జేపీ గ్రూప్ గృహ కొనుగోలుదార్లలో చీలిక

Updated By ManamTue, 05/15/2018 - 22:47
 JP Group

imageన్యూఢిల్లీ: దివాలా తీసిన రియల్టీ సంస్థ జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను ఒకప్పటి దాని ప్రమోటర్లు స్వాధీనపరచుకునేందుకు చేస్తున్న ప్రయత్నంపై ఆ సంస్థకు చెందిన గృహ కొనుగోలుదార్ల మధ్య స్పష్టమైన చీలిక ఏర్పడింది. మనోజ్ గౌర్ నేతృత్వంలోని ప్రమోటర్ గ్రూప్ కంపెనీని స్వాధీనం చేసుకుని, అసంపూర్ణంగా వదిలేసిన గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని గృహ కొనుగోలుదార్లకు చెందిన రెండు సంఘాలు కోరుకుంటున్నాయి. మరో తొమ్మిది సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి దానిని వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఈ రెండు కూటములు మాత్రం జేపీ ఇన్‌ఫ్రాటెక్ ఆస్తులు అమ్మడాన్ని మాత్రం కోరుకోవడం లేదు.రూ. 7,350 కోట్లతో లక్షద్వీప్ సమర్పించిన బిడ్‌ను  జేపీఇన్‌ఫ్రాటెక్ రుణ దాతలు ఇటీవల తిరస్కరించారు.  సుధీర్ వాలియా నేతృత్వంలోని సురక్ష అసెట్ రీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ, ముంబయి కేంద్రంగా పని చేస్తున్న దోస్తీ రియల్టీ సంయుక్త రంగంలో లక్షద్వీప్‌ను నెలకొల్పాయి. జేపీ ఇన్‌ఫ్రాటెక్ స్వాధీనానికి, దాని గృహ నిర్మాణ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు లక్షద్వీప్ అంత మొత్తాన్ని పెట్టదలచుకుంది. జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను పునరుద్ధరించేందుకు జేపీ ప్రమోటర్ ఒకరు  రూ. 10,000 కోట్లతో బిడ్‌ను సమర్పించారు. జయప్రకాష్ అసోషియేట్స్ లిమిటెడ్ (జేఏఎల్) ఇంతకు ముందు చెప్పినట్లు తన కర్తవ్యాన్ని నెరవేరుస్తానంటే దానికి ‘‘మరో అవకాశం‘‘ ఇవ్వాలని  రెండు  (డెవలపర్స్ టౌన్‌షిప్ ప్రాపర్టీ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ, అమన్ వెల్ఫేర్ అసోసియేుషన్) సంఘాలు భావిస్తున్నాయి. సురక్ష సంస్థ సమర్పించిన బిడ్ ఆనుపానులను పరిశీలించిన తర్వాత కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ (సీఓసీ) దాన్ని తిరస్కరించింది. జేఏఎల్ బిడ్‌ను వేసేందుకు సుప్రీం కోర్టు అనుమతి నిచ్చింది. సురక్ష పేర్కొన్న మొత్తం కన్నా అది ఇవ్వజూపిన మొత్తం చాలా ఎక్కువగా ఉంది.  ‘‘ఒక వేళ జేపీ గ్రూపు గతంలో ఇచ్చిన మాటలన్నింటినీ నిలబెట్టుకునేందుకు సుముఖంగా ఉన్న పక్షంలో దానికి మరో అవకాశం ఇవ్వడంలో తప్పేముంది?’’  అని డెవలపర్స్ టౌన్‌షిప్ ప్రాపర్టీ ఓనర్స్ వెల్ఫేర్ సోసైటీ అధ్యక్షుడు అరవింద్ జైన్ అన్నారు. అయితే,  మొత్తం 2,400 మంది గృహ కొనుగోలుదార్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెబుతున్న మిగతా తొమ్మిది సంఘాలు ప్రతినిధులు మాత్రం  జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను హస్తగతం చేసుకునేందుకు జేపీ ప్రమోటర్‌ను అనుమతించకూడదని వాదిస్తున్నాయి.  ఎవరైనా విశ్వసనీయ బిడ్డర్‌కు ఈ భాద్యతలను అప్పగించి. నోయిడాలో మిగిలిపోయిన ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. ‘‘జేపీ గ్రూపు పట్ల మాకు నమ్మకం లేదు. మా ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు దానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు’’ అని  తొమ్మిది సంఘాలకు పాతినిధ్యం వహిస్తున్న ఆదిత్య గట్‌గుటియా అన్నారు.  ‘‘జేపీ ఇన్‌ఫ్రాటెక్ అస్తుల అమ్మకాన్ని మేం కోరుకోవడం లేదు. విశ్వసనీయత ఉన్న బిడ్డర్ ఎవరైనా ఆ కంపెనీని స్వాధీనం చేసుకుని, పెండింగ్‌లో ఉన్న ఫ్లాట్ల నిర్మాణాలు అన్నింటినీ పూర్తి చేయాలి’’ అని ఆదిత్య అన్నారు. జేపీ గ్రూపు గృహ నిర్మాణానికి తీసుకున్న డబ్బును అక్రమంగా ఇతర వ్యాపారాకు తరలించి, నిర్మాణాలలో జాప్యం చేసిందనే ఆరోపణలున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఐడీబీఐ అభ్యర్థనను స్వీకరించి, తాత్కాలిక పరిష్కార వృత్తినిపుణుడు  (ఐఆర్‌పీ) అనూజ్ జైన్‌కు  కంపెనీ నిర్వహణ బాధ్యతలను జాతీయ కంపెనీలా ట్రైబ్యునల్ అప్పగించింది. 

Tags
English Title
JP Group split home buyers
Related News