వివాదాలకు కేరాఫ్ టీఎస్‌పీఎస్సీ 

Updated By ManamThu, 05/17/2018 - 22:31
TSPSC-LOGO
  • ప్రభుత్వానికీ సడలిన నమ్మకం.. ప్రత్యామ్నాయ మార్గంలో సర్కార్

  • శాఖాపరంగా ప్రత్యేక బోర్డులు.. గురుకులాల బాధ్యత ఆ శాఖకే..

  • అదే దారిలో వైద్యారోగ్య శాఖ.. త్వరలో మరిన్ని శాఖలదీ అదే బాట

TSPSC-LOGOహైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడ్డాక.. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం సదుద్దేశంతో టీఎస్‌పీఎస్సీని ఏర్పాటు చేసింది. వివాదాలకు దూరంగా ఉండే ప్రొఫెసర్ గంటా చక్రపాణిని దానికి చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. అయితే ఉద్యోగాల కల్పన కీలకంగా వ్యవహరించాల్సిన టీఎస్‌పీఎస్సీ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. అదిగో ఉద్యోగాలు.. ఇదిగో నోటిఫికేషన్లు అటు హడావుడి చేయడం తప్ప.. ఒక్కటీ సక్రమంగా నిర్వహించింది లేదు. టీఎస్‌పీఎస్సీ తీరుతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు. ప్రధానంగా గ్రూప్-2లో అక్రమాలు, గురుకులాల్లో లింగవివక్ష, కానిస్టేబుల్ ఫలితాల్లో అవకతవకలు, ఎస్‌ఐ పోస్టులకు ఫలితాలను ప్రకటించకపోవడం వంటి అంశాలపై అభ్యర్థులు కోర్టులో పిటిషన్లు వేశారు. అభ్యుర్థుల వాదనను సమర్థించిన హైకోర్టు కొన్నింటిపై స్టే ఇచ్చింది. జోనల్ వ్యవస్థ రద్దు కావడంతో టీఎస్‌పీఎస్సీకి స్పష్టత లేక.. వివాదాలు తలెత్తుతున్నాయి. ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నా.. సాంకేతిక సమస్యలతో కోర్టులో నిలిచిపోతున్నాయి. నోటిఫికేషన్ విడుదల చేసేముందు నిపుణలతో చర్చించి అందులో లోపాలను సరిదిద్దుకుంటే బాగుంటుందని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. టీఎస్‌పీఎస్సీ అనాలోచిత విధానాల వల్ల ప్రతి నోటిఫికేషన్ వివాదాస్పదమవుతోంది. ఉద్యోగాల భర్తీ లేక నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ప్రత్యామ్నాయంవైపు ప్రభుత్వ చూపు..
గతంలో విద్యుత్, టీచర్, పోలీసు ఉద్యోగాల భర్తీని ఆయా శాఖలే చేపట్టేవి.. వీటితో పాటూ చాలా శాఖలు వాటి అవసరాల మేరకు కొలువుల భర్తీని సొంతంగా నిర్వహించుకునేవి.. వేల టీచర్ పోస్టులను ఒకేసారి నింపాల్సిన స్థితిలోనూ జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీలు సాఫీగా నియామకాల్ని పూర్తి చేసేవి. కానీ అన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చి.. టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయించాలనే ప్రభుత్వ సంకల్పం కాస్త.. సర్వీస్ కమిషన్ పనితీరు కారణంగా నీరుగారిపోయింది. ఇటీవల 6వేల గురుకుల పోస్టుల భర్తీ బాధ్యతను కమిషన్‌కు అప్పగించలేక ప్రత్యేక నియామక బోర్డును ఏర్పాటుచేసి మరీ నియామక ప్రక్రియను దాని చేతుల్లో పెట్టింది. గతేడాది అప్పగించిన 8 వేల పోస్టుల భర్తీ ప్రక్రియను సక్రమంగా పూర్తిచేయకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీఎస్‌పీఎస్సీకి అప్పగించిన కొన్ని పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా తామే చేపట్టాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ ఆలోచిస్తుందనే సమాచారం తెలుస్తోంది. ఇక సంక్షేమ, వ్యవసాయ తదితర శాఖల్లో చేపట్టాల్సిన నియామకాల్ని కూడా ఆయా శాఖలకే అప్పగించాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ప్రశ్నపత్రం తయారీలో కాపీ పేస్ట్..
గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 14న పరీక్ష నిర్వహించింది. మొత్తం 300 ప్రశ్నలకు 200 ప్రశ్నలు ఒక ప్రైవేటు బ్లాగులో పొందుపర్చిన ప్రశ్నల నుంచే వచ్చాయి. ప్రశ్నలు మాత్రమే కాదు.. ఆప్షన్స్ కూడా మక్కీకి మక్కీగా అవే ఉండడంతో కమిషన్ కాపీ కొట్టిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ ప్రైవేటు బ్లాగు ఎవరిదంటే.. మన పొరుగు దేశానికి సంబంధించిన అబిద్ బుఖారీ అనే వ్యక్తిది! బుఖారీ తన బ్లాగులో మూడేళ్ల కిందట పెట్టిన ప్రశ్నలనే కమిషన్ ఇప్పుడు యథాతథంగా స్వీకరించింది. అదికూడా ఒకటీ రెండూ కాదు.. అందులో మొత్తం మూడు వందల ప్రశ్నలు ఉండగా ఏకంగా రెండొందల ప్రశ్నలను వాటిలోనుంచే తీసుకోవడం గమనార్హం! సంబంధిత సబ్జెక్టు నిపుణులు, వీసీలతో కూడాన కమిటీలు చర్చించి ప్రశ్నపత్రాల రూపకల్పన చేయాల్సి ఉండగా.. ఓ ప్రైవేటు బ్లాగులో నుంచి తస్కరించడం ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కమిషన్‌లో ప్రశ్నపత్రాల రూపకల్పనకు సంబంధించిన విభాగం ఇంత దారుణంగా ఉందా అని వాపోతున్నారు. అసలు కమిషన్‌లో ఏం జరుగుతోందనే విషయం కానీ.. దాని పనితీరు ఏమిటనేది కానీ తెలియని పరిస్థితి నెలకొంది.

టీఎస్‌పీఎస్సీ వైఫల్యాలు..

  • 2011 సంవత్సరంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష ఫలితాలను ప్రకటించి..  పొరపాట్లు దొర్లడంతో ఫలితాలను వెనక్కి తీసుకుంది. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లకు సంబంధించిన సీజీజీ(సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా పోస్టుల ప్రాధాన్య క్రమం మారిపోయింది. ఫలితాలను ప్రకటించిన తర్వాత అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు రావడంతో టీఎస్‌పీఎస్సీ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. 

  • సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలు.

  • ఇరిగేషన్ సివిల్ ఇంజనీర్లు, కానిస్టేబుల్స్ ఎంపిక పరీక్ష, ఎస్‌ఐ పరీక్ష నిర్వహణలో కమిషన్ విఫలం.

  • గురుకులాల్లో టీచర్ పోస్టులకోసం విడుదలచేసిన 3 నోటిఫికేషన్లను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ఒకసారి ప్రశ్నాపత్రం తప్పు రావడంతో మళ్లీ పరీక్షను నిర్వహించింది. 

  • మూడున్నరేండ్ల తర్వాత విడుదలైన టీఆర్టీ నోటిఫికేషన్ సైతం వివాదంలో చిక్కుకుపోయింది. టీఎస్‌పీఎస్సీ వద్ద పది జిల్లాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉండగా.. ప్రభుత్వం 31 జిల్లాల వారీగా నోటి ఫికేషన్ వేస్తామని ప్రకటించడంతో సమస్య ఏర్పడింది. దీనిపైనా కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తదనంతరం పరీక్షను నిర్వహించినా.. నేటివరకు ఫలితాలను ప్రకటించలేదు. ప్రభుత్వం తిరిగి పాత పది జిల్లాల ప్రతిపాదికన నియమాకాలు చేపడతామని పేర్కొంది.

Tags
English Title
Kerapp TPSSPSC for controversies
Related News