పన్ను కేసుల్లో నగదు పరిమితి పెంపు

Updated By ManamThu, 07/12/2018 - 23:11
PiyushGoyal
  • ట్యాక్స్ చెల్లింపుదార్లకు ఊరట.. ప్రభుత్వానికి కోర్టు ఖర్చులు మిగులు

PiyushGoyalన్యూఢిల్లీ: సుమారు రూ. 5 లక్షల కోట్లు వ్యాజ్యాలలో చిక్కుకుపోవడంతో, ట్రైబ్యునళ్ళు, కోర్టులలో పన్ను శాఖ అప్పీళ్ళు దాఖలు చేసేందుకు ద్రవ్య పరిమితిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల వ్యాజ్యాలలో 41 శాతం తగ్గించవచ్చని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ గురువారం నాడిక్కడ చెప్పారు. ముడిపడిన పన్ను మొత్తం రూ. 20 లక్షలు లేదా అంతకుమించి ఉంటేనే (ప్రస్తుతం ఈ పరిమితి రూ. 10 లక్షలుగా ఉంది) పన్ను శాఖ ఐ.టి.ఏ.టి/సి.ఇ.ఎస్.టి.ఏ.టిలలో అప్పీళ్ళు దాఖలు చేయగలుగుతుందని గోయల్ చెప్పారు. ముడిపడిన మొత్తం రూ. 50 లక్షలు ఉంటేనే (ప్రస్తుతం ఈ పరిమితి రూ. 20 లక్షలుగా ఉంది) హైకోర్టులలో అప్పీళ్ళు దాఖలు చేయడం సాధ్యమవుతుంది. సుప్రీం కోర్టులో వేసే అప్పీళ్ళ విషయంలో ఈ పరిమితిని ఇప్పుడున్న రూ. 25 లక్షల నుంచి కోటి రూపాయులకు పెంచారు. పన్నుల పాలనాయంత్రాంగంలో నమ్మకాన్ని సృష్టించేందుకు నిజాయతీపరులు, చిన్న, మధ్య తరహా పన్ను చెల్లింపుదార్లకు ఊరట కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీయూష్ తెలిపారు. ఈ చర్య మొత్తంమీద పన్ను కేసుల్లో 41 శాతం తగ్గుదలకు దారితీయవచ్చని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. అధిక పరిమితి అంటే, ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఐ.టి.ఏ.టి)లో దాఖలైన పన్ను కేసుల్లో  34 శాతం కేసులను ఉపసంహరించుకున్నట్లు అవుతుంది. అలాగే, హైకోర్టులలో ఉన్న కేసుల్లో 48 శాతం కేసులను ఉపసంహరించుకున్నట్లు అవుతుంది. అదేమాదిరిగా, సుప్రీం కోర్టు నుంచి కూడా 54 శాతం కేసులను ఉపసంహరించుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో కోర్టు ఖర్చులు కోరుకుంటున్న రికవరీ మొత్తం కన్నా ఎక్కువగా ఉంటున్నాయని, తాజా నిర్ణయం వల్ల పన్ను చెల్లింపుదార్లకు ఊరటతోపాటు, ఆ అనవసర వ్యయం కూడా తగ్గుతుందని మంత్రి అన్నారు. చట్టం బాగా అనుకూలంగా ఉందనుకున్న కేసుల్లో మాత్రమే అప్పీలుకు వెళతామని పీయూష్ అన్నారు. 

English Title
Increase the cash limit in tax cases
Related News