పెరిగిన ప్లాస్టిక్ ఎగుమతులు

Updated By ManamTue, 11/06/2018 - 22:14
plastic

plasticముంబై: భారతదేశపు ప్లాస్టిక్ ఎగుమతులు 2018 ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో  31.6 శాతం వృద్ధి చెంది 4.59 బిలియన్ డాలర్ల మేరకు ఉన్నాయి. గత ఏడాది అదే కాలంలో అవి 3.48 బిలియన్ డాలర్ల మేరకు ఉన్నాయి. మొత్తంమీది సామానుల ఎగుమతిలో వృద్ధికన్నా ఈ విభాగంలో ఎగుమతులలో వృద్ధి ఎక్కువ వేగంగా ఉందని ప్లాస్టిక్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ తెలియజేసింది. దేశం నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో, 12.5 శాతం పెరుగుదలతో 164.04 బిలియన్ డాలర్ల విలువైన సామానులు ఎగుమతయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దేశం నుంచి సాగిన మొత్తంమీది వస్తువుల ఎగుమతుల్లో ప్లాస్టిక్స్ వాటా 2.80 శాతంగా ఉన్నట్లు ప్లెక్స్‌కాన్సిల్ వెల్లడించింది. ప్లాస్టిక్ ముడిపదార్థాలు, ప్లాస్టిక్ షీటు, ఫిల్మ్, ప్లేట్లు, ప్యాకేజింగ్ వస్తువుల ఎగుమతులు ప్రధానంగా పెరగడం వల్ల ప్లాస్టిక్ ఎగుమతులలో వృద్ధి కనిపించిందని తెలిపింది. ఇండియా నుంచి ప్లాస్టిక్ సామాను దిగుమతి చేసుకునే టాప్ 25 దేశాల్లో 23 దేశాలు గత ఏడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే, ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో వృద్ధిని కనబరచాయి. చైనా, వియత్నాం, మెక్సికోలకు ఎగుమతుల్లో వృద్ధిలో 70-140 శాతం పెరుగుదల కనిపించింది. ‘‘2017-18 మొదటి ఆరు నెలలతో పోలిస్తే 2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ప్లాస్టిక్ ఎగుమతులలో ధోరణి చాలా సానుకూలంగా ఉంది. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే, ఈ ఏడాది ఆగస్టులో అవి 800 మిలియన్ డాలర్ల మేరకు ఉండి, 38.1 శాతం వృద్ధిని నమోదు చేశాయి’’ అని ప్లెక్స్‌కాన్సిల్ చైర్మన్ రవీశ్ బి కామత్ అన్నారు. ‘‘2018-19లో 106 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను సాధించాలన్న లక్ష్యాన్ని చేరుకోగలమని కౌన్సిల్ ధీమాతో ఉంది’’ అని ప్లెక్స్‌కాన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీబాష్ దశమహాపాత్ర చెప్పారు.

Tags
English Title
Increased plastic exports
Related News