గన్‌మెన్ కాల్పులు: ధ్రువ్ బ్రెయిన్ డెడ్

Updated By ManamMon, 10/15/2018 - 17:39
dhruv brain dead
  • జడ్జి కుమారుడికి బ్రెయిన్ డెడ్

  • భార్య రితూ ఆదివారం మృతి

  • అదే రోజు రాత్రి ధ్రువ్ బ్రెయిన్ డెడ్

  • నిందితుడు  మహిపాల్‌కు నాలుగు రోజుల కస్టడీ

Judge son brain dead

గురుగ్రామ్: హరియాణాలోని గురుగ్రామ్‌లో గార్డు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన న్యాయమూర్తి కృష్ణన్‌కాంత్ కుమారుడు ధ్రువ్(18)కు ఆదివారం రాత్రి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన భార్య రితూ(45) అదే రోజు ప్రాణాలు కోల్పోయారు. రితూ, ధ్రువ్‌లపై జడ్జి కృష్ణన్‌కాంత్ గన్‌మెన్ శనివారం కాల్పులకు తెగబడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ధ్రువ్‌కు తలలో తూటా దిగింది. దీంతో అతడికి బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అతడిని జీవనాధార వ్యవస్థపై ఉంచారు. ధ్రువ్ కోలుకుంటే అద్భుతం జరిగినట్టేనని మెడికల్ అధికారి వెల్లడించారు. 

కృష్ణన్‌కాంత్ గురుగ్రామ్‌లో అదనపు సెషన్స్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. హెడ్‌కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉన్న మహిపాల్ రెండేళ్లుగా ఆయనకు గన్‌మెన్‌గా పని చేస్తున్నాడు. కాగా నిందితుడు మహిపాల్‌ పోలీసుల విచారణలో కూడా కాల్పులపై సరైన కారణాలు వెల్లడించలేదని, జడ్జి కుటుంబం ప్రవర్తన నచ్చనందునే దాడికి పాల్పడినట్లు చెప్పాడని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. గురుగ్రామ్ కోర్టు అతడికి నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది. కాగా ఈ కేసును  ప్రత్యేక విచారణ బృందం అన్ని కోణల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  కాగా శనివారం మధ్యాహ్నం నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే జడ్జీ భార్య, కుమారుడిపై గన్‌మన్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.

English Title
Gurugram judge son dhruv declared brain dead
Related News