కావ్య నాయిక ‘లకుమ’ 

Updated By ManamMon, 06/11/2018 - 03:33
editorial

imageడాక్టర్ సి. నారాయణరెడ్డి ‘లకుమ’ తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన విలక్షణమైన కావ్య నాయిక. ఇది చారిత్రాత్మకమైన పరిస్థితుల నేపథ్యంలో రాసిన కల్పనా గాథ. చారిత్రక కావ్యాలను గుర్తింపు, పరిమళం సినారె నుండి సంక్రమించినాయి. కవి పాత్రను సృష్టించి సన్నివేశాలని కల్పించి కల్పనల ద్వారా కథనం ద్వారా శక్తివంతం చేసారు. దానికి తోడు, ఉపమలు, ఉత్ప్రేక్షలు, వ్యంజనలు, ధ్వని ఈ కావ్యానికి సొగసులను ఇనుమడింపచేసాయి. ఈ చారిత్రక కావ్యానికి శృంగారం, కరుణ, వీర రసాలని రంగరించి రసిక హృదయాల ముందు వుంచారు. అదే ‘కర్పూర వసంతరాయలు’ అనబడే కావ్యం. అడుగడుగునా నూతన పదబంధాలు, గారవించే భావసుగంధాలు ఈ కావ్యనికున్న ఆభర ణాలు. కర్పూర వసంతరాయలు అనే బిరుదు కొండవీటి కుమారగిరిరెడ్డికి ఉండేది. ఇది తెలుగు చారిత్రాత్మక కావ్యాలకు ఆది బిందువు. కవితామృత రససింధువు. ఈ పరిమళం తెలుగు నాట పలువురిని ముగ్ధులను చేసింది. కల్పిత కథలు కూడ జాతి రత్నాలే అని నిరూపించాడు పింగళి సూరన. మరోసారి నారాయణరెడ్డి గారు ఋజువు చేసారు. ప్రతి పదం ఒక రసగుళిక, కర్పూర కళిక. కుమారగిరిరెడ్డి 1386 నుంచి 1402వరకు కొండవీడును పరిపాలించిన రెడ్డిరాజు. అతనికి వసంతరాయలు, కర్పూర వసంతరాయలు బిరుదులున్నాయి. అతని ఆస్థానంలో ‘లకుమ’ అనే రాజనర్తకి ఉండేదని, ఒక చాటువు ద్వారా తెలుస్తుంది. ఇతడు సంగీత నాట్య శాస్త్రాలలో దిట్ట. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇతడు ‘వసంత రాజీయం’ నాట్యశాస్త్రం రాసినట్లు కాటమ వేమారెడ్డి రాసిన శాకుంతల వ్యాఖ్య వల్ల తెలుస్తుంది. ఇతడు ఉదయనుడులాగ ధీరలలితుడు. ఇతడు కాలాన్ని కళలకోసం కర్పూరం వలె వెలిగించాడు. కాటమ వేమారెడ్డి ఇటు కత్తిని, అటు గంటమును సరి సమానముగా నడిపించాడు. 1939 ఏప్రిల్ నెల భారతిలో ‘లకుమాదేవి’ అనే శీర్షికలో శ్రీ భావరాజు వేంకట కృష్ణారావు రాసిన కథ ప్రచురింపబడినది. అదే కథను అనుసరించి 1945 అక్టోబరులో రజని, 1946 మార్చి ప్రతిభ సంచికలో ‘లకుమాదేవి’ అనే సంగీత రూపకాన్ని రచిం చారు. ఇది నాలుగు రంగాలుగా విభజింపబడిన శ్రవ్యరూపకం. ‘లకుమాదేవి కుమారగిరి’ చారిత్రాత్మక నవల 1979 ఏప్రిల్‌లో డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు రచించినారు. 

రజనిగారి కథలో పట్టపురాణి ప్రస్తావన లేదు. కర్పూర వసంతరాయలను గురించి, లకుమా దేవిని గురించి ముచ్చటైన వర్ణనలున్నాయి. అతడామె కొరకు ‘గృహరాజసౌధము’ అనే బ్రహ్మాం డమైన మేడ కట్టిస్తాడు. కాని కొన్నాళ్ళకు లోకుల గుసగుసలు విని లకుమ శీలాన్ని శంకించి పరీక్షకి రాజు ఆమెను ఆ మహాసౌధాగ్రము నుంచి క్రిందికి దూకమని ఆజ్ఞాపిస్తాడు. వసంతరాయని పాద పద్మములనే ధ్యానిస్తూ కిందికి దుమికిన లకుమ నేలరాలిన తలిరాకులా చెక్కుచెదరకుండా ఉండడం చూసి, ప్రజలు ఆమెను మహాసాధ్విగా అంగీకరిస్తారు. రాజుగారు ప్రేమతో ఆమెను కౌగి లించుకోబోతాడు కాని, తన సుశీలతనూ నిరూపించిన ఆ లకుమ ప్రియుడు చూపిన అవిశ్వాసంను సహింపదు. మొలలో దాచుకొనిన బాకుతో పొడుచుకుని అతని చేతులలోనే చనిపోతుంది. సి. నారాయణరెడ్డి కావ్యంలో పట్టపురాణి ఉంది. ఆ పాత్రను చక్కగా పోషించినారు. ఇది ప్రసిద్ధ కథాంశంలో కొత్త కల్పనలతో మేళవించి రచించిన రమణీయమైన కావ్యం. వీరి కథలో లకుమపై ప్రేమాతిశయము, రాణిపై గౌరవాతిశయం కనబడుతుంది. ఈ కథ ఆశ్వాసాల కావ్యం. కొండవీటి ప్రభువు కుమారగిరిరెడ్డి లకుమ నాట్యం చూసి మోహిం చడం, ఆమె చెంతకు చేరడం, తనను తాను కృష్ణునిగా, ఆమె బృందావనంలో రాధగా ఊహిం చడం, అనుకోకుండా అతని పెదవుల మీద ‘లకుమా’ అని అప్రయత్నంగా రావడం, ఆమె అందె లతో ‘ప్రభూ’ అని పలకడం, లకుమ అభిసారికలా అగుపించెను. పాలకడలిపై లక్ష్మిని చూసినటుల తాను విష్ణువుగా పోల్చుకున్నాడు. ఆ రాత్రి వసంతోత్సవ నృత్యము, వాద్యములు మ్రోగగా పాలరాతి వేదికపైన, నీలిమేఘము వలె, మెరుపులా మెరుస్తుంది. కొండవీటి ప్రభువైన వసంతరాయలు తమ పరస్పర ప్రేమ జీవితాన్ని ఆరని కర్పూర జ్యోతిగా వెలిగించారు. కాబట్టి కర్పూర వసంతరాయలు తనువు, ఆత్మ సర్వమూ ఆమెలో లీనమైపోయాయి. కాబట్టి పంచభూతాత్మకమైన నిఖిల సృష్టికి లకు మనే ప్రతీకగావించాడు. పృథ్వీ ఆమె కటిచక్రము జలమాయె కంటి పాపల లోతులు, తేజము ఆమె ముఖారాజీవయి వాయుగతి ఆమె నిశ్వాస ములు. ఆకాశము మధ్యము, అతని దృష్టి ఆమె ముఖము కురమ్ములో తన మోము సరిచూచుకునేవాడట. ఆమె కనుపాపలలో కురులు దిద్దుకొనేవాడట.  నేను పునర్జన్మమెత్తి / తేని ప్రభూ! రసికతామ హాలయమౌ మీ యువ హృద/ యముగా జన్మింతుగాత! సౌందర్యాన్వేషకులకు రమణీయమైన వాతావరణాన్ని సృష్టించి, తనదంటూ ఒకానొక మార్గంలో, పరిమళ భరితమైన పువ్వుల వాటికలో మృదుమధురమైన సంభాషణ చాతుర్యంతో వసం తరాయ స్వప్న సీమకు తీసుకెళ్లి, కల్పనలతో, విచిత్రమైన చిత్రాలు, అందచందాలను, పదములు శబ్దాల మాధుర్యాన్ని రచించి మన అందరిని, సాహిత్య సంగీతానికి లయ, గతి, సంగతిలకు, మిశ్ర, చతురస్రలలో కావ్యాన్ని నడిపించినారు నారాయణరెడ్డిగారు.
 కె. ప్రభాకర్    
సంస్కృత విశ్రాంత ఆచార్యులు 
(జూన్ 12న సి.నా.రె వర్ధంతి) 

Tags
English Title
Kavya Nayika 'Lakshma'
Related News