భారీగా నగదు పట్టివేత 

Kazipet police
  • కాజీపేటలో రూ.3.59 కోట్లు స్వాధీనం

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు పట్టుబడుతోంది. కట్టల పాములు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తాజాగా వరంగల్‌లోని కాజీపేట పోలీస్టేషన్ పరిధిలో భారీ ఎత్తున నగదు పట్టుబడింది. ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉన్న రూ.3.59 కోట్ల నగదును వరంగల్ కమిషనరేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వర్ధన్నపేట ప్రజాకూటమికి చెందిన అభ్యర్థి పి.దేవయ్యకు సంబంధించిన ఈ మొత్తాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన ప్రావిన్స్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ వి.రవీందర్ మీడియాకు వెల్లడించారు. కాజీపేట పోలీస్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రావిన్స్‌రెడ్డి అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని విచారించారు. అతడి వద్ద ఉన్న ఓ కవర్‌తో పాటు, రూ.2లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా.. ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన రూ.3,59,19,250 మొత్తాన్ని కాంగ్రెస్ నాయకుడు అమృతరావు ఇంటికి ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బును సులువుగా పంపిణీ చేసేందుకు వీలుగా రూ.2లక్షలు చొప్పున ఒక కవర్లో ప్యాక్ చేసే దానిపై అందాల్సిన కార్యకర్త, గ్రామం పేర్లు రాశారని రవీందర్ తెలిపారు. డబ్బుతో పాటు ఇటీవల బహిరంగ సభ కోసం ఆన్‌లైన్‌లో కూటమి అభ్యర్థి దేవయ్య చేసుకున్న దరఖాస్తును పోలీసులు గుర్తించారు. సొత్తును గుర్తించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను కమిషనర్ అభినందించారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం బలభద్రయ్యపల్లిలో రూ.50లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు కొడంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి నరేందర్రెడ్డి వర్గీయులదిగా అనుమానిస్తున్నారు. ఇటీవలే నరేందర్‌రెడ్డి బంధువు ఫామ్‌హౌస్‌లో రూ.51లక్షలు పట్టుబడిన విషయం తెలిసిందే. అలాగే నల్గొండ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో రూ.6.97లక్షలు, 15కేజీల వెండి, 10 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నగదును తరలిస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎస్‌వోటీ పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఓ ఇంట్లో రూ.5.78లక్షలు స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లా అశ్వరావుపేటలో టీడీపీ కార్యకర్త నుంచి రూ.38వేలు స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి జిల్లా ఆలేరు చెక్‌పోస్టు దగ్గర పోలీసుల తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో ఆటోలో తరలిస్తున్న రూ. 13.4 లక్షలు పట్టుకున్నారు. నల్లగొండ జిల్లా కనగల్ పీఎస్ పరిధిలో పోలీసుల తనిఖీలు చేశారు. బైక్‌పై తరలిస్తున్న రూ.1.28 లక్షలు పట్టుకున్నారు.

నా ఇంట్లో డబ్బు దొరికితే చూపించండి: జూపూడి 
తన ఇంటివద్ద నగదు దొరికిందనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ స్పందించారు. కూకట్‌పల్లి బాలాజీనగర్‌లోని తన నివాసంలో ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు చేశారని, అయితే ఎలాంటి నగదు లేదని వెళ్లిపోయారని ఆయన వెల్లడించారు. కానీ ఇలాంటి గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారో తనకు అర్థం కావడంలేదన్నారు. తాము ఎక్కడ బతకాలో కూడా తెలియడం లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. బంధువులను కూడా తమ ఇంట్లోకి రానీయడంలేదని వాపోయారు. తన ఇంట్లో నగదు దొరికితే చూపించాలని, ఇంట్లో తన భార్య తప్ప ఎవరూ లేరని, ఇదంతా కావాలనే చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, టీడీపీ నేత పెద్దిరెడ్డిని రానీయకుండా టీఆర్‌ఎస్ కార్యకర్తలు జూపూడి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు, నిరసనకారులకు మధ్య కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సంబంధిత వార్తలు