కిప్లింగ్, శ్రీ శ్రీ రైతు భారత గీతాలు

Updated By ManamMon, 06/11/2018 - 03:33
Famine

Famineప్రపంచం ఒక పద్మ వ్యూహం అయితే రోజూ దాన్ని  కవిత్వ ఆయధ ధారులై చేధించడం కవి ధర్మం. దీన్ని పుష్క లంగా పాటించిన కవులు ప్రజల సంపద. రాజకీయ సామాజిక చైతన్యం తో దీనిని  తెలుగు సాహిత్యంలో ముందుగా తలకెత్తుకున్నది మహా కవి శ్రీ శ్రీ. తిక్కన, వేమన గురజాడ తన కవిత్రయం అని చెప్పిన వారు. కవిత్వంలో నాటకీయత, ఘటనాఘటన వేగం, సంప్రదాయ ప్రతీకలను  ఉపయోగించడంలో కొత్త  మెలకువలకు దారి తీయడం, ఇరవయ్యో శతాబ్దాన్ని ఎలా కవిత్వీకరిస్తున్నారో శ్రద్ధగా అధ్యయనం చేయడం, శ్రీ శ్రీ అభివ్యక్తి సజీవతకు బలమైన కారణాలు. ఈయన  కవిత్వం చెప్పే దాకా, ప్రపంచాన్ని తన అక్షరాల ద్వారా తెలుగు వారికి పరిచయం చేయ డం అరకొరగానే ఉండేది. బహుశా అంతకు ముందర, ప్రపంచ సాహిత్యాన్ని ముఖ్యంగా పాశ్చాత్య నాటకాలను తెలుగు వారికి అందచేసే స్ఫూర్తి మొదలు కందుకూరి వీరేశలింగం గారితో అని  చెప్పగలం. ఒక అర్థ శతాబ్దం ముందర  కందుకూరి కాలానికి లేని వర్గ చైతన్యం 1920ల నుంచీ ప్రపంచాన్ని చుట్టుముట్టింది. దానిని పాలకులు, పాలితులు, రాజ్యాలు,  వలస పెత్తనాల దోపిడీ, ఖండ ఖండాంతరాల్లో ప్రజల స్వాతంత్య్రాకాంక్షలు, మెల్లగా మెల్లగా దా దాపు ఒక నలభై దేశాల్లో భిన్న దశల్లో  రగులుతున్న కాలం శ్రీ శ్రీ గారిది. అందుకే వారి కవిత్వంలో, సామాజిక న్యాయం కోసం ఆ తహతహ. అందుకే ప్రపంచం ఎటు నడుస్తున్నదో తెలిస్తే తప్ప, కవిత్వం శక్తివంతంగా రాయలేని పరిస్థితి.

ప్రపంచాన్ని కవిత్వానికి  గండ పెండేరంగా తొడిగిన జిజ్ఞాసి  శ్రీ శ్రీ. చూసే కళ్ళను, రాసే వాక్కును, ఆయన ప్రపంచం నుంచి సాధించుకున్నాడు. అక్షరం ఒక ప్రయోజనం కోసం అంతర్జాతీయం కావడానికి గత శతాబ్దంలో తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ కృషి పునాది. అనువాదంలో ప్రపంచాన్ని తెలుగు వారికి అందించడం, శ్రీశ్రీ నిత్య సృజన. అలా శ్రీ శ్రీ  1944లో అందుకున్న  ఒక కీలక కవిత  భాగ్య లక్ష్మి. ఇది రడ్యార్డ్  కిప్లింగ్ 1888లో రాసిన ఆంగ్లకవిత. కవిత అప్ప టి పాలకులైన బ్రిటిష్ క్రౌన్ ఒక వ్యతిరేక రచన. రాస్తున్నది ఒక బ్రిటిష్ యువకుడు. సందర్భం 1857 సిపాయి తిరుగుబాటు  తరు వాతి దశాబ్దాల  భారత ఉపఖండం. ఇంత పెద్ద రాజ్య పాలనలో  ఈస్టిండియా కంపెనీ చేసిన తప్పులు కారణంగా వచ్చిన సాంఘిక అలజడికి సాయుధ రూపం సైనికుల  తిరుగుబాటు తప్ప, అది కేవలం సిపాయిలు, సామ్రాజ్యం కలహించుకున్న సులభ విషయం కాదు. ఈ నేపథ్యంలో, కొత్త ప్రత్యక్ష బ్రిటిష్ ప్రభుత్వ పాలన దేశం లో నెలకొన్న క్రమంలో వారు  ఈ విశాల భారత ఉప ఖండంలో, ఎక్కడి సామాజిక స్థితిగతులు, భిన్న ప్రాంతాల ప్రజల జీవన స్థాయి, వగైరాల వివరాల సేకరణ ద్వారా, తమ విధానాల సవ  రింపు, వాటిని మరింత ఉపయోగంగా మలిచే ప్రయత్నాలు చేశారు. వాటికోసం ఈ ప్రజా జీవన గణాంకాలు సేకరింపు పెద్దయెత్తున చేసేందుకు, కమిటీలు నియమించారు. ఆ కమిటీలు 1888 నాటికి, భారతదేశం గురించిన భిన్న భిన్న గణాంకాలను ప్రభుత్వానికి  అందించారు. 1880 లో జరిగిన లెక్కలు అంటూ కందుకూరి కూడా 1881లో తన అతి బాల్య వివాహం ప్రసంగంలో ప్రస్తావిస్తారు. ఇదే,  యువ కిప్లింగ్‌కు కవిత్వ సందర్భం అయ్యింది. దీన్ని తాను ప్రభు త్వపు కాకి లెక్కలు, ‘ఆల్ ఈజ్ వెల్ విత్ ద వరల్డ్’ అనే మాయ నివేదికలు అని భావించి ‘‘మాస్క్ (ఝ్చట్ఞఠ్ఛ) ఆఫ్  ప్లెంటీ’’ అని ఈ  జనాభా లెక్కల ఆర్భాటంపై ఒక నిశితమైన  కవిత రాశాడు. 

ఇది మూలంలో నూట పదిహేను పంక్తుల కవిత. యువ కిప్లింగ్ ఈ వ్యవహారం అంతా, ప్రభుత్వానికి తీపి కబుర్లు చెప్పడా నికి జరిగిన ఒక  ఖర్చుదారీ జాతరగా  అభివర్ణించాడు. ఈ కవిత, అప్పట్లో అక్టోబర్  1888లో  లాహోర్ నుంచి వచ్చే  ‘ది పయనీర్’ పత్రికలో తరువాత, ‘‘సివిల్ అండ్ మిలిటరీ గెజిట్’’ లో  కూడా ముద్రణ పొందింది. బ్రిటిష్ పాలన వ్యతిరేక రచనల్లో ఇదొక ముఖ్య స్థానంలో ఉన్నది. దీన్ని ఆ తర్వాత డిపార్ట్మెంటల్ దిత్తీస్ అని సంకలనం చేసినప్పుడు, ఎన్నో పంక్తులు తొలగించి ఆ సంకలనంలో చేర్చారు. సిపాయిల విప్లవం తరువాత, నీలిమందు రైతుల బాధలు  ఇంగ్లాండ్‌లో తీవ్ర చర్చలకు, విమర్శలకు దారి తీశాక, 1860ల్లో  ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతరించి, బ్రిటిష్ ప్రభుత్వమే   భారత ఉపఖండంలో ప్రత్యక్ష పాలన చేపట్టాక కూడా పరిస్థితులు పెద్దగా మారలేదు, సామాన్య ప్రజల  స్థితి  తీన్తారుగా ఉన్నది అని  కిప్లింగ్ చెప్పదలుచుకున్నాడు. అదే చెప్పాడు కూడా. బ్రిటిష్ పాలనలో, అది కంపెనీ పెత్తనం అయినా, ప్రత్యక్ష రాణి పాలన అయి నా, దేశీయ రైతాంగ సమస్యలు, పెద్దగా పరిష్కారానికి నోచు కోలేదన్నది కిప్లింగ్ నిష్టుర స్వరం. ఆ మేరకు ఇది బ్రిటిష్ ఇండియా సాహిత్య రాశిలో ఒక ప్రధాన రచన.

నిస్సందేహంగా ప్రజల పట్ల తత్పరత గల యువ  శ్రీ శ్రీ అనువాదంలో,  కిప్లింగ్ రాసిన అరవై ఆరేళ్ళకు, ఈ కవిత తెలుగులోకి రావడం జరిగింది. ‘‘ఏంజిల్ ఆఫ్ ప్లెంటీ’’ అని మూలం లో రాసిన దాన్ని, శ్రీ శ్రీ, వ్యంగ్య స్వభావపు కవితకు  సరిపోయేట్టు ‘‘భాగ్యలక్ష్మి’’ అని పేరు పెట్టారు. సంపన్ను లకు భాగ్యం, సామాన్యులకు  నిర్భాగ్యం ఈ రెండు దశలను, ఒక జాతరలా జరిగిన ఈ జనాభా లెక్కల హంగామా, సమాంతర  ఏక కాల పరిణామాలను, అటు కిప్లింగ్ ఎంత  శక్తివంతంగా రాశాడో, అంతే  శక్తివంతంగా  తెలుగు చేశారు శ్రీ శ్రీ. కిప్లింగ్  ఈ కవితను ‘‘ఫ్రెంచ్ పల్లీయ  కళారూపం’’ అని ప్రదర్శన పద్ధతిలో రాస్తే, తెలుగులో దాన్ని యక్షగానంగా మార్చి, శ్రీ శ్రీ రాశారు. ప్రదర్శన సూచనలు, మూలంలో ఎక్కువ. అరవై ఆరేళ్ళ తరువాత  1944లో శ్రీ శ్రీ అనువాదంలో ఈ కవిత దాదాపు మూడో వంతు తగ్గింది. శ్రీ శ్రీ అవలంబించిన పద్ధతిని అనువాదం కన్నా సంక్షిప్త తెలుగుసేతగా చెప్పవచ్చు. సంచార జాతుల ప్రస్తావన చేసిన  కిప్లింగ్ చరణాలను, భారత సమాజ కులాల ప్రస్తావనగా మార్చి రాయడంలో శ్రీ శ్రీ తీసుకున్న స్వేచ్ఛ కనిపిస్తుంది. (‘‘కాపులూ కర ణాలు రాజులూ రెడ్లు బ్రాహ్మణులు వైశ్యులూ మాల మాదిగలు పిండార్లు థగ్గులూ జైనులూ జాట్లు సర్కారు దయవల్ల గోవిందా రామ చల్లగా వున్నారు గోవిందా తిని తిరిగి హాయిగా గోవిందా రామ తెగ బలిసి పోయారు గోవిందా  గో‘ఓ’వింద!’’).  

ఈ  ప్రస్తావన మూలంలో ‘‘దోమ్,  మాగ్, ఠాకూర్,  థగ్, నట్ , బంజారీ, బనియా, రైత్, జైన్, జాట్, బజుగర్’’ అని  కిప్లింగ్ ప్రస్తావిస్తాడు. భారతీయ రైతు జీవితం, పల్లె వెతలు కిప్లింగ్  చెప్పి నది, శ్రీ శ్రీ  అనువాదంలో  శక్తివంతంగా ధ్వనించింది.
‘‘బక్కచిక్కిన దుక్కిటెద్దుల ప్రాణములు కనుగొనల దాగెను -  ఆకసము రక్తాగ్ని కుండము భూమి నల్లని బొగ్గుకుంపటి
మండుగాడుపు టెండవేడికి మరిగి కాలం భగీల్మన్నది -  ...   - ఇంత వర్షపు చినుకు కోసం చూచి కన్నులు సున్న మైనవి 
ఏడుపెందుకు వెర్రి బిడ్డా ఎవరు నీ మొర లాలకింతురు - చచ్చిపోయిన గొడ్డు నదుముకు చచ్చినట్టే నిద్రపోవోయ్!’’
స్వతంత్ర భారత దేశంలో  ఇటీవలి  దశాబ్దాల లక్షలాది రైతుల ఆత్మహత్యలు, పంటల వైఫల్యాలు, గిట్టుబాటు ధరలు లేక పోవడం, బాంక్ అప్పు పుట్టని దయనీయమైన పరిస్థితులు, ఇలా  క్రమేపీ, నూట ఇరవై ఏళ్ల కిందటి పరిస్థితులను ఇంకా  ఆగమ్య గోచరంగా మార్చాము తప్ప, ఒక శాస్త్రీయ దృష్టితో కూడిన  ఆర్థిక క్రమశిక్షణ లేని సమాజంగా మరింత ప్రమాదాల  దిశగా, సాంఘిక సంక్షోభాల దిశగా వెళ్తున్న  సమాజానికి  ఈ కవిత ద్వారా అటు రడ్యార్డ్ కిప్లింగ్, ఇటు తన రచనను తెలుగులో సజీవం చేసిన మహాకవి శ్రీ శ్రీ, హెచ్చరికలు, సుప్రభాత గర్జనలు చేశారు. 

(ఈ రచన  శ్రీ శ్రీ సారస్వతంలో నూతన లభ్య రచన  కావడం, ఇంతవరకూ శ్రీ శ్రీ  సాహిత్య సంపుటాల్లోకి ఎక్కక పోవడం  ఒక చరిత్ర. ఈ దిశగా జరిగిన పరిశోధన ఫలితాలను కొంత వెల్లడించే  క్రమంలో,  ఆ చారిత్రాత్మక  నూతన లభ్య రచనల  వివరాలతో ,  శ్రీ శ్రీ  ముప్ఫై అయిదో వర్ధంతి జూన్ 15న, మహాకవి  పుట్టిన ఊరు  విశాఖపట్నంలో, సాయంత్రం ఆరు గంటలకు, మొజాయిక్ సాహిత్య సంస్థ ఘనంగా  శ్రీ శ్రీ నూతన లభ్య రచనల  పరిచయ  సభ నిర్వహిస్తున్నది) 
రామతీర్థ 
98492 00385 

Tags
English Title
Kipling, Sri Sri Farmer Indian songs
Related News