నాన్న మాటను జీవితంలో మరచిపోను 

Updated By ManamThu, 09/20/2018 - 01:30
rahul vijay

imageరాహుల్ విజయ్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’. రాము కొప్పుల దర్శకుడు. దివ్యా విజయ్ నిర్మాత. ఈ నెల  21న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ ‘‘చిన్నప్పట్నుంచి షూటింగ్‌లకు వెళ్లేవాడిని. కెమెరా వెనుక నిలబడి షూటింగ్స్ చూస్తుండేవాడిని.. చిన్నప్పుడు డాన్స్ ఎక్కువగా చేసేవాడిని. అది చూసిన నాన్న లారెన్స్ మాస్టర్‌గారి దగ్గర చేర్పించారు. ప్రతిరోజూ డాన్స్ క్లాసులకు వెళ్లి వస్తుండేవాడిని. ఆ సమయంలో నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు నాన్న ‘సినిమాల్లో హీరోగా నటిస్తావా?’అని అడిగారు. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండటంతో నేను కూడా సరేనని అన్నాను. ఆ తర్వాత 8 సంవత్సరాలు సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లో శిక్షణ పొందాను.

డాన్స్ విషయానికి వస్తే హిప్‌హాప్, కూచిపూడి నేర్చుకున్నాను. జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాను. బ్యాంకాక్ వెళ్లి మూవీ ఫైటింగ్ కోర్సు నేర్చుకున్నాను. కరాటేలో బ్లూ బెల్ట్ సాధించాను. కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాను. దేవదాస్ కనకాల, లక్ష్మిదాస్ కనకాల గారి వద్ద నటనలో శిక్షణ పొందాను. ఇలా అన్ని నేర్చుకోవడానికి కారణం ఏదైనా స్క్రిప్ట్ వచ్చినప్పుడు దాన్ని అన్నివిధాలా నేను న్యాయం చేయగలిగేలా ఉండాలి. అందుకనే నాన్న మాట మేర అన్నింట్లో శిక్షణ పొందాను. నన్ను నేను తొలిసారి తెరపై చూసుకున్నప్పుడు కంట్లో నీళ్లు తిరిగాయి. దీని కోసమే కదా! ఇంత కష్టపడ్డాను అనిపించింది. ఇక సినిమా విషయానికి వస్తే సినిమాలో నా పాత్ర పేరు చందు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని.. ఖాళీగా తిరిగే ఓ కుర్రాడి పాత్ర. ఓ అమ్మాయి కోసం చందు జీవితం బాధ్యత గల యువకుడిగా మారుతాడు. ఇలా మారిన క్రమంలో చందు జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే సినిమా. యాక్షన్ సినిమాలు, మాస్ సినిమాలు చేయడానికి నాకు ఇంకా సమయం ఉందని అనుకుంటున్నాను.

ఎందుకంటే 30, 40 ఏళ్లలో కూడా వీటిని చెయ్యొచ్చు. ముందు పెద్ద కమర్షియల్ డైరెక్టర్‌తోనే వెళ్దామని అనుకున్నా.. అది వర్కవుట్ కాలేదు. డిలే అవుతుండటంతో రాము కొప్పుల చెప్పిన కథ నచ్చడంతో బాగా నచ్చి సినిమా చేయడానికి రెడీ అయ్యాం. స్వంత నిర్మాణసంస్థలో సినిమా చేయడం ఎప్పుడూ టెన్షనే.  సినిమా చూసిన తర్వాత ఒరేయ్ ముప్పై ఏళ్లుగా నేను ఇండస్ట్రీలో టెక్నీషియన్‌గా వర్క్ చేస్తున్నాను. మూవీ ఎంత వరకు సక్సెస్ అవుతుందో నేను చెప్పలేను కానీ.. హీరోగా నువ్వు సక్సెస్ అయ్యావు’ అని నాన్న ఓ టెక్నీషియన్‌గా చెప్పిన మాటను నా జీవితంలో మరచిపోలేను. దివ్యక్క ప్రొడక్షన్ పనులను దగ్గరుండి చూసుకుంది. ఎంత ఒత్తిడి ఉన్నా.. బయటపడేది కాదు.. నాకు తెలియకుండా ఏడ్చేది. ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. 
 

English Title
I do not forget the word of my father
Related News