హైదరాబాద్ 124 ఆలౌట్

Avesh khan
  • మధ్యప్రదేశ్‌తో రంజీ మ్యాచ్

ఇండోర్: మధ్యప్రదేశ్‌తో గురువారం ప్రారంభమైన రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 124 పరుగులకే కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ హిమాలయ్ అగర్వాల్ (69 నాటౌట్) తప్ప మిగిలిన ఏ ఒక్క బ్యాట్స్‌మన్ రాణించలేకపోయారు. మధ్యప్రదేశ్ బౌలర్ అవేష్ ఖాన్ (7/24) అద్భుతమైన బౌలింగ్‌తో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. తొలుత బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ తన్మయ్ అగ ర్వాల్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన త్యాగరాజన్ (1), రోహిత్ రాయుడు (4), సందీప్ (0), అక్షిత్ రెడ్డి (21), సుమంత్ (0)లు వెంటవెంటనే ఔటవ్వడంతో జట్టు 33 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హిమాలయ్ అగర్వాల్ (69 నాటౌట్) ఒంటరి పోరాటం చేయడంతో హైదరాబాద్ జట్టు 100 పరుగుల మార్కును దాటగలిగింది. అగర్వాల్‌కు తర్వాత క్రీజులోకి వచ్చిన ఏ ఒక్క బ్యాట్స్‌మన్ సహకరించకపోవడంతో జట్టు 35.3 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది. మధ్యప్రదేశ్ బౌలింగ్‌లో అవేష్ ఖాన్ 7 వికెట్లతో విజృంభించాడు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి తొలి ఇన్నింగ్స్‌లో 168 పరుగులు చేసింది. క్రీజులో రోహిరా (81 నాటౌట్), పటిదార్ (51 నాటౌట్) అర్ధ శతకాలతో ఉన్నారు. 

Tags

సంబంధిత వార్తలు