రేవంత్ రెడ్డి ఇంట కొనసాగుతున్న సోదాలు

Updated By ManamFri, 09/28/2018 - 09:31
Revanth Reddy

Revanth Reddyహైదరాబాద్: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లల్లో ఐటీ, ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం మొదలైన ఈ సోదాలు 24గంటలు గడిచినా ఇంకా ముగియలేదు. మరోవైపు గురువారం రాత్రి రేవంత్‌ ఇంటికి చేరుకోగా.. అప్పటి నుంచి దాదాపు 10గంటల పాటు ఆయనను విచారించిన అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రేవంత్‌పై మూడు అభియోగాలపై ఐటీ అధికారులు కూపీ లాగుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు, మనీ ల్యాండరింగ్, పన్ను ఎగ్గొట్టారని అధికారులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే ప్రధానంగా విచారణ, సోదాలను జరుపుతున్నారు.

కాగా శ్రీ సాయి మౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక్కో షేర్‌కు 2లక్షల చొప్పున 66లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు రేవంత్ రెడ్డి. ఎనిమిది మంది కుటుంబసభ్యుల భాగస్వామ్యంతో 2003లో ఈ కంపెనీని ఏర్పాటుచేశారు. శ్రీసాయి మౌర్య కంపెనీ చివరిసారిగా 2010లో వార్షిక ఆదాయ నివేదికను చూపించింది. ఆ తరువాత మళ్లీ ఐటీకి లెక్కలు సమర్పించలేదు. అలాగే 200 నుంచి 300కోట్ల రూపాయలు 18 షెల్ కంపెనీలకు తరలించినట్లు రేవంత్ రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. వీటినుంచి వచ్చే ఆదాయం మొత్తం రేవంత్ రెడ్డినే తీసుకుంటున్నట్లు అధికారులు నిర్దారణకు వచ్చారు. ఆ ఆదాయానికి సంబంధించిన లెక్కలపై కూపీ లాగుతున్నారు. వీటితో పాటు విదేశాల నుంచి రేవంత్ రెడ్డి అకౌంట్‌లోకి భారీగా నగదు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆ డబ్బు ఎవరి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, వచ్చిన డబ్బు ఎక్కడకు వెళ్లింది అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. రేవంత్ వియ్యంకుడు వెంకట్ రెడ్డి వెక్సా సీడ్స్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించారు. కొద్ది రోజుల తరువాత ఆ కంపెనీని 14కోట్ల రూపాయలకు అమ్మేశారు. ఆ తరువాత అదే కంపెనీని 80కోట్లకు కొన్నారు. ఇందుకోసం జాతీయ బ్యాంకుల నుంచి 75కోట్ల రుణం తీసుకున్నారు. దీనికి సంబంధించిన లెక్కలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి, ఎమ్మెల్సీ సెబాస్టియన్, సన్నిహితుడు ఉదయ్ సింహా ఇళ్లలో దాడులు ముగిశాయి. అక్టోబర్ 1న సెబాస్టియన్ మరోసారి విచారణకు రావాల్సిందిగా ఐటీ అధికారులు నోటీసులు పంపారు.

English Title
IT Raids continuing at Revanth Reddy's home
Related News