భారత్‌కు భారీ ఊరట

Updated By ManamThu, 11/08/2018 - 23:03
Chabahar-port
  • ఇరాన్‌లో రేవు కట్టేందుకు ఓకే

  • ఆంక్షలు సడలించిన అమెరికా

  • చాబహార్ పోర్టు కడుతున్న భారత్

  • పాక్  గ్వదర్ పోర్టుకు సమీపంలోనే..

  • మన సైనిక అవసరాలకూ అనుకూలం

  • దౌత్య విజయమేనంటున్న అధికారులు

Chabahar-portన్యూఢిల్లీ: భారతదేశం మరో దౌత్య విజయం సాధించింది. ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఆ రేవు నిర్మాణాన్ని అమెరికా ఆంక్షల పరిధి నుంచి తప్పించేలా అగ్రరాజ్యాన్ని మన దౌత్యవేత్తలు ఒప్పించగలిగారు. ఇప్పటికే ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడానికి మినహాయింపు లభించగా.. ఇప్పుడు చాబహార్ ప్రాజెక్టుకు కూడా అడ్డంకులు తొలగిపోవడంతో భారత్‌కు భారీ ఊరట లభించినట్లయింది. భారత్, చైనా, ఇటలీ, గ్రీస్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, టర్కీ దేశాలకు ఇరాన్ నుంచి క్రూడాయిల్ కొనుగోలుకు మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, ఆర్థిక మంత్రి స్టీవ్ ఎంనుచిన్ తెలిపారు. అయితే వీటిలో రెండు దేశాలు ఇప్పటికే ఇరాన్ నుంచి చమురు దిగుమతులను పూర్తిగా ఆపేశాయని, మిగిలిన దేశాలు కూడా ఆపేసేందుకు వీలుగా చర్చలు కొనసాగిస్తామని పాంపియో చెప్పారు. చాబహార్ పోర్టుతో పాటు ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రేడ్ కారిడార్ (ఐఎన్‌ఎస్‌టీసీ) పరిధిలోని రైల్వే ప్రాజెక్టును కూడా ఆంక్షల నుంచి వెలుపల పెడుతున్నామని, అఫ్ఘానిస్థాన్ అభివృద్ధి కసమే ఇలా చేస్తున్నామని విదేశాంగ శాఖ తాజాగా స్పష్టం చేసింది. ప్రాజెక్టు పనులు ముందుకు కొనసాగడానికి అనుమతించడంతో పాటు ఆంక్షల పరిధిలో లేని సరుకుల రవాణాకు కూడా అనుమతిస్తున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. విస్తృత చర్చల అనంతరం చాబహార్ పోర్టు అభివృద్ధి, దానికి అనుబంధంగా రైల్వేలైను తదితరాల నిర్మాణాలను ఆంక్షల పరిధి నుంచి వెలుపల పెడుతున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. చాబహార్ పోర్టు, ఐఎన్‌ఎస్‌టీసీలు భారత్, ఆఫ్ఘానిస్థాన్‌లకు వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ప్రాజెక్టులు. అఫ్ఘాన్ అభివృద్ధి విషయాన్ని ప్రస్తావించి, అందులో ఇస్లామాబాద్‌కు పాత్ర లేకుండా చేయడాన్ని వివరించడం ద్వారా చాబహార్ ప్రాజెక్టును ఆంక్షల వెలుపలికి తెప్పించుకోవడంలో భారత దౌత్యవర్గాలు సఫలమయ్యాయి. అఫ్ఘానిస్థాన్ అభివృద్ధి, ఆర్థికవృద్ధికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. ఈ వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రాముఖ్యానని మరువలేమని, అయితే విస్తృతంగా చర్చించిన తర్వాత మాత్రమే అనుమతులు మంజూరుచేశామని అన్నారు. 

భారత్‌కు చాలా కీలకం
చాబహార్ పోర్టు పనులను కొనసాగించేం దుకు అమెరికా ఎలాంటి అడ్డంకులు పెట్టక పోవడం భారతదేశానికి అతిపెద్ద దౌత్య విజయం. పాకిస్థాన్‌లో చైనా పెట్టుబడి పెట్టి నిర్మిస్తున్న గ్వదర్ పోర్టుకు పోటీగా.. దానికి 80 కిలోమీటర్ల దూరంలోనే ఇరాన్‌తో కలిసి చాబహార్ పోర్టును భారత్ నిర్మిస్తోంది. ఇది అత్యంత వ్యూహాత్మకమైన చర్య. దీనివల్ల పాక్, చైనాలతో అవసరం లేకుండానే అఫ్ఘానిస్థాన్, ఇతర మధ్య ఆసియా దేశాలకు సరుకులను పంపే అవకాశం భారత్‌కు దక్కుతుంది. తద్వా రా విదేశీ వాణిజ్యం మెరుగుపడుతుంది. దాంతో పాటు.. అత్యవసర సందర్భాల్లో చాబహార్ పోర్టు ను సైనికావసరాలకు కూడా భారత్ వాడుకోవ చ్చు. ఇన్ని రకాలుగా ఉపయోగపడే పోర్టు విస్తర ణ పనులు భారత్‌కే దక్కడంతో వ్యూహాత్మకంగా పెద్ద విజయం సాధించినట్లయింది.

English Title
Heavy comfort to India
Related News