కోహ్లీ ‘ఖేల్ రత్న’

Updated By ManamFri, 09/21/2018 - 00:15
Kohli
  • మీరాబాయ్ చాను కూడా

  • క్రీడా పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

imageన్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వరల్డ్ చాంపియన్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర అవార్డును ఈ నెల 25న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకోబోతున్నారు. అదే రోజు ద్రోణాచార్య  అర్జున అవార్డులను కూడా రాష్ట్రపతి అందజేస్తారు. ఈ అవార్డుల జాబితాను ముందే సిద్ధం చేశారు. కానీ గురువారం అధికారికంగా ప్రకటించారు. అర్జున అవార్డుకు ఎంపిక చేసిన 20 మందిలో స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కూడా ఉన్నాడు. గతంలో క్రమశిక్షణారాహిత్యంగా ప్రవర్తించినందుకు ఆర్చరీ కోచ్ జీవన్‌జోత్ సింగ్ తేజను బుధవారం ద్రోణాచార్య అవార్డుల జాబితా నుంచి తొలగించారు. ద్రోణాచార్య అవార్డు కోసం సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన ఐదుగురు కోచ్‌లలో తేజ ఒకరు. అయితే 2015 కొరియాలో జరిఇన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ సందర్భంగా క్రమశిక్షణారాహిత్యంగా ప్రవర్తించి ఒక సంవత్సరం నిషేధానికి గురైనందుకు ఆయన పేరును పక్కన పెట్టారు. 

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీ నంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. 2016, 17 సంవత్సరాల్లో ఈimage ప్రతిష్టాత్మక అవార్డును పొందలేకపోయినప్పటికీ గత మూడేళ్లగా కోహ్లీ అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నాడు. 29 ఏళ్ల కోహ్లీ 71 టెస్టుల్లో 6,147 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలున్నాయి. ఇక 211 వన్డేల్లో 9,779 పరుగులు సాధించాడు. ఇందులో 35 సెంచరీలున్నాయి. గతేడాది జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 48 కిలోల కేటగిరిలో స్వర్ణం సాధించిన కారణాన చానును ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేశారు. అంతేకాదు ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పసిడి పతకాన్ని గెలిచింది. అయితే గాయం కారణంగా ఆసియా గేమ్స్‌కు దూరమైంది. అసాధారణ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించే క్రమంలో ఇచ్చే నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్‌ను గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత నాలుగేళ్లలో అద్భుత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును ఇస్తారు. ఈ ఏడాది ఈ అవార్డుకు టీ మిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను అందుకోబోతున్నారు. నాలుగేళ్లుగా స్థిరంగా రాణించిన క్రీడాకారులకు అర్జున అవార్డును, అంతర్జాతీయ టోర్నీలో పతక విజేత క్రీడాకారులను తయారు చేసిన కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డును, క్రీడాభివృద్ధికి జీవితకాల సహకారాన్ని అందించిన వారికి ధ్యాన్ చంద్ అవార్డును ఇస్తారు.

image


ఈ ఏడాది ఈ అవార్డుల కోసం చాలా దరఖాస్తులు వచ్చాయి. అయితే మాజీ ఒలింపియన్, అర్జున అవార్డు గ్రహీతలు, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు, ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీతలు, స్పోర్ట్స్ జర్నలిస్ట్‌లు, నిపుణులు, కామెంటేటర్లు, స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్స్‌తో కూడిన సెలెక్షన్ కమిటీ ఈ అవార్డులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. కమిటీ సిఫారసులు, తీవ్ర పరిశీలన అనంతరం క్రింది క్రీడాకారులకు, కోచ్‌లకు, సంస్థలకు అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులను ఈ నెల 25న రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అందిస్తారు. ఈ అవార్డులను అందుకోబోయేవారికి పతకం, ప్రశంసాపత్రంతో పాటు రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర గ్రహీతలు రూ. 7.5 లక్షలు, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ గ్రహీతలు ప్రతిమలు, సర్టిఫికెట్లతో పాటు రూ. 5 లక్షలు, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ గ్రహీతలకు ట్రోఫీ, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. ఇంటర్ యూనివర్సిటీ టోర్నీల్లో ఓవరాల్‌గా అద్భుత ప్రతిభ కనబరిచిన యూనివర్సీటీకి ఎమ్‌ఏకేఏ ట్రోఫీని, అవార్డు కింద రూ. 10 లక్షలు, సర్టిఫికెట్ ఇస్తారు. 
 

English Title
Kohli 'Khel Ratna'
Related News