జగన్ ఎఫెక్ట్.. నిర్ణయం మార్చుకున్న పవన్!

Updated By ManamThu, 07/12/2018 - 11:29
Janasena Chief Pawan Tour Cancelled With The Effect Of YSRCP Chief Jagan Padayatra

Janasena Chief Pawan Tour Cancelled With The Effect Of YSRCP Chief Jagan Padayatra

తూర్పుగోదావరి: వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తలపెట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ.. ప్రభుత్వం లోటుపాటులను ఎత్తిచూపుతూ జగన్ పాదయాత్ర సాగిస్తున్నారు. మరోవైపు ‘జనసేన పోరాట యాత్ర’ పేరిట ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా యాత్ర సాగిస్తున్నారు. ఇద్దరు కోస్తా ఆంధ్రాలోనే యాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో పర్యటన ముగించుకున్న పవన్ కల్యాణ్... ఇక మిగిలున్న, తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర సాగిస్తుండటంతో పవన్‌కు పోలీసులు పలు సూచనలు చేశారు. ఓ వైపు జగన్.. మరోవైపు పవన్ యాత్ర చేస్తే ఇద్దరికీ ఒకేసారి భద్రత కల్పించడం సాధ్యం కాని పని తేల్చిచెప్పారని తెలుస్తోంది. అంతేకాదు వీలైనంత వరకు కొద్దిరోజుల పాటు మీ యాత్రను ఉభయ గోదావరి జిల్లాల్లో వాయిదా వేసుకుంటే మంచిదని పోలీసులు.. పవన్‌కు సూచించారని సమాచారం. దీంతో నిర్ణయం మార్చుకున్న పవన్ కల్యాణ్ ‘జనసేన పోరాట యాత్ర’ను వాయిదా వేసుకున్నారు.

ఈ నెల 16వ తేదీ నుంచి ఆయన యాత్ర ప్రారంభమవుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాల్లో సాగుతుండటంతో పవన్ కల్యాణ్.. తూర్పుగోదావరి జిల్లా నుంచి తన పోరాట యాత్రను ప్రారంభించే అవకాశముందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కాగా ఈ విషయంపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా ఇప్పటి వరకూ పవన్ పర్యటించిన నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నేతలు జనసేన కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీని బలోపేతం చేసుకునేందుకు పవన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. యాత్రలో భాగంగానే ఎవరెవరికి అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్లు ఇవ్వాలని పవన్ వ్యూహ రచనలు కూడా చేస్తున్నారని తెలుస్తోంది.

English Title
Janasena Chief Pawan Tour Cancelled With The Effect Of YSRCP Chief Jagan Padayatra




Related News