ఖేలో ఇండియా షురూ

Khelo India Youth Games
  • బరిలో 6 వేల మంది అథ్లెట్లు

న్యూఢిల్లీ: దేశాభివృద్ధిలో భాగంగా యువత, అట్టడుగు అభివృద్ధిపై కేంద్రం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఖచ్చితంగా ఆ కోవ కిందికే వస్తుంది. ఈసారి ఖేలో ఇండియాను భారీ ఎత్తున నిర్వహించడానికి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. వివిధ వయస్సుల వాళ్లు 18 విభాగాల్లో పాల్గొన్ననున్నారు. ‘గత కొన్నేళ్లుగా గ్రాస్ రూట్ స్థాయిలో క్రీడల శబ్దం వినిపిస్తోంది. అది నిరంతరం కొనసాగుతుంది. అయితే గతేడాది ఖేలో ఇండియాను ప్రవేశ పెట్టేంత వరకు క్రీడలపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఖేలో ఇండియా క్రీడలు వర్గాల వారికి లాభదాయకంగా ఉంది’ అని కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నారు. రెండో ఎడిషన్ ఖేలో ఇండియాలో 10 నుంచి 21 సంవత్సరాల స్కూల్, కాలేజీ విద్యార్థులకు కూడా అవకాశం కల్పించారు. దీంతో 6 వేల మంది అథ్లెట్లు ఈసారి పోటీల్లో తలపడనున్నారు. బుధవారం మహారాష్ట్రలో ప్రారంభమైన ఈ పోటీలు ఈనెల 20వ తేదీన ముగుస్తాయి. పుణేలోని బలెవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌తో పాటు ముంబైలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్చరీ), మరౌడి, పోలీస్ గ్రౌండ్ శివాజీ నగర్ (ఫుట్‌బాల్), ఎన్‌డీఏ హాకీ గ్రౌండ్ (బాలికల హాకీ), ఎంహెచ్‌ఏ మహింద్ర హాకీ స్టేడియం (బాలుర హాకీ) ఈ పోటీలకు ఆతిథ్యమిస్తున్నాయి. ఈ వేదికల్లో అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన అథ్లెట్లు కూడా పతకాల కోసం పోటీ పడనున్నారు. ఇందులో మను భకర్, సౌరబ్ చౌదరి, మెహులి ఘోష్ (షూటింగ్), జిస్నా మాథ్యూ (అథ్లెటిక్స్), జెరెమి లాల్రినుంగ (వెయిట్‌లిఫ్టింగ్), శ్రీహరి నటరాజ్ (స్విమ్మింగ్) ఉన్నారు. వరుసగా స్వర్ణ పతకాలు సాధిస్తూ, వరల్డ్ రికార్డులు నెలకొల్పుతూ భకర్, చౌదరి యువతను ఆకట్టుకుంటున్నారు. 16 ఏళ్ల చౌదరి గతేడాది ఆసియా గేమ్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో, యూత్ ఒలింపిక్స్, ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్ షిప్స్, ఆసియన్ ఎయిర్ గన్ చాంపియన్‌షిప్స్‌లలో స్వర్ణ పతకాలు గెలిచాడు. అంతే వయసున్న భకర్ ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్, కామన్వెల్త్ గేమ్స్, యూత్ ఒలింపిక్స్‌లలో పసిడి పతకాలను సొంతం చేసుకుంది. తొలి ఎడిషన్‌లోనూ పాల్గొన్న లల్రినుంగ యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు. 62 కిలోల విభాగంలో భారత్‌కు తొలి యూత్ ఒలింపిక్స్ పతకాన్ని అందించాడు. యూత్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఇతర అథ్లెట్లు రైఫిల్ షూటర్ మెహులి ఘోష్, ఆర్చర్ ఆకాష్ మాలిక్ కూడా ఈ రెండో ఎడిషన్ ఖేలో ఇండియాలో పాల్గొంటు న్నారు. దీంతో పాటు 19 ఏళ్ల రన్నర్ మాథ్యూ రియో ఒలింపిక్స్ అనుభవాన్ని ఈ గేమ్స్‌లో ఉపయోగించనుంది. పీటీ ఉష శిష్యురాలైన ఈమె గత రెండో ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచింది. అంతేకాకుండా బ్యాక్‌స్ట్రోక్ స్విమ్మర్ నటరాజ్ తన కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ అనుభవాన్ని యువతతో పంచుకోనున్నాడు. బాక్సింగ్ క్రీడలో ఏఐబీఏ వరల్డ్ యూత్ బాక్సింగ్ చాంపియన్ సాక్షి చౌదరి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అంతేకాకుండా డబ్ల్యూటీఏ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఇటీవల 200లోపు ర్యాంక్ సాధించిన కర్మన్ కౌర్ థండిపై కూడా అందరి దృష్టి ఉంది.

సంబంధిత వార్తలు