ఐఏఎస్ అధికారిపై కేంద్రం కన్నెర్ర

Updated By ManamWed, 07/11/2018 - 14:59
shah faesal,
  • ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు

  • ఐఏఎస్ అధికారికి షోకాజ్ నోటీసులు

shah faesal

న్యూఢిల్లీ: సివిల్స్‌లో టాపర్‌గా నిలిచి యువతకు ఆదర్శప్రాయంగా మారిన వ్యక్తి.. సామాజిక మాధ్యమాల్లో దేశాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడంపై కేంద్రం కన్నెర్ర చేసింది. సదరు బ్యూరోక్రాట్‌పై చర్యలు తీసుకోవాలంటూ మానవ వనరుల శాఖను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మానవ వనరుల శాఖ ఆ అధికారికి షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఆ యువ అధికారి దానిని ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చకు పెట్టడంతో వివాదం మరింతగా పెరిగింది. 

అసలేం జరిగిందంటే.. జమ్ము కశ్మీర్‌కు చెందిన షా ఫజల్ అనే యువకుడు 2009లో జరిగిన సివిల్స్ పరీక్షలలో టాపర్‌గా నిలిచాడు. జమ్ము కశ్మీర్ రాష్ట్రం నుంచి సివిల్స్ టాపర్‌గా నిలిచిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. దీంతో మీడియా అతడిని ఆకాశానికెత్తేసింది. స్థానిక యువతకు ఆదర్శప్రాయుడంటూ కొనియాడింది. జమ్ము యువత కూడా అతడినే ఆదర్శంగా తీసుకున్నారు. 

అయితే, శిక్షణ అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఫజల్.. కొంతకాలానికి ఉన్నత చదువుల కోసం సెలవు  పెట్టి విదేశాలకు వెళ్లాడు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా దారుణంపై ఫజల్ సోషల్ మీడియాలో ఓ వివాదాస్పద పోస్ట్ చేశాడు. అవినీతి, అశ్లీలం, అరాచకత్వం, జనాభా, మద్యం, నిరక్షరాస్యత, సాంకేతికత కలగలిసి రేపిస్థాన్ అంటూ పోస్ట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

విషయం కేంద్ర ప్రభుత్వం దాకా వెళ్లడంతో శాఖాపరమైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగాలలో ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శించడం నేరమంటూ 2016లో గవర్నమెంట్ ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన నేరానికి  చర్యలు ఎందుకు తీసుకోవద్దో చెప్పాలంటూ మానవ వనరుల శాఖ ఫజల్‌కు షోకాజ్ నోటీసులు జారీచేసింది.

ఈ నోటీసులను ఫజల్ తిరిగి ట్విట్టర్‌లో పెట్టడంతో నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న నీకు ప్రభుత్వ ఉద్యోగం ఎందుకంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ముందు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ తర్వాత మాట్లాడమంటూ మరికొందరు మండిపడ్డారు.

English Title
IAS officer Shah Faesal claims Centre is investigating him for tweets about rape culture
Related News