ఏడుద్దాం.. రండి!

Updated By ManamSun, 11/04/2018 - 07:53
cry
  • నవ్వు.. నిద్ర కంటే ఏడుపే నయం

  • మనసారా ఏడిస్తే.. ఒత్తిడి దూరం.. స్పష్టంచేసిన జపాన్ పరిశోధకులు 

  • కన్నీటికి బ్యాక్టీరియాను చంపే గుణం.. ఒంటిలోంచి వ్యర్థాలు బయటకు

  • కళ్లు శుభ్రం.. చూపు మెరుగు.. అంతర్జాతీయ పరిశోధకుల వెల్లడి

cryమనసారా నవ్వుకుంటే చాలావరకు ఒత్తిడి దూరం అవుతుందని ఇన్నాళ్ల బట్టి అనుకుంటున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా చాలాచోట్ల లాఫింగ్ క్లబ్బులు కూడా వెలిశాయి. పార్కుల్లో పది-ఇరవై మంది ఒకచోట చేరి, చేతులు పైకెత్తి, కిందకు దించుతూ నవ్వడం కూడా చూశాం. కానీ, ఇక మీదట ఈ పద్ధతి మార్చుకోవాలి. అలా పదిమందితో కలిసి గానీ, ఒక్కరే గానీ నవ్వడం కాకుండా ఏడవాలి. కనీసం వారాని కోసారి ఇలా ఏడిస్తే ఒత్తిడి, తలనొప్పులు.. ఇవన్నీ తగ్గిపోతాయట. పగలబడి నవ్వ డం కంటే, కప్పు కాఫీ తాగడం కంటే కూడా ఒక అరగంట కూర్చుని అదేపనిగా ఏడిస్తే ఎక్కడలేని రిలీఫ్ ఉంటుందని జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒత్తిడిని దూరం చేయడానికి కన్నీటికి మించిన సాధనం లేదిన బల్లగుద్ది మరీ వివరిస్తున్నారు. జపాన్‌లో హైస్కూలు మాజీ టీచర్ అయిన హడెఫుమి యొషిడా తనను తాను ‘కన్నీళ్ల టీచర్’ అని చెప్పుకొంటారు. జపాన్ దేశం మొత్తం తిరుగుతూ ఏడుపు వల్ల ఎలాంటి మానసిక ప్రయోజనాలు ఉంటాయో అనే విషయం మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లు, ప్రసంగాలు నిర్వహిస్తున్నారు. నవ్వడం, నిద్రపోవడం కంటే, ఒత్తిడి నివారణకు ఏడవడం చాలా చాలా మంచిదని ఆయన ‘జపాన్ టైమ్స్’ పత్రికకు తెలిపారు. భావప్రధానమైన సంగీతం వినడం, విషాదకరమైన సినిమాలు చూడటం, కన్నీళ్లు తెప్పించే పుస్తకాలు చదవడం ద్వారా ఏడుపు తెచ్చుకుని, వెక్కివెక్కి ఏడవాలని, దానివల్ల మానసిక ఆరోగ్యం చాలావరకు బాగుపడుతుందని ఆయన వివరిస్తున్నారు. ఇలా ఏడవడం వల్ల ‘పారాసింపతెటిక్ నెర్వ్ యాక్టివిటీ’ చాలా చురుకవుతుందని, అప్పుడు గుండె కొట్టుకునే వేగం తగ్గి.. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు. వారానికి ఒకసారి ఇలా ఏడిస్తే జీవితంలో ఒత్తిడి ఏమాత్రం ఉండబోదని ఆయన వివరించారు. యొషిడా 2014 సంవత్సరంలో టోక్యోలోని టోహో యూనివర్సిటీలో మెడికల్ ప్రొఫెసర్ అయిన హిడెహొ అరిటాతో కలిసి దీనిపై పరిశోధనలు నిర్వహించారు. ఆ పరిశోధనలలో కూడా.. ఏడవడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిరూపితం కావడంతో దానిపై అవగాహన పెంచేందుకు వరుసపెట్టి పలుచోట్ల క్లాసులు మొదలుపెట్టారు. అంతేకాదు.. ఏడుపు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇంకా చాలాచోట్ల శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి. పనిలో ఒత్తిడి, చికాకు అనిపించినా, అప్పటివరకు బాగున్న సంబంధాలు తెగిపోయినా, చివరకు సినిమా చూసినా కూడా మనకు ఏడుపు వస్తుందని, అలా ఏడవడం వల్ల కళ్లకు మంచి జరగడంతో పాటు.. మనసుకు కూడా చాలా మంచిదని అమెరికన్ శాస్త్రవేత్తలు వివరించారు. మనిషి సగటున తనకు తెలియకుండానే రోజుకు 10 ఔన్సుల కన్నీరు కారుస్తారని, అది ఏడాదికి 30 గ్యాలన్లు అవుతుందని తెలిపారు. కన్నీళ్లు రకరకాల కారణాల వల్ల వస్తాయని, ఎలా వచ్చినా చివరకు మంచే చేస్తాయని అన్నారు. ఎక్కువ భావోద్వేగానికి గురైనప్పుడు వచ్చే కన్నీళ్లలో ఒత్తిడి బాగా ఉంటుందని, ఆ కన్నీళ్లే ఒత్తిడిని బయటకు పంపేస్తాయని శాన్‌జోస్‌కు చెందిన సైకోథెరపిస్టు షారన్ మార్టిన్ చెప్పారు. కొన్నిసార్లు బహిరంగంగా, నలుగురి లో ఏడవాలంటే జనం ఇబ్బందిగా, సిగ్గుగా భావిస్తారని.. కానీ దాంట్లో సిగ్గు పడాల్సిన అవసరమే లేదని ఆయన వివరించారు. కన్నీళ్లతో వచ్చే కొన్ని ప్రధానమైన ఉపయోగాలను ఆయన తెలిపారు.

విషపదార్థాలకు విరుగుడు
కన్నీళ్లు మనల్ని మానసికంగానే కాక శారీరకంగా కూడా శుభ్రపరుసా ్తయి. ఒత్తిడిని కలగజేసే కార్టిజాల్ అనే హార్మోన్‌ను పెంచే రసాయనాలను కన్నీళ్లు తమతో పాటు బయటకు తీసుకొచ్చేస్తాయి. ఊపిరి బయటకు వదిలినా, మూత్రవిసర్జన చేసినా, చెమట కక్కినా కొన్ని రకాల విషపదార్థా లు శరీరం నుంచి బయటకు పోతాయని, అలాగే కన్నీటి ద్వారా కూడా  పోతాయని సైకియాట్రీ రీసెర్చ్ ల్యాబ్ డైరెక్టర్ డా. విలియమ్ ఫ్రే తెలిపారు. 

బాక్టీరియా హతం
బాగా ఏడవడం వల్ల బాక్టీరియా హతమవుతుంది. కన్నీళ్లలో లైసోజైమ్ అనే పదార్థం ఉంటుంది. మనిషి పాలు, వీర్యం, కళ్లి, లాలాజలం లాంటివాటిలో కూడా ఇది ఉంటుంది. దాదా పుగా అన్ని రకాల బ్యాక్టీరియాలను ఇది 10 నిమిషాల్లో 90-95 శాతం చంపేస్తుంది. ఆంత్రాక్స్‌ను కూడా జయించగల సామర్థ్యం కన్నీటికి ఉంటుందని ఫుడ్ మైక్రోబయాలజీ అనే పత్రికలో పేర్కొన్నా రు. బ్యాక్టీరియాకు రక్షణ కల్పించే బయటివైపు గోడలను ఛేదించడం ద్వారా లైసోజైమ్ బ్యాక్టీరియాను చంపుతుంది. 

బాగుపడే మూడ్ 
ఎప్పుడైనా మూడ్ అస్సలు బాగోలేదని మానసిక వైద్యుల వద్దకు వెళ్తే యాంటీ డిప్రసెంట్ మందులు ఇస్తారు. కానీ వాటన్నింటికంటే కన్నీళ్లు చాలా బాగా ఉపయోగపడతాయి. కన్నీరు కార్చడం వల్ల డిప్రెషన్‌తో బాధపడేవారిలో దాదాపు 90 శాతం మందికి పరిస్థితి మెరుగైందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా నిపుణులు చెప్పారు.

Tags
English Title
Let's cry .. Come on!
Related News