మారువేషంలో నక్కిన ఉగ్రవాది.. హైఅలర్ట్!

Kashmiri terrorist Zakir Moosa hiding in Punjab, 'disguised as a Sikh'; high alert sounded

చండిగఢ్: పంజాబ్‌లోని ఫిరోజపూర్, బటిండా జిల్లాల్లో గురువారం భద్రతా దళాలు హైఅలర్ట్ ప్రకటించాయి. కశ్మీరీ ఉగ్రవాది జకీర్ మూసా ఆయా ప్రాంతాల్లో దాక్కున్నాడనే నిఘా వర్గాల సమాచారం మేరకు హై అలర్ట్ ప్రకటించారు. సిక్కు వేషధారణ టర్బన్ ధరించి మారువేషంలో పంజాబ్‌లోని ఫిరోజ‌పూర్ జిల్లాల్లో ఉన్నాడని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అన్సర్ ఘజ్వాత్ ఉల్ హింద్ చీఫ్‌‌ జకీర్‌ను పట్టుకునేందుకు భద్రతా దళాలు రెండు జిల్లాల్లోని ముఖ్యమైన ప్రాంతాలను చుట్టుముట్టాయి. ఆర్మీ దళాలు, పంజాబ్ పోలీసులు, పారామిలటరీ దళాలు బటిండా రైల్వే స్టేషన్ వంటి పలు ప్రదేశాల్లో మోహరించి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాది మూసా మారువేషంలో ఉన్న ఫొటోలను పబ్లిక్ ప్రాంతాల్లో పోస్టర్లుగా అంటించి ప్రజలను ఎప్పటికప్పుడూ భద్రతా దళాలు అప్రమత్తం చేస్తున్నాయి.

పంజాబ్‌లో మూసా దాగి ఉన్నాడనే నిఘా వర్గాల సమాచారం మేరకు గత నవంబర్‌లో అమ్రత్‌సర్, గురదాస్‌పూర్ జిల్లాల్లో అతడి ఫొటోలను పోస్టర్లుగా అంటించారు. కశ్మీర్ లోయలో ఆల్‌ఖైదా గ్రూపుకు చెందిన ఉగ్రవాద సంస్థ అన్సర్ ఘజ్వాత్ ఉల్ హింద్ (ఏజీహెచ్)కు మూసా నేతృత్వం వహిస్తున్నాడు. పంజాబ్‌లోని మొహాలి జిల్లాకు చెందిన మూసా 2010 నుంచి 2013 వరకు విద్యార్థిగా కొనసాగాడు. అనంతరం ఉగ్రవాద సంస్థలో చేరిపోయాడు. 2016 జూలైలో కశ్మీర్‌లో జరిగిన భద్రతా దళాల ఎన్‌కౌంటర్ ఆపరేషన్‌లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ బుర్హాన్ వానీ హతమైన తరువాత అతని స్థానంలో మూసా వచ్చాడు.    

సంబంధిత వార్తలు