కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Updated By ManamThu, 07/12/2018 - 17:11
rains
  • ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు

  • కోనసీమలో దెబ్బతిన్న నారుమళ్లు.. రైతుల ఆందోళన

  • నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు.. ప్రజల ఇక్కట్లు

Rains in Coastal Andhra Pradesh

విశాఖ : ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో రాగల 24 గంటలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రెండు రోజులపాటు కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. రాయలసీమలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని,...మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. జిల్లాల్లో అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది.

కాగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్రలోని ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటికి తోడు భారీ వర్షాల కారణంగా గోదావరి నది నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో లంక గ్రామాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి.

తూర్పుగోదావరి జిల్లాలో గత పది రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కోనసీమ ప్రాంతం భారీ వర్షాలతో తడిసి ముద్దవుతోంది. దీంతో కోనసీమలో ఖరీఫ్ నారుమళ్లకు తీవ్రమైన నష్టం ఏర్పడింది.  ఈరోజు ఉదయం 8.30 గంటల సమయానికి రావులపాలెంలో 5.57 సెం.మీ, గడలలో 5.42 సెం.మీ, కపిలేశ్వరంలో 5.35 సెం.మీల వర్షపాతం నమోదైంది.

పశ్చిమగోదావరి జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజా జీవనానికి ఆటంకం కలుగుతోంది. జిల్లాలోని తణుకు, అత్తిలి, ఇరగవరం, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండల ప్రాంతాలలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. తొలుత కురిసిన తొలకరి వానలకు వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులు.. నారుమళ్లు, నాట్లు వేశారు.

విస్తారంగా కురిసిన వర్షాలకు అవి కుళ్లిపోతాయేమోనని ఆందోళన చెందుతున్నారు.  అరటి తోటలలోనూ వర్షానికి నీరు చేరడంతో గెలలు పెరగక నష్టపోవాల్సి వస్తుందని అరటి రైతులు గగ్గోలు పెడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు చేరడంతో నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు.

కృష్ణాజిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ముసురు వానతో వాతావరణంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. ఈదురుగాలులతో పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విజయవాడ నగరంలో అర్ధరాత్రి నుంచి భారీగా వర్షం పడింది. రెడ్డిగూడెం, గన్నవరం, కోటపాడు, వత్సవాయి ప్రాంతాల్లో ఓ మోస్తరు వాన పడింది. 

చాట్రాయి, వీర్లుపాడు, చందర్లపాడు, ఉంగుటూరు, బాపులపాడు, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు, నందిగామ ప్రాంతాల్లో చెదురుమదురు వానలు పడుతున్నాయి. జగ్గయ్యపేట, మైలవరం పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం పడుతుండడంతో వ్యవసాయ పనులు ఊపందుకుంటున్నాయి.

ఇవాళ ఉదయం 8 గంటలకు రెడ్డిగూడెం మండలం రంగాపురంలో 71.75 మి.మీ, గన్నవరంలో 71.50 మి.మీ, రెడ్డిగూడెంలో 54.75 మి.మీ, కోటపాడులో 54.25 మి.మీ, అల్లూరులో 50.50 మి.మీ, వత్సవాయిలో 50.25 మి.మీ, చందర్లపాడులో 50 మి.మీల వర్షం నమోదైంది.

English Title
heavy rain warning in Coastal Andhra Pradesh in next 24 hours
Related News