నేనూ... బౌద్ధుణ్ణే...! 

Updated By ManamTue, 10/02/2018 - 03:10
mahathma gandhi

గాంధీ పూర్తిగా పదహారణాల హిందువే... అయానా... ఆయన అన్ని మతాల నుంచి కొంత కొంత సారాన్ని  తీసుకున్నాడు. బౌద్ధ, సిక్కు, జైన, క్రైస్తవ, ముస్లిం,పార్శీ, నాస్తిక మత విధానాల్ని పాటిస్తూ అందర్నీ స్వాతంత్రోద్యమంలో భాగస్వా ముల్ని చేసిన గొప్ప రాజకీయ చతురుడు... ‘హిందువుగా బతకాలా? బౌద్ధునిగా మిగ లాలా?’ అనేది తేల్చుకోలేక, ఒక రాజకీయ వేత్తగానే మిగిలిన గాంధీని  హిందూ మతోన్మాదం  బలి తీసు కుంది. గాంధీ ఎంచుకున్న బౌద్ధ మార్గం దానికి జవా బు చెప్పలేదు. ఎందుకంటే ...గాంధీ దాన్ని హిందూ మతంలో భాగంగానే చూశాడు.. చేశాడు. అమాన వీయ వైదిక భావజాలంపై విజయం సాధించేది ఎప్పటికైనా మానవీయ బౌద్ధమే! 

gandhiగాంధీజీ గొప్ప తాత్త్వికుడేం కాదు. కానీ గొప్ప రాజకీయ నాయకుడు. భారత దేశ స్వాతంత్య్ర పోరాటంలోకి బ్రాహ్మణ, క్షత్రియ వర్గాల స్థానంలోకి దిగువ కులాల్నీ, మధ్య తరగతి ప్రజల్ని తెచ్చి నిలబెట్టినవాడు. గాంధీ వచ్చాకే భారత స్వాతంత్య్ర పోరాటం అందరిదీ అయ్యింది. రెండో మాటే లేదు. గాంధీజీ పదహారణాల హిందువు. అయితే, కరుడుకట్టిన మతవాది మాత్రం కాదు. కేవలం హిందూ మతోన్మాదులతోనే, మత శక్తులతోనే ఈ దేశ స్వాతంత్య్ర పోరాటాన్ని సాగిం చాలని ఆయన ఎప్పుడూ భావించలేదు. నిజం చెప్పా లంటే హిందూ మతోన్మాదుల్ని కాస్త దూరంగానే ఉంచాడు కూడా. తెలిసో, తెలియకో, ఏవేవో భావా వేశాలు వంటికి పట్టించుకునో, లేదా కాంగ్రెస్ పార్టీ పాలనను గాంధీకి అంటగట్టో ఈ డ్బ్భై ఏళ్ళలో గాంధీ లౌకిక వాదానికి లౌకిక వాద ప్రేమికులే తూట్లు పొడిచారు. అది మాత్రమే ఏకైక కారణం కాకపోయినా నేడు మతశక్తుల దురాగతాలు పెరగడానికీ అదీ ఒక కారణమే!

మతోన్మాదపు అంచుల దాకా దేశం వెళ్ళిన ఈ రోజుల్లో గాంధీజీని ఒక చరిత్ర అవసరంగా భావించి ఆలోచించాల్సిన అవసరం అందరికీ వచ్చింది! మరలా మరలా మనం మరీ మరీ గుర్తు పెట్టు కోవాల్సిన విషయం, గాంధీ హిందువే అనేది. 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లో ఒక చిన్న పట్టణం పోరు బందర్‌లో పుట్టిన గాంధీ కుటుంబ నేపథ్యం చూస్తే  తల్లి వైష్ణవ హిందువు. రామానుజుని వైష్ణవ సంప్రదాయంలో కొంత సంస్కరణవాదం, అంటరాని తనం పట్ల వ్యతిరేకత ఉంది. ఇక ఆయన తండ్రి జైన మతాభిమాని. నాయనమ్మ జైన అవలంబి. చిన్న తనం నుంచి సంస్కరణ వాదం, అహింసా విధానం వింటూ పెరిగిన గాంధీ చివరికి హిందూ అద్వైత వాదిగా మారాడు. ఉపనిషత్తులు, షడ్దర్శనాల సారం తో నిండిన భగవద్గీతకు, శంకరుని అద్వైతాన్ని జోడించి ఆ సారాన్ని తనలో నింపుకున్నాడు.

అందుకే గాంధీ, మత సంస్కరణవాది కాగలిగాడు. ఇది గాంధీ ఆథ్యాత్మిక జీవితం.
ఇలాంటి భావజాలంతో గాంధీ దక్షిణాఫ్రికా చేరా డు. అక్కడ తెల్లవాళ్ళ దాష్ఠీకాలకి, వారు నల్లవారిపట్ల జూపించే జాతి వివక్షతకు వ్యతిరేకంగా నిలబడాల్సి వచ్చినప్పుడు  గాంధీకి తాను ఇంతకాలం నేర్చుకున్న హిందూ భావజాలం ఎందుకూ కొరగానిదిగా కన్పిం చింది. హింసకు, అంటరానితనం అనే అమానవీ యతకు నిలయమైన హిందూ సిద్ధాంతంతో క్రైస్తవ సిద్ధాంతాన్ని (నాటి తెల్ల దొరల) ఎదుర్కోవడం సాధ్యం కాదనుకున్నాడు. తాను ఆ సమయంలో ‘హిందూ’ ఆయుధం తీస్తే అది తిరిగి తన మీదకే బ్రహ్మాస్త్రంలా వచ్చి పడుతుందని భావించాడు. అప్పుడు ఆయనకు ‘తన దేశానికి చెందింది, తన దేశ సంస్కృతికి బలమైన భూమికగా కన్పించింది’ బౌద్ధ మే! బౌద్ధం తప్ప ‘అన్యదా శరణం నాస్తి’ అను కున్న గాంధీకి  ఎడ్విన్ ఆర్నాల్డ్ రాసిన ‘లైట్ ఆఫ్ ఏషియా’ (ఆసియా జ్యోతి) గ్రంథం గాండీవంలా దొరికింది. గాంధీ 1888-91ల మధ్య లండన్‌లో చదువు కుంటున్నప్పుడు ఆర్నాల్డ్ ఆంగ్లంలోకి అనువదించిన రెండు పుస్తకాలు చదివాడు. ఒకటి: ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్ (భగవద్గీతకు ఆంగ్ల అనువాదం). రెండు: లైట్ ఆఫ్ ఏషియా. గాంధీ మీద అతి తీవ్రంగా ప్రభా వం చూపింది బుద్ధుని జీవితాన్ని విశ్లేషించిన లైట్ ఆఫ్ ఏషియా గ్రంథం. క్రీస్తు కంటే ఆరు వందల సం వత్సరాలకు పూర్వమే దయ, కరుణ, ప్రేమ, మాన వీయతలను గురించి చెప్పిన బుద్ధుడు, అతని బౌద్ధ ధర్మం గాంధీకి ఆసరాగా నిలిచాయి. డర్బన్ (దక్షిణ ఆఫ్రికాలోని ఒక పట్టణం)లో 1893-1914ల మధ్య గాంధీ ఉన్నాడు. అక్కడ సత్యాగ్రహం, అహింసలతో పోరాటాన్ని నడిపినప్పుడు తొలిసారి బుద్ధుని గురిం చి, అతని ధర్మం గురించి వివరించాడు. ఈ విష యాన్ని గురించి ‘భగవద్గీత కంటే... లైట్ ఆఫ్ ఏషియా గ్రంథాన్నే ఎక్కువగా చదివాను’ అన్నారు గాంధీ.
భిన్న ధృవాలైన అటు భగవద్గీతనూ, ఇటు బౌద్ధాన్ని జోడించి చెప్పాడు. బుద్ధుడు విష్ణువు అవతా రాల్లో ఒకడే అన్న భావాన్ని బలపరచాడు. బౌద్ధమే కాదు, జైన, సిక్కు మతాలు కూడా హిందూ మతాం తర శాఖలే అనేది ఆయన అభిప్రాయం. ఆత్మలేదు, దేవుడు లేడు అని చెప్పిన బుద్ధుణ్ణి కూడా దశావతా రాల్లోకి చేర్చి, ఇటు హిందువులకు వ్యతిరేకంగా కా కుండా, అటు బ్రిటీషువారిని మానవీయత అనే ఆ యుధంతో ఎదుర్కోడానికి సిద్ధమయ్యాడు గాంధీజీ!

అందుకే... గాంధీ తెలివైన తాత్త్వికుడు కాదు. తన రాజకీయ స్వాతంత్య్రోద్యమానికి అన్ని మతా లనూ ఆసరాగా ఉపయోగించుకున్న ‘తెలివిగల రా జకీయ నాయకుడు’. రాజకీయానికి ‘‘పోరాట పంధాని’ కాకుండా ఆధ్యాత్మికతను ఎంచుకున్న భార తీయుడు. ఆర్నాల్డ్ అనువాద గ్రంథం అయిన లైట్ ఆఫ్ ఏషియా తప్ప బౌద్ధ మూల గ్రంథాలు చదవని గాంధీకి అన్నీ ఒకటిగానే కనిపించాయి. అందుకే బౌద్ధ మూల గ్రంథాల్ని చదివిన అంబేడ్కర్‌కీ, గాంధీ కి బౌద్ధం వేర్వేరుగా అర్థమయింది. అంబేడ్కర్ మరో బోధిసత్త్వుడు కాగలిగాడు. ధమ్మ చక్రప్రవర్తన కావిం చాడు. బౌద్ధాన్ని పునరుజ్జీవింపచేశాడు.     బౌద్ధంలోని సత్యం, దానం, క్షమ లాంటి దశపార మితలూ, జీవహింసలేని ప్రేమ, వ్యక్తిత్వ ప్రక్షాళనకి, పరిపూర్ణతలకి, పవిత్రతలకి కారణమైన ధర్మ వివేచన  ఈ మూడూ గాంధీజీని విశేషంగా ఆకర్షించాయి. ‘బుద్ధుని అహింసావాదం కేవలం మానవులకు మాత్రమే పరిమితమైంది కాదు. అది సమస్త జీవకోటికి సంబంధించిన మహాకరణ’ అని గాంధీ చెప్తూ ఉండే వాడు. గాయపడిన హంసనీ, పశువుల్ని, గొర్రెపిల్లనీ బుద్ధుడు కాపాడిన కథలు చెప్పేవాడు. ‘చాలామంది హిందువులు నన్ను బౌద్ధాన్ని ప్రచారం చేస్తున్నావు’ అని నిలదీస్తున్నారు. అలా నన్ను అనడం నాకెంతో సంతోషం. ఎందుకంటే హిందూ మతంలోని ప్రామా ణిక విషయాలూ, మంచి విషయాలు అన్న బౌద్ధం నుంచి తీసుకొన్నవే’ అనేవారు గాంధీజీ! ఒక విష యానికి ‘కార్యకారణ సంబంధం’ మాత్రమే కారణం అని చెప్పిన వ్యక్తి బుద్ధుడు తప్ప మరొకరు లేరు’  అంటారు గాంధీజీ!
1913 జులై 2న ఒక ఆంగ్లపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ‘కృష్ణుడు, రాముడు, బుద్ధుడు, జీసస్... వీళ్ళ లో ఎవరు శ్రేష్టులు అని నిర్ణయించడం చాలా కష్టమే’ అన్నాడు గాంధీ. మరలా ఆయనే... విలేకరి ప్రశ్నకు జవాబుగా ‘ఖచ్చితంగా తేల్చవలసి వస్తే... బుద్ధుడే గ్రేట్’ అని తేల్చి చెప్పాడు. 

ఇలా భావాత్మకంగా తెల్లవాళ్ళ దౌర్జన్యాల్ని ఎది రించడానికి ‘భారత గడ్డ మీద పుట్టిన బుద్ధుడు తప్ప మరో దిక్కు గాంధీకి దొరకలేదు! అందుకే... ఆయన మనస్తత్త్వానికీ, ఆయన పోరాటానికి బౌద్ధం అని వార్యమైన అవసరం అయ్యింది. భారత దేశానికి వచ్చాక ‘నేను బౌద్ధుణ్ణే’ అని గాంధీ 1920లో ప్రకటిం చాడు. 1922లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా అహ్మ దాబాద్ దగ్గరి చంపారన్ లో తన తొలి ఉద్యమం ప్రారంభించాడు. అదే ‘సత్యాగ్రహం’. ఈ ఉద్య మ స్వరూపాన్ని తాను బౌద్ధం నుంచి తీసుకున్నానని ఆ సందర్భంగా ప్రకటించాడు. ‘అహింస పిరికితనం కాదు. వెను చూపని ధీరత్వం’ అని, బుద్ధుడు చెప్పిన మాటల్ని ఉటంకించాడు. ‘బుద్ధుడు హిందూ మతాన్ని ప్రక్షాళన చేశాడు. ఆయన స్వ చ్ఛమైన వాడు. కానీ గుడ్డి బ్రాహ్మణులే తమ స్వార్ధం కోసం బుద్ధుణ్ణి అంగీకరిం లేదు’ అని 1916 ఫిబ్రవరి 14వ తేదీన మద్రాసులో ప్రకటించాడు గాంధీ.

1922 సత్యాగ్రహం సందర్భంగా జైలుకెళ్ళిన గాంధీ 1924లో విడుదలై వచ్చాక మే 18న బొంబాయిలో బుద్ధ జయంతి జరిపాడు. ఆ మరు సటి ఏడాది మే 7న, కలకత్తాలో బుద్ధ జయంతి సభ జరిపి, ఆర్నాల్డ్ రాసిన పుస్తకాన్ని వివరంగా చెప్పాడు. 1926లో సబర్మతి ఆశ్రమాన్ని నిర్మించిన సందర్భంగా బౌద్ధంలోని నిర్వాణాన్ని భగవద్గీతతో అనుసంధానిస్తూ ప్రసంగించాడు. ప్రముఖ బౌద్ధ రచయిత ధమ్మానంద కోసంబితో గాంధీజీకి మంచి పరిచయం. భగవద్గీత విషయంలో ఇద్దరికీ వాగ్వి వాదం జరిగింది. గీత ‘హింసావాదం’ అన్న కోసంబీతో గాంధీ ఏకీభవించలేదు. కానీ, కోసంబీ వార్థా ఆశ్రమంలో చనిపోయాక గాంధీజీ ఆయన పేరుతో ఒక స్కాలర్‌షిప్ ఏర్పాటు చేశాడు. శ్రీలంక వెళ్ళి పాళీ భాషనీ, బౌద్ధ త్రిపికాల్ని చదువుకునే విద్యార్థులకు ఆ స్కాలర్‌షిప్ అందించేవారు.  1927 నవంబర్‌లో శ్రీలంక వెళ్ళిన గాంధీ  అక్కడి మహేం ద్ర విశ్వవిద్యాలయంలో, నలందా, విద్యోదయ కళా శాలల్లో బౌద్ధం మీద ప్రసంగాలు చేశాడు. 1929లో గాంధీ బర్మాకు వెళ్ళాడు. అక్కడ బర్మా, చైనా, శ్రీలంక, నేపాల్ భిక్షువులు, తనని బు ద్ధుని పుట్టిన దేశవాసిగా గౌరవించడం చూసి చలించి పోయాడు. బర్మా రాజకీయ ఉద్యమంలో బౌద్ధ భిక్షువులు ప్రత్యక్షంగా పాల్గొనడం, దాన్ని నడిపించడం చూశాడు. వార్ధాలోని గాంధీ ఆశ్రమాన్ని చూడ్డానికి జపాన్ భిక్షువులు 1935లో కొందరు వచ్చి, కొంత కాలం అక్కడే ఉండి పోయారు. ‘బుద్ధునికి దేవుని పట్ల నమ్మకం లేదు. కానీ, సత్యం పట్ల నమ్మకం ఉంది’ అని పదే పదే గాంధీజీ చెప్పేవాడు.

నిజానికి బౌద్ధం, వైదిక మత అమానుష విధా నాలకి పూర్తిగా ప్రత్యామ్నాయం. బుద్ధుడు కేవలం ‘దేవుడు’ లేడు అని మాత్రమే అనలేదు. హిందూ మతంలోని ఆత్మ, పరమాత్మ, కులం, అంటరాని తనం, స్త్రీ అసమానతలు, ఆర్ధిక అసమానతలు  ఇలా మొత్తం మనుధర్మ శాస్త్రానికే భిన్నమైన మానవీయ ధర్మశాస్త్రాన్ని ప్రబోధించిన సామాజిక విప్లవ కారుడు. అయితే, బౌద్ధంలో తనకు కావలసిన అహింస, వ్యక్తిగత పరివర్తన అంశాల్ని తీసుకుని పాశ్చాత్య ప్రపంచానికి భారతదేశం ఏ మాత్రం తీసిపోదు అని చెప్పడానికి  గాంధీజీ తీవ్రంగా ప్రయత్నించాడు. గాంధీ పూర్తిగా పదహారణాల హిందువే... అయానా... ఆయన అన్ని మతాల నుంచి కొంత కొంత సారాన్ని  తీసుకున్నాడు. బౌద్ధ, సిక్కు, జైన, క్రైస్తవ, ముస్లిం,పార్శీ, నాస్తిక మత విధానాల్ని పాటిస్తూ అందర్నీ స్వాతంత్రోద్యమంలో భాగస్వా ముల్ని చేసిన గొప్ప రాజకీయ చతురుడు. చివరిగా ఒక్క విషయం తప్పక చెప్పుకు తీరాలి  ‘అమెరికాపై రెండు దశాబ్దాలకు పైగా తుపాకులు పట్టి, గెరిల్లా యుద్ధం చేసి, అమెరికా సామ్రాజ్య వాదాన్ని మట్టి కరిపించిన దేశం వియత్నాం. ఆ పోరాట నాయకుడు ప్రముఖ కమ్యూనిష్టు నేత హోచిమిన్. హోచిమిన్ స్వయానా ఒక బౌద్ధ భిక్షువు. వియత్నామీయులు ఆయనను రెండో ‘బుద్ధుని’గా కీర్తిస్తారు. అలాంటి హోచిమిన్ ఒకసారి మన దేశం వచ్చారు. రాగానే ‘గాంధీ సమాధి దగ్గరకు వెళ్ళాలని’ కోరాడు. గాంధీ సమాధి ముందు మోకాళ్ళ మీద భిక్షువు భంగిమలో కూర్చొని  ‘హే! గాంధీ! బుద్ధుడు పుట్టిన దేశంలో పుట్టావు కాబట్టి చివరికంటూ శాంతి యుతంగా పోరాటం చేశావు. నేను అలా చేయలేక పోయాను’ అని, ఆవేదన వెలిబుచ్చాడు. ‘హిందువుగా బతకాలా? బౌద్ధునిగా మిగ లాలా?’ అనేది తేల్చుకోలేక, ఒక రాజకీయ వేత్తగానే మిగిలిన గాంధీని  హిందూ మతోన్మాదం  బలి తీసు కుంది. గాంధీ ఎంచుకున్న బౌద్ధ మార్గం దానికి జవా బు చెప్పలేదు. ఎందుకంటే ...గాంధీ దాన్ని హిందూ మతంలో భాగంగానే చూశాడు.. చేశాడు. అమాన వీయ వైదిక భావజాలంపై విజయం సాధించేది ఎప్పటికైనా మానవీయ బౌద్ధమే! అందుకు మనం అక్టోబర్ రెండు (గాంధీజీ జయంతి) నుంచి అక్టోబర్ 14కి (అంబేడ్కర్ బౌద్ధ దీక్ష) వెళ్ళాల్సిందే!
 బొర్రా గోవర్ధన్
9390600157

English Title
I ... Buddhist ...!
Related News