కళా దీప్తులకు.. కందుకూరి పురస్కారాలు

Updated By ManamThu, 05/17/2018 - 23:44
image

రంగస్థలం పై రాజులు వీళ్లే, దేవుళ్లు వీళ్లే, రాజ్యాలు వీరివే, దేవలోకాలు వీరివే. పాత్ర ఏదైన సరే ప్రేక్షకులను ఆధ్యాంతం 
ఆకట్టుకుంటూ, తమ నటనతో వీక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తూ, తమ హావభావాలతో సభా ప్రాంగణాన్ని చప్పట్లతో హోరెత్తిస్తారు. 
అభిరుచితో నాటకాలు వేసేవారుంటారు, కానీ నాటకాన్నే సర్వస్వంగా భావించి రంగస్థలాన్ని జీవనాధారంగా మలుచుకొని కళా వ్యవసాయం చేసేవారు మాత్రం కొందరే. వీరు ఎన్నో సాంఘిక, పౌరాణిక పాత్రలు, రకరకాల రంగస్థల ప్రదర్శనలతో నాటక కళకు జీవం పోశారు. నాటక రంగంలో తమైదెన ముద్ర వేసి ఎలాంటి పాత్రైనెన అవలీలగా పోషిస్తూ, ప్రేక్షకుల మన్ననలు పొంది ప్రతిష్టాత్మక  2018 కందుకూరి పురస్కారానికి ఎంపికైన వారిని మనం మిసిమి కలుసుకుంది .....

అల్లం చంద్రరావు 
imageప్ర. కందుకూరి పురస్కారం అందుకుంటున్నారు కదా, ఎలా ఫీలవుతున్నారు?
జ. చాలా సంతోషంగా ఉంది. కందుకూరి లాంటి ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక అవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. చిన్ననాటి మిత్రులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలుపుతుంటే ఆనందంగా ఉంది. 
ప్ర. నాటక రంగంవైపు ఆసక్తి చూపడానికి కారణం ఏమిటి?
జ. మా తాతగారి కాలం నుంచి మా కుటుంబం ఈ రంగంలోనే ఉంది. కాబట్టి వాళ్లని చూసి నాకు నాటకరంగం వైపు రావాలనే ఆసక్తి కలిగింది. 6 యేళ్ల వయసున్నప్పుడు మొదటిసారి హరిశ్చంద్ర నాటకంలో ‘లోహితాసుడు’ పాత్ర వేశాను. నా నటనను అందరూ చాలా మెచ్చుకున్నారు. అప్పటి నుంచి నేను వెన ుదిరిగి చూడలేదు.  నా మొదటి నాటకమే నా భవిష్యత్తుని నిర్ణయించింది.
ప్ర. ఇప్పటివరకు ఎన్ని నాటకాలు వేసి ఉంటారు. అందులో గుర్తింపు తెచ్చిన పాత్రలు ఏవి?
జ. ఇప్పటి వరకు దాదాపుగా 12 వేలకు పైగా నాటకాలు వేశాను. అప్పట్లో సంవత్సరానికి 200లకు పై చీలుకు నాటకాలు వేసేవాడిని. ‘బొబ్బిలి యుద్ధం’ నాటకంలో వేసిన చిన్న వెంకట్రావు పాత్ర,‘హరిశ్చంద్ర’ నాటకం నాకు బాగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. 
ప్ర. మొదట్లో ఒక్కో నాటకానికి ఎంత పారితోషికం ఇచ్చేవారు?
జ. ఆ రోజుల్లో ఇప్పట్లోలాగా వేలకు వేలు పారతోషికాలు లేవు. రూపాయి, అర్ధ రూపాయే వేల రూపాయలతో సమానం.  మా పక్క ఊరిలో వినాయక చవితికి మూడు రోజుల నాటకానికి గాను 50 పైసలిచ్చేవారు. అంటే ఇప్పటి కాలంలో అర్ధ రూపాయి అన్నమాటా. 
ప్ర. దాదాపు 12వేలకు పైగా పాత్రలు వేశారు కదా! అందులో ఎలాంటి పాత్రలు పోషించారు?
జ. ఎక్కువగా కవెుడియన్, ఆడ పాత్రలు వేసేవాడిని. ప్రేక్షకులు కూడా నన్ను ఈ పాత్రల్లోనే చూడడానికి ఇష్టపడేవారు. వీక్షకుల ఇష్టానికి అనుగుణంగా             నేను కూడా అలాంటి పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి పోషించేవాడిని.
ప్ర. ఆడ పాత్రలు వేసినవి కొన్ని చెబుతారా? 
జ.  మాతంగా, గోపివస్త్రీ, రేవతి, తార, దక్షయజ్ఞంలో సతీదేవి, సీతారామయణంలో సీతా, సతీఅనసూయలో సరస్వతి, వంటి స్త్రీ పాత్రలు పోషించాను.
ప్ర. ఇన్నీ వేల నాటకాలు వేశారు కదా! ఈ ఒక్క పాత్ర వేస్తే బాగుండే అని అనుకున్న సందర్భం ఉందా?
జ. నా జీవిత చరమాంకంలో అన్ని రకాల పాత్రలు పోషించాను. అలాంటి మిగిలి పోయినది ఏమి లేదు. దేవుని దయ వలన సాధ్యైవెునంత వరకు, నా శక్తి మేర అన్ని పాత్రలు పోషించాను. ఏ పాత్రైనా ఉన్నన్నాళ్లు వేస్తూనే ఉండాలి అనిపిస్తుంటుంది.

ఆలపాటి లక్ష్మి
imageప్ర. కందుకూరి వీరేశలింగం రాష్ట్ర స్థాయి పురస్కారం వచ్చింది కదా! ఏ విధంగా ఫీల్ అవుతున్నారు?
జ. నా జీవితంలో ఈ పురస్కారం మరిచిపోని జ్ఞాపకంగా నిలిచిపోతుందని భావిస్తున్నాను. కళారంగానికి గత 50 సంవత్సరాలుగా చేస్తున్న సేవను గుర్తించి ఈ  విశిష్టైమెన పురస్కారానికి నన్ను ఎంపిక చేయడం నమ్మశక్యంగా లేదు.  కుటుంబ సభ్యులు, నా సుపరిచిస్తులు, అపరిచితులు అందరూ  శుభాకాంక్షలుత  చెబుతుంటే  నిజమేనని చాలా ఆనందంగా ఉంది.
ప్ర. నాటక రంగంలోకి ఎలా వచ్చారు?
జ. నేను చిన్నతనంలోనే కూచిపూడి నేర్చుకున్నాను. ఆ కాలంలోనే మా నాన్నగారు  పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో స్టేజి ఆర్టిస్టు, పౌరాణిక, సాంఘిక నాటకాలు వేసేవారు. అలా నాకు ఆ రంగంలోకి వెళ్లడానికి ఆసక్తి కలిగింది. కూచిపూడి నేర్చుకుంటున్న సమయంలోనే మా నాన్నగారు  వేసిన నాటకంలో ఒక ఆర్టిస్టు రాకపోతే నేను ఆ క్యారెక్టర్ చేశాను. అప్పుడే మొదటిసారి స్టేజేక్కాను. చింతామణి నాటకంలో చిత్ర పాత్ర వేశాను. అప్పుడు నా వయసు 10 సంవత్సరాలు.
ప్ర. నాటక రంగంలో పూర్తి స్థాయిలో నిలదొక్కుకోవడానికి అవకాశాలు ఎలా వచ్చాయి?  ఏ ఏ పాత్రలు వేశారు?
జ. యుక్త వయస్సులో మా నాన్నగారి స్నేహితుల ద్వారా చాలా అవకాశాలు వచ్చేవి. అలా కాబులీ నాటకంలో పెళ్లికూతురు వేషానికి నన్ను తీసుకెళ్లారు. మరొక రోజు నాన్న స్నేహితుల్లో ఒకరు వారి ‘విధివ్రాత’ అనే నాటకంలో హీరోయిన్ ఏదో పని మీద అర్జెంటుగా వెళ్లిపోయింది. రెండురోజుల్లోనే నాటకం ఉంది ఎలాగా అని నాన్న గారితో ఇంటి దగ్గర మాట్లాడుతుంటే నేను విని, ఆ పాత్ర చేస్తా అన్నాను. నీకు తెలియదు కదా! ఎలా వేస్తావు అన్నారు. నేను కచ్చితంగా వెయగలను అనే సరికి.. అంతే ఆ పుస్తకం చేతికిచ్చి బస్సు ఎక్కించారు. బస్సు దిగేలోపు ఆ పుస్తకాన్ని క్షుణ్నంగా చదివి నాటకం వేశాను. అప్పట్లో జ్ఞాపకశక్తి బాగుండేది.
ప్ర. సినిమా రంగం వైపు రావడానికి అవకాశాలొచ్చినా కాదన్నారట? కారణం?
జ. నాకు మొదటినుంచి సినిమా రంగం వైపు రావాలంటే కాస్త భయమే. నాటకాలంటేనే చాలా ఇష్టం ఉండేది. ఎందుకంటే ఆ కాలంలో సినిమా రంగం వారంతా మద్రాసులో ఉండేవారు. తెలియని భాష అక్కడికెళ్లి నటించాలంటే భయంగా ఉండేది. అదే నాటకాల్లో అయితే చుట్టూ ఉన్న మనుషులు తెలిసిన వారే కాబట్టి ఏమి భయం ఉండేది కాదు. జంధ్యాల గారు నేను కలిసి విజయవాడ ఆలిండియా రేడియోలో హీరో, హీరోయిన్‌గా ఓ నాటకాన్ని చేశాం. జంధ్యాల గారు సినిమా రంగంలోకి వెళ్లాక నన్ను కూడా సినిమాల్లోకి రమ్మని చాలా సార్లు అడిగారు. నాకు ఆసక్తి లేదు. రామానాయుడు గారు నిర్మిద్దామనుకున్న కళ్లు సినిమాలో చాన్స్ వచ్చింది. గొల్లపూడి మారుతిరావు గారు కళ్లు  నాటిక రచయిత. ఆయనకు తన కథకు సరిపోయే పాత్రను, పలాన ఏరియాలో ఆలపాటి లక్ష్మి గారున్నారు ఆమెను పెట్టుకుంటే పాత్రకి న్యాయం చేస్తారు అని చెప్పారంట. అలా నాకు రామనాయుడి స్టూడియో నుంచి ఉత్తరం వచ్చింది. మా కళ్లు  సినిమాలో నటించండి అని కాని నేను దాన్ని కూడా సున్నితంగా తిరస్కరించాను.
ప్ర. మరీ ఇంతలా నాటకాల మీద ఇష్టం ఉన్నవాళ్లు సినిమా రంగం ైవె పు రావడానికి కారణం ఏమిటి? నాటకాల్లో ఆదరణ తగ్గిందనా? 
జ. సినిమా రంగం మీద ఇంట్రస్ట్ ఉంది. కాని భయం ఉండేది. ఇంకొక వైపు సినిమాల్లో కనిపించాలని మనల్ని మనం చూసుకోవాలనే ఉత్సాహం ఉండేది. అంతే తప్ప ఆదరణ తగ్గిందని కాదు. అయినా 1970-80ల్లో నాటకాలకి ఏ మాత్రం జనాధారణ తగ్గలేదు. ఇప్పటికి చూసేవారు ఏలా ఉన్నా, నాటకానికి న్యాయం చేయాలనుకునే వారు పుట్టుకొస్తూనే ఉన్నారు.

సుంకర రాజశేఖర ప్రసాద్ 
imageప్ర. మీరు నాటకాలు ఎన్ని సంవత్సారాల నుంచి వేస్తున్నారు?
జ. నా 13 ఏళ్ల వయస్సులోనే నాటక రంగం వైపు తొలి అడుగు వేశాను. 1969లో స్కూల్లో చదివే రోజుల్లో నాకు నాటకం అంటే ఏంటో తెలియని వయస్సులో   పాఠశాలలోని సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. 
ప్ర. కందుకూరి వీరేశలింగం రాష్ట్ర స్థాయి పురస్కారం వచ్చింది కదా! ఏ విధంగా ఫీల్ అవుతున్నారు?
జ. నేను అవార్డులు, రికార్డుల కోసం ఎప్పుడూ నాటకాలు వేయలేదు. కానీ కందుకూరి రాష్ట్ర స్థాయి పురస్కారం నా ఇన్నేళ్ల కృషికి దక్కిన ఫలితంగా భావిస్తున్నాను. బంధువులు, స్నేహితులు శుభాకాంక్షలు చెబుతుంటే నా కుటుంబ సభ్యుల కళ్లల్లో ఎనలేని సంతోషం కనిపిస్తుంది. ఒక నటుడిగా ఇంతకంటె ఆనందకరం ఇంకేముంటుంది. ఆ  ఆనందానికి అవధుల్లేవు. 
ప్ర. మీరు మొట్టమొదట వేసిన పాత్ర ఏమిటి?
జ. శ్రీ కృష్ణ రాయబారం అను పౌరణిక నాటికలో దుర్యోధనుని పాత్ర నా జీవితంలో మొదటిది. ఈ పాత్రకుగాను నాగరత్నమ్మ అనే ఉపాధ్యాయురాలు నాకు తులం వెండి పతకం బహువుతిగా ఇచ్చింది. ఇది నా జీవితంలో ఊహించని పరిణామంగా భావించవచ్చు. అప్పటినుంచి నాటకంపై మక్కువ పెంచుకుని వెనుతిరిగి చూడలేదు. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ వార్షికోత్సవాలు జరిగినప్పుడల్లా పలు నాటకాలు వేసేవాడిని.
ప్ర. మీ గురువుల గురించి చెప్పండి?
జ. నేను చిన్నతనంలో నాటకాలు వేసేటప్పుడు ప్రాథమిక దశలో నుదుటికి బొట్టు పెట్టి నాటక రంగంలోకి దించిన మహానుభావులు ఆదవేని ఈశ్వరయ్య, ఐ. నాగసుబ్బారెడ్డి. ఆ తరువాత ఆర్టీసిలో పనిచేస్తున్నప్పుడు నన్ను ఒక దారిలోకి తీసుకొచ్చిన వాళ్లు ఎస్.ఎస్ ఆలీ, గట్టి సుబ్బారావు. ప్రముఖ రచయిత ఆంధ్రబ్యాంకులో పనిచేసే భాస్కర చంద్ర గారు నా నాటకరంగ చరిత్రను మలుపు తిప్పిన గురువు. వీరే కాకుండా నంద్యాల కళారాధన సంస్కృతిక సంస్థ అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్ రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్  జి. రవిక్రిష్ణ సాంస్కృతిక  రంగానికి చేయూతనందిస్తూ 20 సంవత్సరాలుగా నా వెంట గురువులా ఉంటూ ప్రోత్సహించి నన్ను ఈ స్థాయికి తీసుకోచ్చారు.
ప్ర. ఎలాంటి అవార్డులు మిమల్ని వరించాయి?
జ. నాకు ఇప్పటి వరకు 250 పైగా బహువుతులు వచ్చాయి.  నా గురువు ఏ. భాస్కర చంద్ర గారు రాసిచ్చిన ‘కొయ్యగుర్రం’ నాటకంలో ‘పీతాంబరం’ వేశానికి ‘నంది’ అవార్డు వచ్చింది. అంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటి సారిగా నాటకాలకు కూడా నంది అవార్డులను ఇవ్వాలని నిర్ణయించి 1997,98,99 మూడు సంవత్సరాలకు గాను 2000 సంవత్సరం హైదరాబాద్ రవీంద్రభారతీలో రమణాచారి నిర్వాహణలో మురళిమోహన్ అధ్యక్షతన నంది నాటక నవ దినోత్సవం పేరిట మొట్టమొదటి పోటీలు నిర్వహించడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకోవడం చాలా ఆనందంగా ఉంది.
- ప్రదీప్ ముదిరాజ్

కందుకూరి పురస్కారం-2018
రంగస్థలంలో కొన్నేళ్ళుగా మంచి ప్రతిభ కనబరుస్తూ, నాటకరంగ అభివృద్ధికి కృషిచేసిన వారిని గుర్తిస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయా నాటకరంగ కళాకారులకు కందుకూరి వీరేశలింగం పేరు మీదుగా విశిష్ట పురస్కారం అందజేస్తుంది. 2018 సంవత్సరానికి గానూ రాష్ట్రస్థాయిలో ముగ్గురిని, జిల్లాస్థాయిలో ఐదుగురు కళాకారుల చొప్పున 13 జిల్లాల నుండి 65 మందిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్రస్థాయి పురస్కారానికిగానూ ఎంపిక అయిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి, ప్రశంసాపత్రం, జిల్లాస్థాయి పురస్కారానికి ఎంపిక అయిన వారికి 10 వేల రూపాయల నగదు బహుమతి, ప్రశంసాపత్రము అందజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ అంబికా కృష్ట, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణులు తెలుగు నాటకరంగ దినోత్సవం ఏప్రిల్ 16న విజయవాడలో పురస్కార గ్రహీతల జాబితాను విడుదల చేశారు.            
                                      
రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్నవారిలో.....
1. అల్లం చంద్రరావు, పశ్చిమ గోదావరి జిల్లా
2. ఎస్.ఆర్.ఎస్ ప్రసాద్, నంద్యాల
3. ఆలపాటి లక్ష్మి, విశాఖపట్నం 
    

English Title
Kandukuri Awards for Art Deepti
Related News