స్నేహితుడా...స్నేహితుడా...

Updated By ManamSat, 08/04/2018 - 15:59
happy friendship day


happy friendship day సృష్టిలో తల్లిదండ్రులు, తోబుట్టువులను మనం ఎన్నుకోలేం కానీ... స్నేహితుడిని మాత్రం మనం ఎంచుకునే అవకాశం ఉంటుంది. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఇలా అన్ని బంధాలను దేవుడు ఇస్తాడు. అయితే ఒక స్నేహితుణ్ని మాత్రం మనం వెతుకుంటే దొరికేవారు. మన ప్రతి కష్టాసుఖాల్లో మన వెంట ఉండే వాడే స్నేహితుడు. అలాంటి వాళ్లు దొరకడం ఒక వరం. 


అందుకే ఓ సినీ కవి అన్నారు...‘స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా... కడదాక నీడ లాగ నిను వీడిపోదు రా ఈ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిదీ ఈ స్నేహమొకటేను రా’ అని.  ఈ లోకంలో నా అనేవారు, బంధువులు లేకపోవచ్చు కానీ స్నేహితులు లేనివారు ఉండరేమో. అందుకే అంటారు నీ స్నేహితుడు ఎవరో చెబితే.. నువ్వు ఎంటో చెబుతాం అని. 

మనసులు కలిసిన స్నేహం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. రక్త సంబంధీకుల కన్నా... స్నేహానికి ప్రాణమిచ్చేవారు ఇప్పటికీ మనం చూస్తుంటాం. చివరికి ఈ స్నేహ బంధం ఒక్కోసారి ప్రాణం కూడా ఇచ్చేస్తుంది. స్నేహం ప్రకృతి వంటిది. ఇంట్లో చెప్పలేని సమస్యలు, బాధలు సైతం వీరితో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పు పొందుతాం. అదే స్నేహం. 

అందుకే ఏ పండుగను ప్రపంచ వ్యాప్తంగా అందరూ కలిసి జరుపుకోరు కానీ స్నేహితుల రోజును మాత్రం అందరూ ఘనంగా జరుపుకుంటారు. ఆగస్టు మొదటి ఆదివారానికి ఓ ప్రత్యేకత ఉంది. అదే ఫ్రెండ్షిప్ డే. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరుకు జరుపుకునే పండుగ. అది స్త్రీ అయినా పురుషుడు అయినా చిన్న, పెద్ద, కుల, మత, భాష, దేశం అని తేడాలు లేకుండా అందరూ సంతోషంగా జరుపుకునే ‘స్నేహితుల రోజు’. ఏడాది మొత్తం ఎంత దూరంగా ఉన్నప్పటికీ ఈ ఒక్క రోజు మాత్రం స్నేహితులు అందరూ కలవడానికి ప్రయత్నిస్తారు. 

happy friendship day
అసలు ..
స్నేహితుల రోజు ఎందుకు జరుపుకుంటారు? 


ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా ? దీని వెనుక కొన్ని ఆసక్తికర కథనాలు ఉన్నాయి. అందులో ఒకటి.. 1925 సంవత్సరంలో ఆగష్టు మొదటి శనివారం అమెరికాలో ఒక వ్యక్తి తప్పు చెయ్యడం వలన అతడికి మరణశిక్ష వేశారు. అది తెలిసిన అతడి ప్రాణ స్నేహితుడు మరుసటి రోజే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న అప్పటి అమెరికా అధ్యకుడు ఆగష్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవంగా ప్రకటించగా.. అప్పటి నుంచి ఫ్రెండ్షిప్‌ డే జరుపుకుంటున్నాం అని. 

అయితే 1930లో గ్రీటింగ్ కార్డ్స్ అమ్ముకునే ఒక సాధారణ వ్యక్తి తన బిజినెస్ బాగా జరగటానికి ఈ స్నేహితుల దినోత్సవాన్ని తీసుకొచ్చినట్టు కూడా కొన్ని కథలు ఉన్నాయి. ఏది ఏమైనా స్నేహితుల దినోత్సవం ద్వారా తమ ఫ్రెండ్‌కు దగ్గరవుతూ తమ బంధాన్ని మరింత పెంచుకుంటుంటారు.

English Title
happy friendship day
Related News