ఐ.డి.బి.ఐ రేటింగ్ ఇప్పట్లో మారదు

Updated By ManamWed, 07/11/2018 - 22:13
idbi-bank

idbi-bankముంబై: ప్రభుత్వ యాజమాన్యంలోని ఐ.డి.బి.ఐ బ్యాంక్ యాజమాన్యం మారినంత మాత్రాన ఆ బ్యాంక్ క్రెడిట్ ప్రొఫైల్‌పై గణనీయమైన ప్రభావం ఏదీ ఉండకపోవచ్చని ఒక నివేదిక వెల్లడించింది. మొండి బాకీల భారంతో కునారిల్లుతున్న ఐ.డి.బి.ఐలో వాటాను 51 శాతానికి పెంచుకునేందుకు లేదా నియంత్రణ వాటాను చేజిక్కించుకునేందుకు బీమా రంగ నియంత్రణ సంస్థ ఐ.ఆర్.డి.ఎ.ఐ గత నెలలో జీవిత బీమా సంస్థ (ఎల్.ఐ.సి)కి అనుమతి ఇచ్చింది. ఐ.డి.బి.ఐలో 2018 మార్చి 31 నాటికి 10.82 శాతంగా ఉన్న ఎల్.ఐ.సి వాటా ఇప్పుడు 7.98 శాతంగా ఉంది. ‘‘ఎల్.ఐ.సి మెజారిటీ వాటాను చేజిక్కించుకున్నా, ఐ.డి.బి.ఐలోకి నిధులు చొప్పించగల శక్తి ఎల్.ఐ.సికి ఉన్నా, బ్యాంకు పరిస్థితి దానికదిగా మెరుగుపడేంత వరకు సమీప భవిష్యత్తులో ఐ.డి.బి.ఐ క్రెడిట్ ప్రొఫైల్ పెరిగే అవకాశం లేదు’’ అని రేటింగ్ సంస్థ ‘ఇక్రా’ ఒక నివేదికలో పేర్కొంది. ‘ఇక్రా’ ఐ.డి.బి.ఐకి  ‘ఎ’ రేటింగ్ ఇచ్చింది. ఐ.డి.బి.ఐ బ్యాంక్‌లో వాటా సమీకరణ, ఎల్.ఐ.సి పాలసీహోల్డర్ల ఖాతాల కింద జరిగే అవకాశం ఉందని, కనుక, ఆ బ్యాంక్‌లో ఎల్.ఐ.సి 51 శాతం వాటాను పొందినా, ఐ.డి.బి.ఐ బ్యాంక్ ఎల్.ఐ.సికి అనుబంధ సంస్థ కాబోదని ‘ఇక్రా’ ఫినాన్షియల్ రంగ రేటింగ్‌ల అధిపతి అనిల్ గుప్త చెప్పారు. పాలసీహోల్డర్ల అకౌంట్ కింద ఈ ఇన్వెస్ట్‌మెంట్ జరిగితే, ఈ వాటా ట్రాన్సియంట్ స్వభావం కలిగినది అవుతుంది. కనుక, ఎల్.ఐ.సి మున్ముందు నియంత్రణ సంస్థ నిబంధనల మేరకు బ్యాంకింగ్ రంగంలో తన వాటాను 15 శాతానికి కుదించుకోవాల్సి రావచ్చునని ఆయన అన్నారు. బ్యాంక్‌లోకి ఎల్.ఐ.సి నుంచి నిధులు రావడం వల్ల భవిష్యత్తులో ఆ బ్యాంక్ నష్టాలు భర్తీ కాగలవని ఆయన చెప్పారు. 

Tags
English Title
The IDBI Rating does not change now
Related News