బూడిద కుప్పగా మారింది!

Updated By ManamSun, 10/14/2018 - 01:13
Makutam

imageఅమ్మమ్మ వాళ్ల ఊరు దేనేపల్లె. కడప జిల్లా ముద్దనూరు మండలంలో మా ఊరు యామవరంకు పది కిలోమీటర్ల దూరంలో వాయవ్య దిశగా కొండలు, గుట్టలు, వాగులు, వంకలతో కూడిన దుర్గమారణ్యంతో ఉండేది. అక్కడి మనుషులు నాగరికతకు దూరంగా ప్రత్యేక జీవన విధానంతో, మట్టితో మమేకమైన జీవులుగా బతికేవారు. వ్యవసాయం, కూలిపని తప్ప ఇతర వృత్తులు లేవు. ఉన్నవాళ్లంతా చిన్నకారు రైతులే. నా ఐదారేళ్ల వయసులో మా అమ్మవెంట అడ్డదారిలో కొండలు, వాగులు దాటుకుంటూ దేనేపల్లికి నడిచి వెళ్లేవాణ్ణి. 

మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం గనుక నాన్న మా అమ్మను ఎప్పుడూ పుట్టింటికి పంపించేవారు కాదు. imageఅమ్మకైతే చీకట్లోనే లేచింది మొదలు రాత్రి పొద్దుపోయే వరకు ఒకటే చాకిరి. భయంకరమైన ఆ చాకిరి గుర్తుకొస్తే చాలు నా కళ్లమ్మెట నీళ్లొస్తాయి. కొండకు పోతే, కట్టెల మోపుతో తిరిగొస్తుంది. చేనికి పోతే పశువులకు గడ్డిమోపుతో వస్తుంది. ఇంటి పనంతా చూసుకొని, మళ్లీ మగ్గంలో కూలబడ్తుంది. 

ఇప్పుడు రోడ్డు పడింది కానీ, అప్పట్లో అమ్మమ్మ ఊరుకు వెళ్లాలంటే కాలిబాట చాలా భయంకర స్థితిలో ఉండేది. మా ఊరికీ, దేనేపల్లికీ మధ్య ‘చింతకుంట’ అనే ఊరు వస్తుంది. చింతకుంట ఆనుకొని కొండల మధ్య వచ్చే చెరువు కట్ట మీద నడుస్తూ వెళ్లాలి. కట్టదిగి చాలా దూరం నడిస్తే కానీ దేనేపల్లి కనిపించేది కాదు. ఊరి ప్రవేశ ద్వారం దాటితే, విశాలమైన మైదానంలో పెద్ద పెద్ద రాళ్లతో కట్టిన ఒక పెద్ద బురుజు వస్తుంది. అది నిటారుగా శత్రు దుర్బేధ్యంగా ఉండేది. ఊరిలో ఇండ్లన్నీ పురాతన కట్టడాల్లాగా అప్పట్లో నాకు దర్శనమిచ్చేవి. ఊరి మొదట్లోనే అతి పెద్ద ఆంజనేయస్వామి ఏకశిలా విగ్రహం అభయహస్తంతో నిలబడి ఉంటుంది. ఊరి మధ్యలో పీర్లచావిడి, ప్రక్కనే రామస్వామిగుడి ఉండేది. ఒక్క అంగడే ఆ ఊరికి ఆధారం. పండిన పంటలు అంగడికి వేసి తమకు కావలసిన సరుకులు ఇంటికి తెచ్చుకునేవారు. డబ్బుతో పనిలేదు. 

ఆ ఊరికి మా తాతగారు ఒక పెద్దమనిషి. పేరు దండే వెంకటయ్య. ఎక్కడ ఏ గొడవ జరిగినా, ఎవరి కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్యగానీ, ఆలుమగల మధ్యగానీ చిన్నపాటి ఘర్షణ జరిగినా ఈయనే వెళ్లి వారిని మళ్లీ కలిపి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడేవారు. అందుకే ఊరు ఊరంతా ఆయనంటే ఎంతో గౌరవించేవారు. తలపాగా చుట్టుకొని, పొడుగాటి కర్ర చేతిలో పట్టుకొని వెళ్లేవారు. అమ్మమ్మకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. వారింట్లో మగ్గం లేదు. నేతపని లేదు. వ్యవసాయమే వారికి జీవనాధారం. మా పెద్దమ్మ పెద్దనాగమ్మ, అమ్మ చిన్ననాగమ్మ, చిన్నమ్మ లక్ష్మమ్మ. మేనమామ నాగప్ప. ఇప్పుడు మా పెద్దమ్మ, మా అమ్మ ఇద్దరూ ఈ లోకంలో లేరు.
మా మేనమామ మా తాతకు ఒకే ఒక కొడుకు కావడంతో చిన్నప్పటి నుండి ఆడిందే ఆటగా గడిచిపోయింది. కష్టపడి పనిచేసేవాడు కాదు. తండ్రి ఆధారంతో ఉన్న వ్యవసాయభూమిని సాగు చేసుకుంటూ విలాసంగా గడిపేవాడని మా అమ్మ చెప్పగా విన్నాను. మా తాతగారున్నంత కాలం ఈ దర్జా కొనసాగింది. ఆపైన ఆస్తి అంతా హారతి కర్పూరంలా కరిగించేశాడు. తాగుడు, జూదం, ఇతర వ్యసనాల వల్ల అప్పులపాలై ఉన్న భూమిని కూడా అమ్మేసుకున్నాడు. మా తాతగారు కాలం చేశాక మా అవ్వకు ఆ ఇంటిలో తిండికూడా కరువైంది. చాలా దీనావస్థలో హైదరాబాద్‌లోని చిన్నకూతురు దగ్గర ఉంటూ, అక్కడే కన్ను మూసింది.

అప్పుడే ఊర్లో ఫ్యాక్షన్ మొదలైంది. వారి కక్షలకు తట్టుకోలేక కొన్ని కుటుంబాలు ఊరు విడిచి ముద్దనూరు మండల కేంద్రానికి చేరుకున్నాయి. మా మేనమామ కూడా ఆ ఫ్యాక్షన్ గొడవల్లో ముద్దాయిగా ఉండి యావజ్జీవ జైలుశిక్షను అనుభవించాడు. ఇలా పచ్చగా ఉన్న ఊరు కక్షలతో భగ్గున మండి వల్లకాడైంది. శిక్ష పూర్తి చేసుకొని ఇంటికి తిరిగొచ్చాక మా మేనమామ పేదరికంతో పోరాటం చేసి, ఇటీవలే చనిపోయాడు. ఆయన పిల్లలు దిక్కులు చూస్తూ, ఊరిలోనే దిగాలుగా కూలి పనులు చేసుకుంటూ బతుకీడుస్తున్నారు. మా అత్తయ్య వృద్ధాప్యంలో మంచం తీసుకొని కాలం వెళ్లబుచ్చుతూ ఉంది.

చిన్నప్పుడు మా అమ్మవెంట వెళ్లి చూసిన ఊరు కదా. అక్కడ ప్రత్యేకంగా ఊరు ఊరంతా కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు లెక్కచెయ్యక ఏకమై జరుపుకునే పీర్ల పండగను, ఆ సందడిని చూసి తీరాలి. చిన్నపిల్లాడు మొదలుకొని, ముసలాయన వరకూ పీర్లు ఎత్తుకుని నిప్పుల గుండంలో అలవోకగా నడిచిపోతుంటే నా ఒళ్లు గగుర్పొడిచేది. కాళ్లు ఏమాత్రం కాలకుండా సునాయాసంగా నిప్పు కణికల మీద నడిచి వెళ్లేవారు. వారు ఎత్తుకున్న పీర్లలో అంత మహిమ ఉందా అని ఆశ్చర్యపోయేవాణ్ణి!

అలాంటి మా అవ్వగారి ఊరు దేనేపల్లి ఇప్పుడేమైంది? అమాయకమైన ఆ పల్లెపట్టు సౌందర్యం ఇప్పుడెందుకు బూడిదకుప్పగా మారిపోయింది? ఊరు విడిచినవాళ్లంతా బాగుపడ్డారు. అందులో మా కుటుంబం కూడా ఉంది. ఊరు వదల్లేక, కాడి వదల్లేక, వల్లకాడుగా మారినా వదల్లేక జీవచ్ఛవాల్లాగా బతుకులీడుస్తున్నారని ఇటీవల మా యామవరంలోని దూరపు బంధువులు చెప్పగా విన్నాను. నేనైతే గత యాభై ఏళ్లుగా ఆ ఊరి ముఖం చూడలేదు. ఇప్పుడక్కడ మిగిలి ఉన్న మనుషులు ఎలా ఉన్నారో, ఏమో! ఇప్పుడైనా ఒక్కసారి వెళ్లివద్దామా.. అని కోరికగా ఉంది. ఆ పని చేస్తాను.

- డా॥ రాధేయ
సెల్: 9985171411
(ఈ వ్యాసం ‘మకుటం’కు అంది, ప్రచురించేలోగా రాధేయగారి అర్ధాంగి కాలధర్మం చెందడం అతిపెద్ద విషాదం)

English Title
Has become a gray pile!
Related News