ఎయిడెడ్ కోర్సులను.. అన్ఎయాడెడ్‌గా ఎలా మార్చేస్తారు?

Updated By ManamWed, 06/13/2018 - 23:55
suprem court
  • ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందన

suprem courtహైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ఎత్తివేస్తూ ఎయిడెడ్ కోర్సులను అన్-ఎయిడెడ్ కోర్సులుగా చేసిందన్న ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ప్రతివాదులైన ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, కళాశాల విద్యా శాఖ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. ఎయిడెడ్ కోర్సుల్ని అన్‌ఎయిడెడ్‌గా మార్పు చేస్తే ఆయా విద్యాలయాలు ఇష్టం వచ్చినట్లుగా ఫీజులు వసూలు చేస్తే ఏంచేస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి ఉమాదేవిలతో కూడిన డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. ఎయిడెడ్ కోర్టులకు ఆర్థిక చేయూతను నిలిపివేస్తూ గత మే 9న కళాశాల విద్యా శాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల్ని జగిత్యాల జిల్లాకు చెందిన శంకర్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ ఉత్తర్వుల వల్ల పేదలకు విద్య ఆర్థికంగా భారం అవుతుందని ఆయన వాదన. ఫీజుల్ని ప్రభుత్వమే నియంత్రిస్తుందని, అడ్మిషన్లు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరుగుతాయని తెలంగాణ ప్రభుత్వ లాయర్ చెప్పారు.  ఆర్థిక చేయూత ఆపేస్తే ఫీజుల భారం పెరిగే అవకాశాలు ఉన్నాయి కదా అని బెంచ్ ప్రశ్నిస్తూనే ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.

ఆ భూమి ప్రజోపయోగానికే..: హైకోర్టు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని రెండు గ్రామాల్లో పట్టణ భూగరిష్ట పరిమితి చట్ట పరిధిలోని 17 ఎకరాల్ని ప్రజోపయోగం కోసమే ఉపయోగపడేలా ఆదేశాలు ఇవ్వాలనే ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఉప్పరపల్లి, సాగ్బౌలి గ్రామాల్లో వివిధ సర్వే నెంబర్‌లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలోని భూములు ఉన్నాయని, ఇవి అన్యాక్రాంతం కాకుండా ఆదేశాలివ్వాలని శ్రీరామ్ మరొకరు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులకు బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి  ఉమాదేవిలతో కూడిన డివిజన్ బెంచ్ నోటీసులు ఇచ్చింది.

English Title
How are Aided Courses Changed An Unaided?
Related News