపుడు ఆయన వయసు ఇరవై రెండేళ్ళు. ఇప్పటికీ ఈయనొక్కరే ఈ పోస్టాఫీస్‌ను నిర్వహించడం విశేషం. ఎత్తయిన ప్రదేశంలో ఉండడంతో హిక్కిమ్ పోస్టాఫీసుకు ఒక ఉత్తరాన్ని చేర్చాలంటే చాలా ప్రయాస పడాల్సి వస్తుంది. హిక్కిమ్ నుంచి పరిసరగ్రామమైన కజాకు ఇక్కడి ఉత్తరాల్ని కాలినడకన తరలిస్తారు. అక్కణ్ణుంచి బస్సులో రెకాన్‌పియో అనే చోటికి, అటునుంచి కల్కా అనే పట్టణానికి రైలులో, అక్కడి నుంచి మళ్ళీ బస్సులో ఢిల్లీకి ఉత్తరాల్ని తరలిస్తారు. ఢిల్లీ నుంచి ఉత్తరాల్ని ఆయా గమ్యస్థానాలకు పంపుతారు. హిక్కిమ్ గ్రామంలో కేవలం 161 గృహాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ సెల్‌ఫోన్ వాడకం కుదరదు. సెల్ టవర్లు లేవు. ఇంటర్నెట్ కూడా లేదు. మంచు కురిసే కాలంలో ఈ పోస్టాఫీసును ఆరునెలల పాటు మూసేస్తారు. హిక్కిమ్‌కు మరో విశేషం కూడా ఉంది. ప్రపంచంలో ఎత్తైన పోలింగ్ స్టేషన్ కూడా ఈ గ్రామానికి చెందిందే! దీనితో పాటు మనదేశంలో మరికొన్ని ప్రత్యేకమైన పోస్టాఫీసులు కూడా ఉన్నాయి.

దాల్‌లేక్ పోస్టాఫీసు 
శ్రీనగర్‌లోని ఫ్లోటింగ్ పోస్టాఫీసు దాల్‌లేక్‌లో నీళ్ళ మీద తేలియాడుతూ ఉంటుంది. ఇలా నీళ్ళ మీద తేలియాడే పోస్టాఫీసుimage ప్రపంచంలో ఇదొక్కటే. ఇందులో సాధారణ పోస్టాఫీసుల్లో దొరికే తపాలా సేవలన్నీ లభ్యమవుతాయి. బ్రిటీష్ వలసపాలన కాలంనాటి ఈ పోస్టాఫీసును ప్రారంభంలో నెహ్రూపార్క్ పోస్టాఫీస్ అని పిలిచే వారు. ఇందులో తపాలా మ్యూజియం కూడా ఉంది. పర్యాటకులకు ఈ పోస్టాఫీసు పెద్ద ఆకర్షణ. వారు దాల్‌లేక్ మీద ప్రయాణించి ఈ పోస్టాఫీసును చేరుకుని, దూరదేశాల్లోని తమ కుటుంబీకులకు, స్నేహితులకు ఉత్తరాల్ని పంపుతుంటారు. ఈ పోస్టాఫీసు నుంచి పంపే ఏ ఉత్తరం మీదనైనా ఒక ప్రత్యేకమైన ముద్రను వేస్తారు. నీళ్ళ మీద తేలియాడే ఈ బోట్‌హౌస్‌లను షికారాలంటారు. ఒక నావికుడు షికారాను నడుపుతున్న చిత్రాన్ని ఈ పోస్టాఫీసు అధికార ముద్రగా ఉపయోగిస్తారు. 

English Title
letter is the excitement
Related News