ఉప్పెనలా కదులుదాం

Updated By ManamMon, 07/23/2018 - 00:43
grama-pachayat
  • సర్పంచ్‌ల సత్తా చాటుదాం.. సర్కార్‌పై ఒత్తిడి చేదాం

  • హక్కుల సాధనే ధ్యేయంగా ముందుకు.. తెలంగాణ సర్పంచ్‌ల ఐక్య వేదిక పిలుపు

  • 28న ఉత్తమ సర్పంచులకు సన్మానాలు.. ఆ సభలోనే గళం విప్పనున్న ఐక్య వేదిక

grama-pachayatహైదరాబాద్: ‘‘ఐదేళ్లు కష్ట నష్టాలు అనుభవించాం. ప్రభుత్వం నిధులిచ్చినా.. లేకపోయినా.. సొంత డబ్బులు ఖర్చు చేశాం. అయినా.. ప్రజల ఆశలను అందుకోలేకపోయాం. గ్రామ బాగోగుల కోసం మన శాయశక్తులా శ్రమించాం. ఐదేళ్ల పదవీకాలం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు సమయానికి నిర్వహించడంలో ప్రభుత్వం వెనుకడగేస్తోంది. దీనిపై మన గొంతును బలంగా వినిపించి.. హక్కులను కాపాడుకుందాం’’ అని తెలంగాణ సర్పంచుల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఈ నెల 28న సర్పంచుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉత్తమ పాలనను అందించిన సర్పంచులను సన్మానించనుంది. హైదరాబాద్ లోని లక్డీకపూల్‌లో ఉన్న ఫాఫ్సీ ఆడిటోరియం దీనికి వేదిక కానుంది. ఇదే సభ నుంచి తమ గొంతుకను ప్రభుత్వానికి వినిపించాలని సర్పంచులు నిర్ణయించారు. ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు అందోల్ క్రిష్ణ నేతృత్వంలో సారధ్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం పిలుపునిచింది. సర్పంచ్‌ల పదవీ కాలం పెంచాలని కొన్నాళ్లుగా ఉద్యమం చేస్తున్న ఆయన అధ్యక్షతన ఉద్యమించాలని, సర్పంచులంతా ఉప్పెనలా కదిలి సత్తా చాటాలని సంఘం నేతలు అన్నారు. ఈ వేదికపై నుంచి చేపట్టబోయే అంశాలను ఆ సంఘం నేతలు వెల్లడించారు. 
: ఉత్తమ సర్పంచులకు సన్మానం: గ్రామాల్లో మౌలిక మార్పులు సాకారం చేసి చూపించిన సర్పంచులను గౌరవించుకోవడం. పదవీ కాలం ముగిస్తున్న సమ యంలో చేసిన పనికి గుర్తింపు ఇవ్వాలన్నదే లక్ష్యం.
: ఎన్నికా?.. పదవీకాలం పెంపా?: స్పెషల్ అధికారుల పాలన కారణంగా గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని సర్పంచులు అభిప్రాయపడుతున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే ఉన్న సర్పంచుల పదవీ కాలాన్ని పొడిగించాలని డిమాండ్ చేయబోతున్నారు. పర్సన్ ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగించాలని వారు కోరుతున్నారు.
: సర్పంచులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, పీఏసీఎస్ డైరెక్టర్లు, చైర్మన్లకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ఈ డిమాండ్ ఈ వేదిక నుండి వినిపిస్తామని ఐక్య వేదిక ప్రతినిధులు తెలిపారు. అది సభలోనే బయటపెడతామని ప్రకటించారు. ఈ సర్పంచ్‌ల సభకు కేంద్రమంత్రితో పాటు రాష్ట్ర మంత్రి, రాష్ట్రంలోని అన్ని పార్టీల అధ్యక్షులు హాజరవుతారని చెప్పారు.

English Title
Let's move to the surge
Related News