గొల్లభామ చీరకు మరింత ప్రాచుర్యం

Updated By ManamWed, 07/11/2018 - 16:29
ktr-harish
ktr-harishrao

హైదరాబాద్ : చేనేత కార్మికుల సమస్యలపై మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు బుధవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట చేనేత కార్మికుల సమస్యలు, నేతన్నల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. గొల్లభామ చీరకు మరింత ప్రాచుర్యం తీసుకు వచ్చేందుకు రాష్ట్రంలోని అన్ని గోల్కొండ షోరూంలలో వీటిని అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రులు తెలిపారు. 

అలాగే నేతన్నల అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తోందని అన్నారు. నేతన్నకు చేయూత, చేనేత మిత్ర, మగ్గాల ఆధునికీకరణ, వంటి కార్యక్రమాలను వారికి అందుబాటులో ఉండేలా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

దుబ్బాక, చేర్యాల, సిద్ధిపేటలోని సొసైటీల భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు టెక్‌టైల్స్ డిపార్ట్‌మెంట్ నిధులు అందిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే  టెక్‌టైల్స్ డిపార్ట్‌మెంట్ తరఫున ఇచ్చే బతుకమ్మ చీరలను మంత్రులు పరిశీలించారు. సమీక్ష సమావేశానికి ఉప సభాపతి పద్మా దేవేందర్ రెడ్డి,  ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ , భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, సోలిపేట రామలింగారెడ్డి తదితరులు హాజరయ్యారు.
 

English Title
KTR, Harish rao Review Meet Officials over Handloom Weavers problems
Related News