పెరిగిన టోకు ద్రవ్యోల్బణం

Updated By ManamMon, 05/14/2018 - 22:38
wpi-jumped

wpi-jumpedన్యూఢిల్లీ: అధిక ఇంధన, ఆహార ఉత్పత్తుల ధరల కారణంగా టోకు ద్రవ్యోల్బణం మార్చిలో ఉన్న 2.47 శాతం నుంచి ఏప్రిల్‌లో 3.18 శాతానికి పెరిగిందని ప్రభుత్వ డాటా సోమవారం వెల్లడించింది. ఆహార వస్తువుల టోకు ధరలు 2017 ఏప్రిల్‌కన్నా 2018 ఏప్రిల్‌లో 0.67 శాతం పెరిగాయి. అదే, 2018 మార్చిలో 0.07 శాతం తగ్గాయి. డబ్ల్యు.పి.ఐ ఆధారిత  ద్రవ్యోల్బణం గత ఏడాది మార్చిలో 2.47 శాతంగా, ఏప్రిల్‌లో 3.85 శాతంగా ఉంది. మార్చిలోని 0.29 శాతం ప్రతి ద్రవ్యోల్బణంతో పోలిస్తే, 2018 ఏప్రిల్‌లో ఆహార వస్తువుల్లో ద్రవ్యోల్బణం 0.87 శాతంగా ఉందని ప్రభుత్వ డాటా వెల్లడించింది. కూరగాయల్లో ప్రతి ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 0.89 శాతం కాగా, అంతకుముందు నెలలో 2.70 శాతంగా ఉంది. పెరుగుతున్న అంతర్జాతీయ ముడి చమురు రేట్లకు అనుగుణంగా దేశీయ ఇంధన రేట్లు కూడా పెరగడంతో ‘ఇంధన, విద్యుత్’ విభాగంలో ద్రవ్యోల్బణం మార్చిలో ఉన్న 4.70 శాతం నుంచి ఏప్రిల్‌లో 7.85 శాతానికి పెరిగింది. పండ్లలో ద్రవ్యోల్బణం మార్చిలో ఉన్న 9.26 శాతం నుంచి ఏప్రిల్‌లో రెండు సంఖ్యలకు 10.47 శాతానికి పెరిగింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన డబ్ల్యు.పి.ఐ ద్రవ్యోల్బణ తాత్కాలిక అంచనాను 2.48 శాతం నుంచి 2.74 శాతానికి పెంచుతూ సవరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర మొదటి ద్రవ్య విధాన సమీక్షలో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని వడ్డీ రేటును యాథాతథంగా కొనసాగించాలని గత నెలలో నిర్ణయించింది. అయితే, ద్రవ్య విధానాన్ని రూపొందించేటప్పుడు ఆర్.బి.ఐ ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణ డాటానే ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో 4.7 శాతం నుంచి 5.1 శాతం మధ్య, అక్టోబర్-మార్చి కాలంలో 4.4 శాతంగా ఉండగలదని అంచనాను దిగువవైపు కేంద్ర బ్యాంక్ సవరించింది. 

Tags
English Title
Increased wholesale inflation
Related News