ప్రముఖ క్రికెటర్ లక్ష్మణ్ వాడేకర్ కన్నుమూత

Updated By ManamThu, 08/16/2018 - 08:56
Wadekar

Wadekarన్యూఢిల్లీ: భారత ప్రముఖ క్రికెటర్, టెస్ట్ క్రికెట్ మాజీ కెప్టెన్, కోచ్, సెలక్షన్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అజిత్‌ లక్ష్మణ్‌ వాడేకర్‌ (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 

కాగా 1941 ఏప్రిల్‌ 1న నాటి బొంబాయిలో జన్మించిన వాడేకర్.. 1958లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. ఆ తరువాత 1966లో జాతీయ జట్టుకు ఎంపికైన వాడేకర్, సొంతగడ్డపై వెస్టిండీస్‌తో తొలి టెస్టు ఆడారు. 8 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 37 టెస్టులాడి 2,113 పరుగులు, రెండు వన్డేలు ఆడి 73 పరుగులు చేశారు. అలాగే ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 237 మ్యాచ్‌ల్లో 47.03 సగటుతో 15,380 పరుగులు చేసిన వాడేకర్‌కు దూకుడైన ఆటగాడిగా పేరుంది. అనంతరం ఆయన 1974లో రిటైరయ్యారు. 

ఇక ఎడమ చేతి ఆటగాడైన వాడేకర్.. గావస్కర్, విశ్వనాథ్‌ వంటి గొప్ప బ్యాట్స్‌మెన్, బేడి, ప్రసన్న, వెంకట్రాఘన్, చంద్రశేఖర్‌ వంటి దిగ్గజ స్పిన్నర్లున్న జట్టుకు సారథ్యం వహించారు. భారత్‌ ఆయన కెప్టెన్సీలోనే 1971లో వెస్టిండీస్, ఇంగ్లండ్‌లలో తొలిసారిగా టెస్టు సిరీస్‌లను గెలిచింది. 1972–73లో స్వదేశంలో ఇంగ్లండ్‌ను మరోసారి ఓడించింది. వరుసగా మూడు సిరీస్‌లు నెగ్గడంతో సారథిగా వాడేకర్‌ పేరు మార్మోగిపోయింది. అయితే, 1974లో ఇంగ్లండ్‌లో పర్యటించిన జట్టుకూ కెప్టెన్సీ వహించిన ఆయన ఆ సిరీస్‌లో జట్టు మూడు టెస్టుల్లోనూ ఓటమిని ఎదుర్కోవడంతో రిటైర్మెంట్‌ ప్రకటించారు. అనంతరం 1990ల్లో అజహరుద్దీన్‌ సారథ్యంలోని భారత జట్టుకు మేనేజర్‌ కమ్‌ కోచ్‌గా వ్యవహరించారు. 1998–99 మధ్యకాలంలో సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. లాలా అమర్‌నాథ్, చందూ బోర్డె తర్వాత ఆటగాడిగా, సారథిగా, కోచ్‌గా, సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా చేసిన మూడో వ్యక్తిగా రికార్డుల కెక్కారు. 1967లో అర్జున అవార్డు, 1972లో పద్మశ్రీ పుర స్కారం పొందారు. భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గాను సీకే నాయుడు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును అందుకున్నారు. వాడేకర్‌ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పలువురు క్రికెటర్లు సంతాపం తెలిపారు.  

English Title
Indian Former Cricketer Ajit Laxman Wadekar passed away




Related News