అభిమానులకు టీమిండియా కెప్టెన్ కోహ్లీ భావోద్వేగ విజ్ఞప్తి

Updated By ManamTue, 08/14/2018 - 22:39
kohli

imageలండన్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా పేలవ ప్రదర్శనతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఒక మెసేజ్ పెట్టాడు. దయచేసి తమను బాధపెట్టొద్దని.. ఇక మీదట మిమ్మల్ని బాధపెట్టమని భావోద్వేగంతో విజ్ఞప్తి చేశాడు. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 159 పరుగులతో ఓటమిపాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో కోహ్లీ సేన వెనకబడింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ సేన తొలి ఇన్నింగ్స్‌లో 107, రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. సిరీస్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే శనివారం నాటింగ్‌హామ్‌లో ప్రారంభం కానున్న మూడో టెస్టులో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఎడ్గ్‌బాస్టన్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగులతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 

‘కొన్నిసార్లు గెలుస్తాం.. కొన్నిసార్లు గుణపాఠాలు నేర్చుకుంటాం. కానీ మీరు మమ్మల్ని ఎన్నడూ బాధపెట్టలేదు. నేను కూడా మీకు ఒక వాగ్థానం చేస్తున్నాను. ఇక మీదట మేము మిమ్మల్ని ఎన్నడూ బాధపెట్టం. దయచేసి మమ్మల్ని బాధపెట్టకండి’ అని కోహ్లీ తన ఫేస్‌బుక్ పేజ్‌లో మెసేజ్ పెట్టాడు. ‘ఈ సిరీస్‌లో ముందుకు కొనసాగాలంటే గత మ్యాచ్‌లు చేసిన తప్పులను తెలుసుకుని వాటిని సరిచేసుకోవాలి. ఓ క్రీడాకారుడికి అంతకుమించి మరో మార్గం లేదు’ అని కోహ్లీ పేర్కొన్నాడు. రెండో టెస్టులో వెనునొప్పి గాయంతో బాధపడిన కోహ్లీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తన నంబర్ వన్ ర్యాంక్‌ను కోల్పోయాడు. రెండో టెస్టులో అంతగా రాణించకపోవడమే ఇందుకు కారణమైంది. 

కోహ్లీ సేనకు తగినంత ప్రాక్టీస్ లేదు: బేలిస్
టీమిండియాపై వస్తున్న విమ ర్శలను ఇంగ్లాండ్ కోచ్ ట్రెవర్ బేలిస్ సమర్థించారు. కోహ్లీ సేన తగినంత ప్రాక్టీస్ లేకుం డానే ఈ టెస్టు సిరీస్‌లో పాల్గొం టోందని.. అందుకే రెండు మ్యాచ్‌ల్లోనూ ఘోర పరాజయంపాలైందని ఆయన అన్నారు. ‘సర్వసాధారణమైన అంశమేంటంటే.. ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లాండ్ వంటి జట్లు క్రికెట్ ఎక్కువగా ఆడతాయి. సాధారణం కంటే ఎక్కువగా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాలని అందరూ కోరుకుంటారు. కానీ అది సాధ్యపడదు. చాంతాడంత ప్లేయర్స్ జాబితా ఉన్నప్పుడు కొంత మందికి విశ్రాంతి ఇస్తాం. చాలా మంది అన్ని గేమ్‌లు ఆడతారు. కానీ వాళ్లకు మరిన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు అవసరం. అది దాదాపుగా అసాధ్యం’ అని బేలిస్ అన్నారు. టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా ఒకే ఒక్క ప్రాకీస్ మ్యాచ్ ఆడింది. అది కూడా అవుట్ ఫీల్డ్ బాగోలేదని.. పిచ్‌పై గడ్డి ఎక్కువగా పెంచారన్న కారణాలతో నాలుగు రోజు ఆ ప్రాక్టీస్ మ్యాచ్‌ను మూడ్రోజులకు కుదించారు. తాము కూడా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురైందని బేలిస్ చెప్పారు. ‘మేం కూడా వీలైనన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాలనుకున్నాం. బాగా సిద్ధపడి ఉంటే ఇలాంటి ప్రశ్నలే అడిగేవాళ్లం. మరిన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడటమంటే మాకు చాలా ఇష్టం. కానీ వారానికి ఉండేది 7 రోజులే కానీ 10 రోజులు కాదుగా’ అని బేలిస్ చెప్పారు.

కోచ్ ఎందుకు మాట్లాడటం లేదు: హర్భజన్
ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-0తో వెనకబడటంపై చాలా మంది కెప్టెన్ విరాట్ కోహ్లీని నిందిస్తున్నారు. కానీ టీమిండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాత్రం కోచ్ రవిశాస్త్రిపై తీవ్ర విమర్శలు చేశాడు. రెండో టెస్టులో వర్షం కారణంగా తొలి రోజు ఆట జరగకపోయినప్పటికీ ఇన్నింగ్స్, 159 పరుగులతో ఘోరంగా ఓడిపోవడంపై శాస్త్రి బాధ్యత వహించాలని, అందుకు సమాధానం చెప్పాలని భజ్జీ అంటున్నాడు. ‘మరో రెండ్రోజుల్లో కోచ్ మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది. ఒకవేళ టీమిండియా ఈ సిరీస్‌ను కోల్పోతే ఆయన మాట మార్చి వాతావరణంలో జరిగిన గొప్ప మార్పు వల్ల ఇలా జరిగిందని చెబుతాడేమో’ అని ఓ హిందీ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ అన్నాడు. తమ జట్టు మరే ఇతర జట్టుకు భయపడదని ఇంగ్లాండ్ పర్యటనకు ముందు శాస్త్రి అన్నారు. అంతేకాదు పర్యాటక జట్లలో తమది ఉత్తమ సామర్థ్యం గల జట్టుగా నిలుస్తుందని కూడా చెప్పారు. ప్రత్యర్థితో కాదు.. పిచ్‌తో ఆడబోతున్నామని కూడా అన్నారు. 

మీ సామర్థ్యాన్ని మీరే అనుమానించకండి: లక్ష్మణ్
లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పొందడంతో అన్ని వర్గాల నుంచి కోహ్లీ సేనకు తీవ్ర విమర్శలెదురవుతున్నాయి. ముఖ్యంగా బాధ్యతలు మరిచి ఇంగ్లాండ్‌కు దాసో హం కావడంపై మాజీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్థానిక వాతావరణాన్ని ఇంగ్లాండ్ జట్టు చక్కగా వినియోగించుకుంటోంది. ఈ నేపథ్యంలో కోహ్లీ సేన తమ సామర్థ్యంపై నమ్మకముంచడం లేదని హైదరాబాద్ స్టైలిష్ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. ఓ ఆంగ్ల దినపత్రిక  కాలమ్‌కు ఆయన రాస్తూ.. ‘ఎడ్గ్‌బాస్టన్‌లో అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించిన టీమిండియా రెండో టెస్టులో ఆ మేరకు ప్రతిఘటించలేకపోయింది. మరోవైపు ఇంగ్లాండ్ స్థానిక వాతావరణాన్ని చక్కగా వినియోగించుకుంది. అంతేకాదు వాళ్లకు పిచ్ నుంచి కావాల్సిన సహకారం అందింది. మనవాళ్లు బ్యాటింగ్ చేసే సరికి పిచ్ మృదు త్వాన్ని కోల్పోయింది. ఇక సాంకేతిక లోపాల విషయానికొస్తే.. మన వాళ్లకు తమ సామర్థ్యంపై నమ్మకం లేనట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కసారి తన మీద తనకే నమ్మకాన్ని కోల్పోతే మళ్లీ పుంజుకోవడం కష్టం’ అని లక్ష్మణ్ అన్నారు. 

English Title
kohli emotional appeal
Related News