నేను పార్టీ మారను...

Updated By ManamSat, 11/10/2018 - 12:59
akhila priya
  • టీడీపీలోనే ఉంటాను..

  • 16-18 మధ్య బోట్ ఫెస్టివల్.. భవాని ఐల్యాండ్‌లో నిర్వహణ

  • 50 దేశాల క్రీడాకారులు హాజరు.. కర్నూలులోనూ శిల్పారామం

  • అహోబిలంలో 7 కోట్లతో రోప్‌వే.. పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ

akhila priya

ఒంగోలు: తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న పుకార్లను టూరిజంశాఖ మంత్రి భూమా అఖిల ప్రియ కొట్టిపారేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్టు పైనే తిరిగి పోటీ చేస్తానని అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో శుక్రవారం ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నామని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

కర్నూలు జిల్లాలోని అహోబిలం పుణ్యక్షేత్రం అభివృద్ధిలో భాగంగా హరిత హోటల్‌ను రూ.5 కోట్లతో విస్తరిస్తామని, రూ.1.5 కోట్లతో ఏకోటూరిజం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అహోబిలం కింద నుండి పై వరకు రోప్‌వే కోసం రూ.7 కోట్లు కేటాయించామని చెప్పారు. కర్నూలులో శిల్పారామానికి ఈ నెలలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. విజయవాడలో బుద్దటూరిజం సర్క్యూట్ 90 శాతం పూర్తయిందన్నారు.

అరకులో బెలూన్ ఫెస్టివల్, కర్నూలులో ధూం పెస్టివల్‌ను ఘనంగా నిర్వహించామన్నారు. ఈ నెల 16,17,18 తేదీలలో విజయవాడలో బోట్ రేసింగ్ నిర్వహిస్తుండగా 50దేశాలు పాల్గొంటున్నాయని, అందులో అమరావతి టీం కూడా ఉందన్నారు. బోటు ప్రమాదాలకు సంబంధించి తమ శాఖ అనుమతులు ఏమీ ఉండదని, ఇరిగేషన్‌శాఖ అనుమతులు ఇస్తుందన్నారు. నూతనంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ద్వారా అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి రూ. 500 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు.

English Title
I will not change the party, bhuma Akhila priya
Related News